Paralysis | పక్షవాతం ఎందుకు వస్తుంది..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
World Stroke Day | జీవితం ఒక తోలుబొమ్మలాట అయితే.. మనిషి పాత్రధారి, మెదడు అంతర్గత సూత్రధారి. జీవి నియంత్రణ వ్యవస్థ పగ్గాలన్నీ మెదడు దగ్గరే ఉంటాయి. మెదడు ఆదేశిస్తేనే.. కాలు కదులుతుంది, చేయి ఊగుతుంది, ఆలోచన ముందుకు సాగుతుంది. సాక్షాత్తు సూత్రధారే చిక్కుల్లో పడితే.. మెదడుకే సమస్య వస్తే? పక్షవాతం బారినపడినట్టే! అక్టోబర్ 29న ‘పక్షవాత అవగాహన దినం’. ఈ సందర్భంగా మనిషి శరీరభాగాలను మొద్దుబార్చే ఈ మహమ్మారి లక్షణాలు,చికిత్స విధానాలు, నివారణ మార్గాల గురించి..
అప్పటి వరకూ మామూలుగా ఉన్న వ్యక్తికి.. హఠాత్తుగా చెయ్యి మొద్దుబారుతుంది. కాలు కదపడమూ కష్టమే అవుతుంది. మూతి వంకర్లు పోతుంది, మాట పడిపోతుంది. మాట్లాడినా నత్తినత్తిగానే. శరీరం సమతూకం కోల్పోతుంది. చూపులో అస్పష్టత. ఒంట్లో మగతగా ఉంటుంది. స్పందనలు ఉండవు. విపరీతమైన తలనొప్పి.
..ఇవన్నీ ‘పక్షవాతం’ లేదా ‘బ్రెయిన్ స్ట్రోక్’ లక్షణాలే. లక్ష మందిలో సగటున 150 మంది ఏటా పక్షవాతానికి గురవుతున్నట్టు అంచనా. కొవిడ్ రోగుల్లో, కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఆ ఆస్కారం మరింత ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షవాతం అనేది ఏ అరవైలలోనో వస్తుందన్నది అపోహే. మారుతున్న జీవనశైలి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, ధూమపానం తదితర కారణాల వల్ల 40 ఏండ్లలోపు వారిలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పక్షవాతం రెండు రకాలు
మొదటిది.. ఇస్కిమిక్ స్ట్రోక్
మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అవరోధాలు లేదా గడ్డలు (క్లాట్స్) ఏర్పడటం వల్ల వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో 85 శాతం ఈ తరహావే.
రెండోది.. హీమరేజిక్ స్ట్రోక్
మెదడులో నరాలు చిట్లడం వల్ల రక్తస్రావం జరిగినప్పుడు వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో దీని వాటా 15 శాతం. రెండు రకాల స్ట్రోక్‌లు కూడా ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
నివారణ సాధ్యమే
పక్షవాతం అనగానే భయపడాల్సిన పన్లేదు. రోగిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకువెళ్తే సురక్షితంగా కాపాడుకోవచ్చు. రెండు రకాల స్ట్రోక్లకూ వివిధ చికిత్సలు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్‌తో రోగి హాస్పిటల్లో చేరగానే, అది ఇస్కిమిక్ స్ట్రోకా, హీమరేజ్ స్ట్రోకా అన్నది నిర్ధారిస్తారు. దీనికోసం సీటీ స్కాన్ కానీ, ఎంఆర్టీ స్కాన్ కానీ చేస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే, రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని దేనికదే ప్రత్యేకంగా గానీ, లేదంటే రెండిటినీ కలిపిగానీ అందిస్తారు.
మొదటి రకం చికిత్స.. థ్రాంబోలైసిస్
ఈ పద్ధతిలో, రక్తనాళాల్లో గడ్డల్ని తొలగించే ఔషధాన్ని ఇంజెక్షన్ ద్వారా ఒంట్లోకి ఎక్కిస్తారు. అయితే, సమస్య మొదలైన 4-5 గంటలలోపే రోగిని హాస్పిటల్లో చేర్పిస్తేనే ఇది సాధ్యం అవుతుంది.
ఈ సమయంలో రోగులకు టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) లేదా టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు. దీనివల్ల రక్త సరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. రక్తనాళాల్లో అవరోధాలు చిన్నవైనప్పుడు, ఈ ఇంజక్షన్‌తో సమస్య తీరిపోతుంది.
రెండో రకం చికిత్స.. మెకానికల్ థ్రాంబెక్టమీ
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో గడ్డలను తొలగించేందుకు ఇదో పద్ధతి. అయితే, దీన్ని పక్షవాతానికి గురైన 24 గంటల్లోపు చేయాలి. రక్తనాళాల్లో ఆటంకం పెద్దగా ఉన్నప్పుడు థ్రాంబోలైటిక్ ఔషధాలు ఇవ్వకూడదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా మెకానికల్ థ్రాంబెక్టమీ చికిత్సను ఎంచుకుంటారు వైద్యులు. ఈ ప్రక్రియలో మెదడుకు ఎలాంటి కోతలూ పెట్టరు. కుట్లు కూడా పడవు. బుట్టను పోలిన ఓ పరికరం సాయంతో ఒక చిన్న గొట్టాన్ని కాలి రక్తనాళం ద్వారా శరీరంలోకి పంపిస్తారు. తర్వాత, ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా మెదడు నాళాలకు చేరేలా చూస్తారు. అలా మెదడులోని గడ్డలను తొలగిస్తారు. మత్తుమందు (లోకల్ అనస్థీషియా) ఇచ్చాకే ఈ చికిత్స చేస్తారు. మొత్తం చికిత్సకు గంట సమయం పడుతుంది. ఇక హీమరేజిక్ స్ట్రోక్‌కు అయితే, ముందుగా రక్తపోటును నియంత్రణలోకి తీసుకువస్తారు. రక్తస్రావాన్ని నివారించడానికి దెబ్బతిన్న నాళాలను క్లిప్పుల ద్వారా మూసేస్తారు. లేదంటే, ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా రక్తస్రావానికి అడ్డుకట్ట వేస్తారు.
ఆలస్యమయ్యేకొద్దీ..
బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలన్నీ నిర్ణీత సమయంలోపే చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైన ప్రతి నిమిషానికి మెదడులోని 20 లక్షల న్యూరాన్లను నష్టపోతాడు రోగి. దీంతో కోలుకోవడం కష్టం అవుతుంది. అందుకే, సాధ్యమైనంత త్వరగా మెదడుకు రక్త ప్రసరణ జరిగేలా చూడాలి. అప్పుడే, మెదడు కణాలు నశించిపోకుండా నివారించగలం. థ్రాంబోలైసిస్, థ్రాంబెక్టమీ చికిత్సల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ కారకాలను నివారించవచ్చు.
కారణాలేమిటి? నివారణ ఎలా?
జీవన శైలి సమస్యలైన ధూమపానం, మధుమేహం, అధిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తాయి. ఈ రుగ్మత బారిన పడకూడదంటే… కదలకుండా ఒకేచోట కూర్చునే జీవనశైలిని వదిలించుకోవాలి. ధూమపానం మానుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోజువారీగా తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌ను దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఆత్మీయుల నడకలో, మాటలో ఏ మాత్రం తేడా కనిపించినా ఉపేక్షించడానికి వీల్లేదు. మహిళలతో పోలిస్తే పురుషులకే పక్షవాతం వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
గుర్తుంచుకోండి…
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో ఏర్పడే అవరోధాల వల్లే చాలావరకు పక్షవాతం వస్తుంది. థ్రాంబోలైసిస్, థ్రాంబెక్టమీ చికిత్సల ద్వారా మెదడుకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేయగలిగితే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. రోగ లక్షణాలను వెంటనే గుర్తించాలి. తగిన సదుపాయాలు ఉన్న హాస్పిటల్లో చేర్పించి, మంచి చికిత్స అందిస్తే సురక్షితంగా ఒడ్డునపడతారు.
కొవిడ్ బ్రెయిన్ స్ట్రోక్
రెండేండ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కొవిడ్. ఈ వైరస్ సోకిన యాక్టివ్ రోగులకు, దానినుంచి కోలుకున్న వారికి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. వీరికి రక్తంలో గడ్డలు ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇన్ఫ్లమేటరీ మార్కర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న కొవిడ్ రోగులు వైద్యుడి పర్యవేక్షణలో రక్తాన్ని పలుచన చేసే చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి