6, మే 2023, శనివారం

ఏ వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ , వస్తే దానిని ముందుగానే గుర్తించగలమా?వైద్య నిలయం సలహాలు

ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసువారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ భయపెడుతున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో, గుండె సంబంధిత పరీక్షలు చేసుకొని, సమస్య ఏదైనా ఉంటే ముందస్తుగా గుర్తించే అవకాశం ఉందా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. దాని కోసమే ఈ సందేశం..

ఛాతిలో నొప్పి, అది ఎడమ చేతికి లేదా దవడకు పాకడం, చెమటలు పట్టడం, ఆయాసం రావడం ఇవన్నీ గుండెపోటు లక్షణాలు.

గుండెకు రక్త ప్రసరణ చేసే రక్త నాళాల్లో ఒక దాంట్లో కొవ్వు పేరుకుపోవడం, ప్లేక్ (కాల్షియం పేరుకు పోవడం వల్ల) తయారవ్వడం కారణంగా గుండె భాగానికి రక్త ప్రసరణ జరగక, నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే గుండెపోటు అంటారు. అది ప్రాణాంతకంగా మారుతుంది.

నిజానికి, గుండె పోటుని గుర్తించడం ప్రతిసారీ అంత సులువు కాదు. చాలాసార్లు అసిడిటీ లేదా గ్యాస్ నొప్పి అని పొరపడే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. అందుకే, ఛాతిలో నొప్పి అని వందసార్లు అనిపిస్తే, వంద సార్లూ ఈసీజీ (ECG) తీయించాలని వైద్యులు సూచిస్తారు.

గుండె కొట్టుకునే వ్యవస్థలో ఇబ్బంది కలిగితే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. దానితో క్షణాల్లో గుండె ఆగిపోయి మరణించే అవకాశం ఉంది. ఈ సందర్భాల్లో మనకు సమయం ఎక్కువగా ఉండదు. పక్కన ఉన్నవారు క్షణాల్లో సీపీఆర్ (CPR) చేస్తే, ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.

కార్డియాక్ అరెస్ట్‌కు ప్రధాన కారణం (80-85%) గుండె పోటు. అదికాకుండా కొన్ని ఇతర కారణాలతో గుండె లయ తప్పడం, భయం, పాము కాటు, నీటిలో పడిపోవడం వంటి సందర్భాల్లో, కరెంట్ షాక్ తగిలిన వారికి, కొన్ని రకాల జన్యు పరమైన గుండె సమస్యల్లో (1%) కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది.

TMT - ట్రెడ్ మిల్ టెస్ట్

ఒక వ్యక్తి ట్రెడ్ మిల్ మీద నడుస్తుండగా, అంటే శ్రమిస్తుండగా చేసే పరీక్ష. ఇందులో కూడా చూసేది ECG నే.

అయితే, ఇందులో ఏదైనా కష్టమైన పని చేసేప్పుడు గుండె ఎలా స్పందిస్తుందనేది తెలుస్తుంది. గుండె వేగం పెరిగినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా లేక గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఇందులో తెలిసే అవకాశం ఉంది.

నిర్ణీత సమయం వరకు పరీక్ష చేసినా ఎలాంటి ఇబ్బంది లేకపోతే, గుండె వేగం పెరిగినప్పటికీ ఆయాసం, నొప్పి వంటివి ఏమీ లేకపోతే ఆ పరీక్ష నార్మల్ అని అర్థం.

అయితే, ఇది యాక్టివ్ జీవనశైలి ఉన్నవారికి మాత్రమే చేయగలం. ఎందుకంటే, వృద్ధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధడుతున్నవారికి ఈ పరీక్ష చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఆంజియోగ్రామ్

ఇందులో గుండెకు రక్త ప్రసరణ చేసే రక్త నాళాలను పరీక్షిస్తారు. ఏదైనా ఒక రక్త నాళం నుండి గుండెకు చేరుకుని, కరోనరీ ఆర్టరీలోకి ఒక డై పంపించడం ద్వారా గుండెలోని ప్రతి రక్తనాళంలో రక్తప్రసరణ ఎలా జరుగుతోందో చూడగలం.

రక్తనాళాల్లో బ్లాకులు ఏమైనా ఉంటే వెంటనే తెలుస్తుంది. ఎంత శాతం బ్లాక్ ఉందో, ఎన్ని రక్తనాళాలలో ఉందో తెలిస్తే, దానికి అనుగుణంగా స్టెంట్లు వేయడం లేక గుండె ఆపరేషన్ (CABG) చేస్తారు.

ఇది కొంత రిస్క్‌తో కూడుకున్న పరీక్ష. అందుకే గుండెపోటు లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే ఈ పరీక్ష చేస్తారు.

ఇవి కాక, స్ట్రెస్ 2D ఎకో, న్యూక్లియర్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్, CCTA, కార్డియాక్ MRI వంటి ఇతర పరీక్షలు ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధడుతున్నవారు పైన వివరించిన పరీక్షలు చేయించుకోలేని సందర్భాలలో అవసరాన్ని బట్టి వైద్యులు వీటిని సూచిస్తారు.

ప్రతి పరీక్షకు కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటాయి. అందుకే, డాక్టర్ల సూచనల మేరకు పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.

రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దురలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా గుండెని పదిలంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

ECG - ఎలక్ట్రోకార్డియోగ్రామ్

ఒక సాధారణమైన ఈసీజీ తీయిస్తే గుండె కొట్టుకునే వేగం, అది లయ బద్దంగా ఉందా లేదా అనే విషయం నుంచి గుండెలోని ఏదైనా భాగంలో వాపు ఉన్నా, గుండెపోటు వల్ల ఏ భాగానికైనా నష్టం జరిగిందా? గుండె పై పొరలో నీరు ఉందా? వంటి అనేక విషయాలు తెలుస్తాయి.

అయితే, ఇవన్నీ గుండెలో ఇబ్బంది ఉన్నప్పుడు లేక నష్టం జరిగిన తరవాత తెలిసేవి. ఇది ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చేసే పరీక్ష. కాబట్టి వ్యక్తి శ్రమిస్తున్నపుడు గుండె మీద పడే ప్రభావం ఇందులో తెలియదు.

2D ఎకో

ఈ పరీక్షలో అనేక విషయాలు తెలుస్తాయి. గుండెలోని ప్రతి గది ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగా కొట్టుకుంటుంది, ఏ భాగం అయినా సరిగ్గా స్పందించడం లేదా, గుండెలో ఉండే నాలుగు వాల్వ్‌లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా, ఒక్కో గదిలో ప్రెషర్ ఎంత ఉంది, గుండె నుంచి రక్త ప్రసరణ బాగా జరుగుతుందా లేదా మొదలైన పలు విషయాలు ఇందులో తెలుస్తాయి.

గుండె పోటు వచ్చి ఉంటే, ఆ భాగం సరిగ్గా పని చేయడం లేదన్న సంగతి ఇందులో కచ్చితంగా తెలుస్తుంది.

ఇది తేలికగా చేయగల చేయగల పరీక్ష. చాలా విషయాలు నిర్ధరణలు అవుతాయి. కానీ, ఇందులో కూడా నష్టం జరిగాక, ఆ నష్టాన్ని మాత్రమే గుర్తించగలం.

CT కరోనరీ ఆంజియోగ్రామ్

ఇది సమస్య రాక ముందే గుర్తించగల ఒక పరీక్ష. ఇందులో CT స్కాన్ ద్వారా గుండె రక్త నాళాలను చూడగలం. వాటిలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత పెద్దవిగా ఉన్నాయి మొదలైన విషయాలు ఇందులో తెలుస్తాయి.

కొన్ని సందర్భాలలో అన్ని రక్త నాళాలు సరిగ్గా కనిపించక పోవచ్చు.

అయితే, ఇందులో రేడియేషన్ ప్రమాదం ఉంది. అందుకే పదే పదే ఈ పరీక్ష చేయించుకోకూడదు.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

కామెంట్‌లు లేవు: