8, నవంబర్ 2021, సోమవారం

పీజియో థెరపీ ఉపయోగం ఏమిటే అవగాహనా లింక్స్ లో చూడాలి

ఫిట్‌నెస్‌కి ఫిజియో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

చక్రం తేలికగా తిరగాలంటే ఇరుసులో నూనె వేయాలి. అలాగే కండరాలు, కీళ్లు సమర్థంగా పని చేయాలంటే వాటిని సులువుగా కదల్చగలిగే ఫిజియోథెరపీ చేయాలి! ప్రమాదాలు, సర్జరీలు, వృద్ధాప్యం...ఇలా ఏదో ఒక దశలో మనకు ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. దానితో కలిగే ప్రయోజనాలు, ప్రాధాన్యతలు ఇవే!
 
ఉదయాన్నే మెడ నొప్పితో లేస్తాం. తల తిప్పాలంటే భరించలేనంత నొప్పి. పక్కకు తిరిగి చూడాలన్నా శరీరాన్నంతా కదిలించాల్సి వస్తుంది. నిద్రలో పట్టింది, నిద్రలోనే పోవాలనే ఉద్దేశంతో తల కింద దిండు లేకుండా పడుకోవటం లేదా నేల మీద పడుకోవటం లాంటి చిట్కాలు అనుసరిస్తాం. కానీ పట్టేసింది మెడ కాదు...మెడలోని కండరాలు. వాటిని వదులు చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఈ విషయం గ్రహించకుండా రోజుల తరబడి నొప్పిని భరిస్తాం. ఇలాంటప్పుడే ఫిజయోథెరపీని ఆశ్రయించాలి.
 
నొప్పికి కారణమైన బిగుసుకున్న కండరాలను వదులు చేయటం, వాటిని బలపరచటం, కదలికలను పెంచటం ద్వారా నొప్పిని అదుపులోకి తెచ్చే వైద్య ప్రక్రియ ఫిజియోథెరపీ. పూర్వం తీసుకున్న ఆహారానికి తగిన వ్యాయామం శరీరానికి అందేది. దాంతో కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు వేధించేవి కావు. కానీ ఇప్పుడు ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే జీవనశైలిని అనుసరిస్తున్నాం. దాంతో శరీరానికి తగినంత వ్యాయామం కొరవడి, రకరకాల నొప్పులు వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయో అలాంటి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది ఫిజియోథెరపీ.
 
కొన్ని సందర్భాల్లో వైద్యులు మందులతోపాటు ఫిజియో థెరపీని సూచిస్తారు. కానీ వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించం. నొప్పి అదుపులోకి రాగానే వైద్యులు సూచించినంత కాలం ఫిజియో థెరపీ చికిత్స తీసుకోం. అలాంటి వ్యాయామాల వల్ల పెద్దగా ఫలితం ఉండదని, మందులతోనే ఆరోగ్యం కుదుట పడుతుందనే అపోహతో వ్యాయామాలు మానేస్తాం. ఫలితంగా కొద్ది రోజుల్లోనే తిరిగి నొప్పి వేధించటం మొదలుపెడుతుంది. దాంతో తిరిగి వైద్యుల దగ్గరికి పరుగెత్తుతాం! నిజానికి ఫిజియోథెరపీది వైద్య చికిత్సలో ఎంతో కీలకమైన పాత్ర.
 
ఫిజియోథెరపీ సూత్రం ఇదే!
ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైప్‌ అండ్‌ టైమ్‌....ఫిజియోథెరపీ సూత్రం. ఎంత తరచుగా, ఎంత తీవ్రతతో, ఎలాంటి వ్యాయామం, వారంలో ఎన్ని సార్లు చేయాలనేది వ్యక్తి వయసు, సమస్య, నొప్పి ఆధారంగా నిర్ణయిస్తారు. శరీర తత్వాన్ని బట్టి, సామర్ధ్యాన్ని బట్టి చేయతగిన వ్యాయామాన్ని ఫిజియోథెరపిస్టులు నిర్ణయిస్తారు. దీన్లో ఆక్వాటిక్‌, ఏరోబిక్‌, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌...ఇలా ఎన్నో రకాల వ్యాయామాలుంటాయి.
 
సమస్యను బట్టి చికిత్స
ఎముకలు, కండరాలు, నరాల సంబంధ సమస్యలు, పిల్లలు, స్త్రీల సమస్యలు, వృద్ధులు, హృద్రోగులు, క్రీడాకారులు...ఇలా రకాన్ని బట్టి ఫిజియోథెరపీలో కూడా రకరకాల పద్ధతులు అనుసరిస్తారు.
 
ఎముకల నొప్పులు: కీళ్ల మార్పిడి తర్వాత కీళ్లు సక్రమంగా, త్వరగా, తేలికగా పని చేయాలంటే సర్జరీకి ముందే కీళ్లకు సంబంధించిన కండరాల పటుత్వాన్ని ఫిజియోథెరపీతో పెంచుకోవాలి. అలాగే సర్జరీ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు, నొప్పుల గురించి ముందుగానే ఫిజియోథెరపిస్టులు వివరించి, వాటిని అదుపులోకి తెచ్చుకోగలిగే ముందు జాగ్రత్తలను సూచిస్తారు.
 
కండరాలు నలిగిపోయినప్పుడు: ప్రమాదాల్లో ఎముకలతోపాటు, కండరాలు నలిగిపోతాయి. ఇలాంటప్పుడు కండరాలను కలిపి ఉంచే టెండాన్‌లు తెగిపోతాయి. వీటిని సరిచేయటం కోసం టెండాన్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే సర్జరీ చేస్తారు. అయితే సర్జరీ తర్వాత కండరాలను పూర్వంలా సమర్థంగా పని చేయించాలంటే, సర్జరీకి ముందే ‘ప్రీ సర్జికల్‌ టెండాన్‌ ట్రైనింగ్‌’ తీసుకోవలసి ఉంటుంది.
 
నరాల సంబంధ సమస్యలు: వెన్ను సంబంధ ప్రమాదాలు, పార్కిన్సన్స్‌ వ్యాధిగ్రస్థుల నాడీ సంబంధ సమస్యలను కూడా ఫిజియోథెరపీతో అదుపులోకి తేవొచ్చు. వాళ్లకు శరీరాన్ని కదలించటంలో ఇబ్బంది ఉందా? నిలబడినప్పుడు లేదా నడిచేటప్పుడు ఇబ్బంది ఉంటోందా? నడిచేటప్పుడు బ్యాలెన్స్‌ చేసుకోలేకపోతున్నారా?...ఇలా సమస్య ఆధారంగా వాటిని సరిదిద్దే వ్యాయామాలు ఫిజియోథెరపీలో ఉంటాయి.
 
హృద్రోగులు: గుండెపోటు వచ్చినప్పుడు, మధుమేహం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి అవయవాలు చచ్చుబడినప్పుడు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. చచ్చుబడిన కండరాల్లో కదలికలు పెంచే వ్యాయామాలను ఎంత సమర్ధంగా చేయగలిగితే, ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది.
 
కార్డియో పల్మనరీ: బైపాస్‌ సర్జరీ చేసిన తర్వాత తలెత్తే శారీరక ఇబ్బందులను అధిగమించటానికి, కుట్లు వేసిన ప్రదేశంలో నొప్పి తగ్గటానికి ఫిజియోథెరపీలో వ్యాయామాలున్నాయి. అలాగే ఛాతీ మీద ఒత్తిడి పడకుండా దగ్గటం ఎలా? అనే సులభ చిట్కాలు కూడా ఫిజియోథెరపిస్టులు నేర్పిస్తారు. బైపాస్‌ లేదా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగినప్పుడు ఛాతీ నొప్పి తట్టుకోవటం కోసం తప్పుడు శరీరాకృతికి అలవాటు పడతారు. ఫలితంగా ఇతరత్రా నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులకు తోడు పడుకోవటం, కూర్చోవటం గురించి కూడా వీళ్లకు ఎన్నో అనుమానాలుంటాయి. వీటన్నిటికీ ఫిజియోథెరపీలో పరిష్కారాలున్నాయి.
 
ఉబ్బసం రోగులు: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులుంటాయి. వీరు లోపలికి పీల్చుకున్న గాలి పూర్తిగా బయటకు రాదు. గాలి ఇన్‌పుట్‌, ఔట్‌పుట్‌లో తేడాలుంటాయి. ఇందుకు కారణాల్ని కనిపెట్టి, నడుము పైభాగాన్ని దృఢపరిచే వ్యాయామాలతోపాటు, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయించి ఉబ్బసం ఇబ్బందులను అధిగమించేలా చేయొచ్చు. సాధారణంగా ఉబ్బసం రోగులు ఆయాసపడుతూ ఉంటారు. ఇందుకు కారణం ఊపిరి తీసుకుని వదలటానికి అవసరమైన కండరాలను కాకుండా పక్కనున్న కండరాలను వాడటమే! ఇలాంటప్పుడు ఫిజియోథెరపీ ద్వారా గాలి పీల్చుకుని, వదలటానికి అవసరమైన కండరాలను ఎలా ఉపయోగించాలో ఫిజియోథెరపిస్టులు శిక్షణ ఇస్తారు. ఊపిరి అందక కుంగిపోయి నడుస్తూ ఉంటారు. దీని వల్ల ఇతరత్రా శరీరాకృతి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఉబ్బసం రోగుల శరీర భంగిమను కూడా సరి చేయాల్సి ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల్లోని తెమడ సులువుగా బయటకు వచ్చే భంగిమలను కూడా ఫిజియోథెరపీలో తెలుసుకోవచ్చు.
 
క్రీడాకారులు: క్రీడల్లో తగిలే గాయాలు, బెణుకులు, కండరాలు పట్టేయటం లాంటి సమస్యలకు కూడా ఫిజియోథెరపీ ఒక్కటే పరిష్కారం. టెన్నిస్‌ క్రీడాకారులకు వచ్చే టెన్నిస్‌ ఎల్బో లాంటి సమస్యకూ ఫిజియోథెరపీలో పరిష్కారాలున్నాయి.
మెదడు ఎదుగుదల లేని పిల్లలు: డౌన్స్‌ సిండ్రోమ్‌, సెరబ్రల్‌ పాల్సీ, డిలేయ్‌డ్‌ మైల్‌ స్టోన్స్‌(ఫిట్స్‌, తీవ్రమైన వ్యాధుల వల్ల ఎదుగుదలలో లోపాలు)...ఈ సమస్యలున్న పిల్లలకు ఫిజియోధెరపీ తోడ్పడుతుంది. కొంతమంది పిల్లలు మెకాళ్ల మీద పాకే దశ లేకుండానే లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కూర్చునే దశకు చేరుకోవటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇలాంటప్పుడు ఆ దశల్లో తోడ్పడే కండరాలకు వ్యాయామాన్ని అందించే యాక్టివిటీస్‌ చేయించటం లాంటివి ఫిజియోథెరపీలో ఉంటాయి.
 
సెడెంటరీ లైఫ్‌ స్టయుల్‌: ఎక్కువ సమయంపాటు కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసేవాళ్లకు అర చేతులకు సంబంధించిన ‘కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’, ఎక్కువ సేపు నిలబడే వృత్తుల్లో ఉండేవాళ్లకు ‘ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌’ మొదలైన సమస్యలు వేధిస్తాయి. వీటినీ ఫిజియోథెరపీతో సరిదిద్దవచ్చు.
 
 గర్భిణులకు ఫిజియోథెరపీ
  • గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత కలిగే శారీరక ఇబ్బందులను ఎదుర్కోవటానికి, వాటిని అదుపులోకి తెచ్చుకోవటానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.
  • గర్భం దాల్చినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. వెన్ను, నడుము నొప్పి, కాళ్ల వాపులు లాంటి ఇబ్బందులు ప్రారంభంలో ఉంటాయి. మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం ఆపుకోలేకపోవటం(యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌)లాంటి సమస్య మొదలవుతుంది. ఇలాంటి వాటికి వేడి, చల్లని కాపడం పెట్టడం, స్ట్రెచెస్‌ చేయించటం లాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి.
  • మూత్రాన్ని అదుపు చేయగలిగే కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
  • కొందరికి ఆరో నెలలోనే ఎనిమిది నెలల గర్భంలా పొట్ట ఎత్తుగా తయారవుతుంది. ఇందుకు కారణం వాళ్లు శరీరాకృతిని సరిగా అనుసరించకపోవటమే! ఇలాంటి శరీరాకృతి సమస్యల వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపిస్టులను సంప్రదించి శరీర భంగిమలను సరిదిద్దుకోవాలి.
  • సుఖ ప్రసవం జరగాలంటే నడుములోని కండరాలు బలంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలి? ఎప్పుడు రిలాక్స్‌ అవ్వాలి? ఎప్పుడు గాలి లోపలికి తీసుకుని ప్రసవం జరిగేలా పుషింగ్‌ బ్రీతింగ్‌ చేయాలి? అనేది ఫిజియోథెరపిస్టులు సూచిస్తారు.
  • ప్రసవం తర్వాత వదులైన కండరాలను తిరిగి బిగుతుగా చేసుకోగలిగే వ్యాయామాలు కూడా ఫిజియోథెరపిస్టుల సహాయంతో చేయాలి.
  • ప్రసవం జరిగిన తీరును బట్టి త్వరగా కోలుకోవటానికి అనుసరించవలసిన పద్ధతులు, పాలిచ్చే విధానం, నొప్పిని అదుపులోకి తెచ్చుకోగలిగే పద్ధతులను కూడా ఫిజియోథెరపీలో తెలుసుకోవచ్చు.
ఇంట్లోనే వ్యాయామాలు
బెణుకులు: కాలు బెణికినప్పుడు సాధారణంగా నొప్పి రెండు, మూడు రోజుల్లో అదుపులోకి వస్తుంది. అలా కాకుండా వాపు ఎర్రబారి నొప్పి వేధిస్తుంటే బక్కెట్‌లో గోరు వెచ్చని నీళ్లు నింపి పాదాలు ముంచి పైకి, కిందకి, పక్కలకి కదిలించాలి. కాలి వేళ్లను మడిచి విడవాలి. వేళ్లతో దేన్నో పట్టుకున్నట్టు చేసి వదలాలి. ఇలా చేయటం వల్ల వాపు తగ్గి నొప్పి అదుపులోకి వస్తుంది.
 
మడమ శూల: ఈ సమస్యకు స్ట్రెచింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. కొందరికి పాదంలో వాపుతోపాటు నొప్పి ఉంటుంది. ఈ సమస్యకు నొప్పికి కారణమయ్యే టెండాన్లు, కండరాలను స్ర్టెచ్‌ చేసే వ్యాయామాలు చేయాలి. నేల మీద బంతిని ఉంచి దాని మీద పాదం ఉంచి బంతిని దొర్లించాలి. అలాగే పాదాన్ని టవల్‌తో చుట్టి దగ్గరికి లాగాలి.
 
వేళ్లు పట్టు కోల్పోవటం: వేళ్ల కండరాల్లో ఉన్న పటుత్వాన్ని అంచనా వేసి పిండి పిసకటం, బంక మట్టితో బొమ్మలు చేయటం, సాఫ్ట్‌ బాల్‌ నొక్కే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
 
మెడ నొప్పి: మెడ నొప్పి కారణాన్ని బట్టి ఫిజియోథెరపీ చికిత్స ఉంటుంది. లైఫ్‌ స్టయిల్‌ కారణంగా లేదా పడుకునే భంగిమ కారణంగా వచ్చిందా అనేదాన్నిబట్టి నొప్పిని తగ్గించే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. పడుకునే భంగిమ వల్ల అయితే మెడ వంపును సపోర్ట్‌ చేసేలా మెత్తనిది కాకుండా కొంత గట్టిగా ఉన్న దిండు ఉంచుకుని పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మెడ నొప్పి విపరీతంగా ఉంటే ఆ ప్రదేశంలో హాట్‌ ప్యాక్‌ పెట్టినా ఫలితం ఉంటుంది.
 ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
విశాఖపట్నం 

కామెంట్‌లు లేవు: