సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు
సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు:
ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు ,ఒళ్ళు నొప్పులు ,కండరాల నొప్పులు అంటూ వివిధ రకాల నొప్పులతో బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు అందులో సయాటికా నొప్పితో బాధపడేవారి సంఖ్యా ఎక్కువే అని చెప్పవచ్చు . సయాటికా అంటే ఒక నొప్పి లేదా జబ్బుగా మాత్రమే అందరికి తెలుసు కానీ సయాటికా అనేది మన శరీరములో ఉండే నరం అని చాలా తక్కువ మందికి తెలుసు.
మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటిక నరం. ఇది నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై పిరుదుల నుంచి పిక్కలకూ, అక్కడనుంచి దిగువకూ ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలులో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను ఇది నియంత్రిస్తుంది. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది.
వ్యాధి లక్షణాలు :
***నొప్పి పిరుదుల భాగం నుండి కాళ్లలో పిక్కల వరకు ప్రాకుతుంది .
***నొప్పి సూదులతో పొడుస్తున్నట్టు మరియు మండినట్లుగాను ఉంటుంది.సయాటిక నరం ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు
***సయాటిక నరం ఒత్తుకుపోవడం వల్ల కాలులో తిమ్మిరిగా అనిపిస్తుంది.
***ముఖ్యంగా నరం ప్రయాణించే మార్గంలో- అంటే కాలులోనూ, పాదంలోనూ మొద్దుబారినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక కాలులో నొప్పిగా అనిపిస్తే మరో కాలులో తిమ్మిర్లుగా అనిపిస్తుంది.
దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడుగాని, ఎక్కువసేపు కూర్చున్నపుడుగాని సమస్య తీవ్రతరమవ్వవచ్చు. రెండు కాళ్ళలోనూ ఒకే స్థాయిలో కాకుండా సాధారణంగా ఏదో ఒక కాలులో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో కనిపిస్తాయి.
వ్యాధి కారణాలు :
తుంటి భాగము నుండి కాళ్లకు ప్రసరించే నరముల మీద ఒత్తిడి పడటం ముఖ్య కారణము .
ఎక్కువ సేపు నిలబడి ఉండడం వలన ,
హెర్నియేటెడ్ డిస్కు : హెర్నియేషన్ అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు వెలుపలకు చొచ్చుకు వచ్చి వెన్నుపామును నొక్కటం. సయాటికా నొప్పికి అతి ప్రధానమైన కారణమిది. దీనివల్ల సయాటిక నరం ప్రారంభపు భాగంలో ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది.
Disc Prolapse :నడుములో disc ప్రక్కకు జరిగి కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది దీనిని slip disc అని కూడ అంటారు.
spinal stenosis :ఏదైనా కారణం చేత వెన్నుపాము ప్రయాణించే కెనాల్ ఇరుకుగా మారితే కెనాల్ stenosis అంటారు. ఇలా జరగటం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాల అధీనంలో ఉండే కండరాల్లో నొప్పి మొదలు అవుతుంది . వెన్ను చివరి భాగంలో ఒత్తిడి పడితే నడుము భాగానికి, కటి భాగానికి ప్రయాణించే నరాలు దెబ్బతింటాయి.
spinal tumors :వెన్నుపాములోని అంతర్గత భాగంలోగాని, వెన్నుపామును కప్పి ఉంచే పొరల్లో గాని, వెన్నుపాముకు, వెన్నుపూసలకూ మధ్యన ఉండే ప్రదేశంలోగాని పెరుగుదలలు తయారైనప్పుడు వెన్నుపాము నొక్కుకుపోయి సైయాటికా వస్తుంది.
Spondylolisthesis :వెన్నుపూసలు వాటి యొక్క నిర్మాణ క్రమము తప్పడము వలన నరాల మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
తీసుకోవల్సిన జాగ్రత్తలు:
సయాటికా నొప్పితో బాధపడేవారు ఎక్కువగా నిలబడి పని చెయ్యకూడదు.
ఈ నొప్పి తో బాధపడేవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వలన ఈ నొప్పి నుండి త్వరగా బయటపడగలరు.
అతి నడక ,టూ వీలర్ పై ప్రయాణము ,అతి వ్యాయామము వలన నొప్పి పెరుగుతుంది కావున వీటిని తగ్గించాలి.
ఎక్కువ సేపు కూర్చొని ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి.
స్త్రీలు డెలివరీ తరువాత నడుముకి కట్టువేసుకొని ఉండాలి.
నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని విరివిగా వాడాలి .
దుంపలు ,మసాలా పదార్థాల మరియు పుల్లనిపదార్థాల సేవనము తగ్గించాలి.
కాఫీ మరియు టీ తాగడం తగ్గించాలి .
ఈ నొప్పి తో బాధపడేవారు ఆముదము నూనెను వేడి నీటిలో కలిపి సేవించడం వలన నొప్పి బాధ నుండి విముక్తులు అవుతారు .
పచ్చ కర్పూరము మరియు నువ్వులనూనె కలిపి బాగా తుంటి భాగము నుండి కాలి పాదం వరకు మర్దన చేసి వేడి నీళ్ళతో కాపాడము పెట్టడము వలన నొప్పి నుండి ఉపశమనము కలుగుతుంది.
Ayurveda Treatment for Sciatica : కటి వస్తి:
పంచకర్మ- పరిపూర్ణ చికిత్స:
ఆయుర్వేదము ప్రకారముగా సయాటికా అనేది వాత దోష ప్రకోపం వలన సంభవిస్తుంది .శరీరములో పెరిగిన వాత దోషము వలన ఈ నరము దెబ్బతినడం ,నొప్పులు ,ఎండిపోవడము వంటివి కనిపిస్తాయి .ఆయుర్వేద పంచకర్మ చికిత్స ద్వారా వాత దోషము ని తగ్గించి సయాటికా నరముకు బలము మరియు పునర్జీవన శక్తిని కలిగించి మనిషి తన సాధారణ జీవనముకు ఇబ్బంది లేకుండా ఉండే జీవనాన్ని ప్రసాదించడములో దిట్ట అని చెప్పవచ్చు.
పంచకర్మ చికిత్స ద్వారా వ్యాధి మూల కారణాలను తొలగించడమే కాక , కండరాలు, ఎముకలు, కీళ్ళలోని కణాలకు శక్తిని పెంచి , వాత దోషాలను హరించి కణాలు యొక్క పని తీరుని మెరుగు పరచడమే కాక , వ్యాధి మరలా రాకుండా కాపాడుతుంది.
నడుము నెప్పికి, సయాటికాకు పనికి వచ్చే వ్యాయామాలు:
నడుము నెప్పి తాత్కాలికంగా తగ్గటానికి నెప్పి మందులు (pain killers). ఈ మందులు లోపలి జబ్బుని ఏమీ చెయ్య లేవు. లోపలి జబ్బు తనంత తానే తగ్గుతుంది. ఒకోసారి మళ్ళీ మళ్ళీ తిరుగబెడుతుంది. జబ్బు త్వరగా తగ్గటానికి, తిరుగ బెట్టకుండా ఉండటానికి ఎక్సరసైజు ప్రోగ్రాం పనికివస్తుంది. అరుదుగా, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆపరేషన్ అవసరం కావచ్చును. ఒకసారి డాక్టర్ కి చూపించుకోవాలి.
ఎక్సరసైజు ప్రోగ్రాము కొన్నాళ్ళు చేసి మానేసేది కాదు. దీన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి.
వ్యాయామం (ఎక్సరసైజు ప్రోగ్రాం) ముందుగానే మొదలుపెట్టాలి. ఐతే చేసే వ్యాయామం నెప్పి తీవ్రతను బట్టి ఉండాలి. వ్యాయామం వలన వెంటనే కాస్త నెప్పి అనిపించినా, ఆ నెప్పి 15 నిమిషాల లోపులో తగ్గిపోవాలి. నెప్పి విషమించే వ్యాయామాలు చేయనక్కరలేదు. వ్యాయామాలని తక్కువ స్థాయిలో మొదలు పెట్టాలి. క్రమేపీ ఎక్కువ చెయ్యాలి.
నెప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చేయవలసిన వ్యాయామాలకు కొన్ని ఉదాహరణలు:
Knee-to-chest stretch మోకాలు రొమ్ముపైకి
వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లు వంచాలి. పాదాలు నేలమీద ఉండాలి. రెండు చేతులతోను ఒక మోకాలును అదేవైపు రొమ్ము మీదకి లాక్కోవాలి. 10 సెకండ్లు అలా ఉంచి కాలు దించాలి. అప్పుడు రెండవ పక్క చెయ్యాలి. 3 నుండి 10 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం సాయంత్రం.
Lower back rotational stretch నడుము తిప్పు
వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లు వంచాలి. పాదాలు నేలమీద ఉండాలి.భుజాలను నేలకు ఆనించి ఉంచాలి. మోకాళ్ళు రెండూ ఒకపక్కకు వాల్చి నేలకు అంటుకునేలా 10 సెకండ్లు ఉంచాలి. అప్పుడు రెండవ వైపు చెయ్యాలి. 3 నుండి 10 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం సాయంత్రం.
Lower back flexibility exercise నడుము లేపు, దింపు
వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లు వంచాలి. పాదాలు నేలమీద ఉండాలి. భుజాలను, పిర్రలను నేలకు ఆనించి ఉంచి నడుముని లేపి 5 సెకండ్లు ఉంచి దించాలి. 5 నుండి 30 సార్లు. కనీసం ఉదయం సాయంత్రం.
Bridge exercise బ్రిడ్జి
వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లు వంచాలి. పాదాలు నేలమీద ఉండాలి. పిర్రలను లేపాలి. భుజాలు, నడుము, పిర్రలు, మోకాళ్ళు ఒక లైనులోనికి వచ్చేలా పెట్టి 3 నుండి 10 సెకండ్లు ఉంచాలి. 5 నుండి 10 సార్లు. కనీసం ఉదయం, సాయంత్రం.
Partial Crunches పొట్ట బిగింపు
వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లు వంచాలి. పాదాలు నేలమీద ఉండాలి. చేతులు తలకింద పెట్టుకోవాలి. పొట్టలో కండరాలను బిగించి భుజాలను లేపాలి. భుజాలు లేవకుండా, తల ఒక్కటే లేపకూడదు. మొదట్లో కొంచెం లేపినా చాలు. 3 నుండి 5 సెకండ్లు ఆలా ఉంచాలి. 5 నుండి 10 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం, సాయంత్రం.
Cat stretch పిల్లి లాగా
చేతులు మోకాళ్ళ మీద శరీరాన్ని లేపాలి. శరీరాన్ని విల్లులా పైకి, కిందకు వంచాలి, నెమ్మదిగా. 5 నుండి పది సార్లు. కనీసం ఉదయం, సాయంత్రం.
Press-up Back Extensions నడుము వంపు వెనక్కి
పొట్టమీద పడుకోవాలి. తలను, భుజాలను లేపాలి. నెప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెమే లేపగలరు. నెప్పి తగ్గినకొద్దీ ఎక్కువ లేపవచ్చును. తొడ, తుంటి భాగాలు నేలకు అంటుకునే ఉండాలి. 10 సెకండ్లు ఉంచాలి. 3 నుండి 5 సార్లు. కనీసం ఉదయం, సాయంత్రం.
Bird Dog పక్షి, కుక్క
శరీరాన్ని చేతులు మోకాళ్ళమీద ఉంచండి. కుడి కాలు తిన్నగా శరీరం లెవెల్ కి లేపండి. 5 నుండి 10 సెకండ్లు ఉంచండి. ఒక పక్కకి వంగిపోవద్దు. రెండవ వైపు చెయ్యండి. అలవాటు ఐన తరవాత, కుడి కాలుతో పాటు, ఎడమ చెయ్యి, ఎడమ కాలుతోపాటు కుడి చెయ్యి తిన్నగా లేపండి. 3 నుండి 5 సార్లు. కనీసం ఉదయం, సాయంత్రం.
Superman stretch: సూపర్ మాన్ పోజు
బోర్లా పడుకుని చేతులు ముందుకు తిన్నగా చాపాలి. కుడి కాలు తిన్నగా లేపి 3 నుండి 10 సెకండ్లు ఉంచాలి. తరవాత ఎడమ కాలు లేపి అలాగే చెయ్యాలి. కొంచెం అలవాటు ఐన తరవాత కుడి కాలుతోపాటు ఎడం చెయ్యి, ఎడమ కాలుతోపాటు కుడి చెయ్యి లేపాలి. బాగా అలవాటు ఐన తరవాత రెండు చేతులు, రెండు కాళ్ళు ఒకేసారి లేపవచ్చును. 3 నుండి 5 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం, సాయంత్రం.
Seated lower back rotational stretch కూర్చుని నడుము తిప్పు
పీటపై నిటారుగా కూర్చోవాలి. కుడి కాలును ఎడమ కాలుఫై వెయ్యాలి. ఎడమ చేతిని తిన్నగా పెట్టి, కుడి తొడపై నొక్కి నడుమును వంగినంత తిప్పాలి. 10 సెకండ్లు ఉంచాలి. అప్పుడు రెండవ పక్క చెయ్యాలి. 3 నుండి 10 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం, సాయంత్రం.
Shoulder blade squeeze భుజాలు బిగింపు
పీటమీద తిన్నగా కూర్చోవాలి. భుజం గూడలను దగ్గరకు లాక్కోవాలి. 5 నుండి 10 సెకండ్లు ఉంచి వదిలి వెయ్యాలి. 3 నుండి 10 సార్లు చెయ్యాలి. కనీసం ఉదయం, సాయంత్రం
గమనిక: మరీ సులభంగా ఉన్న వ్యాయామాలు మరీ కష్టంగా ఉన్న వ్యాయామాలు చెయ్యవద్దు. సరైన వ్యాయామాలు చేస్తుంటే నడుము మెత్తబడి కదలిక తాత్కాలికంగా సులువౌవుతుంది. గుణం వెంటనే కనబడుతుంది.
నడక:
నడక పూర్తిగా ఆపేసే అవసరం ఎప్పుడూ ఉండదు. బెడ్ రెస్టు మంచిది కాదు. మొదట్లో బాత్రూం కి నడిచినా వ్యాయామమే అవుతుంది. క్రమేపీ నడక ఎక్కువ చెయ్యండి. నడక బదులు సైకిల్ తొక్కవచ్చును. ఈత కొట్టవచ్చును. Treadmill లేదా stationary byke వాడవచ్చును. కాస్త నెప్పి తగ్గిన తరవాత కనీసం రోజుకు అరగంట, వారానికి 5 రోజులు. ఎంత చేస్తే అంత మంచిది. నడక తరవాత నడుము బిగుసుకొంటుంది. మెత్తబడటానికి పైన చూపించిన నడుము వ్యాయామాలు (stretches), ఒక పావుగంట చెయ్యాలి.
కొన్ని వ్యాయామాల వలన నడుము నెప్పి ఎక్కువైపోవచ్చును. ఉదాహరణలు ఈ బొమ్మలలో చూడండి. ఈ వ్యాయామాలు, నడుము బాగా దృఢమైన తరవాతనే చెయ్యాలి.