పగిలిన మడమలా? ఇలా చేసి కాళ్ల పగుళ్లు సులభంగా తగ్గించుకోవచ్చు..! అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
(Home Remedies For Cracked Heels
అందం విషయంలో మిగతా శరీర భాగాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది అవే కాళ్లు పగుళ్ల బారిన పడితే చాలా అంద విహీనంగా కనిపిస్తాయి. అవే పగుళ్లు (cracked heels) గనుక తగ్గితే పాదాలు మృదువుగా.. అందంగా మెరసిపోయే వీలుంటుంది. ఈ క్రమంలో మనం కూడా కాళ్ల పగుళ్ల సమస్యను తగ్గించుకోవడానికి.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు (Home remedies) పాటిస్తే సరిపోతుంది.
కాళ్ల పగుళ్లకు కారణాలివే.. (Causes Of Cracked Heels)
కాళ్ల పగుళ్ల సమస్యను తగ్గించుకోవాలంటే.. ముందు దానికి గల కారణాలను తెలుసుకోవాలి. కాళ్ల పగుళ్లు చాలా కారణాల వల్ల ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనవి - శరీరంలో తేమ శాతం తక్కువగా ఉండడం, అలాగే విటమిన్లు, మినరల్స్ తగ్గుముఖం పట్టడం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం, వయసు పైబడడం.. స్థూలకాయం, సొరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడడం కూడా ప్రధానమైన కారణాలే. అలాగే కాళ్లు నీళ్లలో ఎక్కువగా తడవడం, కాళ్ల భద్రతను పట్టించుకోకపోవడం, షూ లేదా చెప్పులు వేసుకోకుండా నడవడం కూడా ఈ సమస్యకు కారణాలే.
ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే.. చాలా వరకూ కాళ్ల పగుళ్లు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కాళ్లకు తరచూ మసాజ్, పెడిక్యూర్ లాంటివి చేయించుకోవడం మొదలుపెడితే పగుళ్లు రాకుండా ఉంటాయి. మరి, ఈ పాటికే వచ్చిన పగుళ్లు తగ్గించుకోవడం ఎలా? అని ఆలోచిస్తున్నారా..? అందుకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పగుళ్లను (Cracked Heels) తగ్గించే ప్యాక్స్ ఇవే.. (Home Remedies For Cracked Heels In Telugu)
ళ్ల పగుళ్లు తగ్గించేందుకు ఇంట్లో లభించే కొన్ని వస్తువులతోనే.. ప్యాక్స్ తయారుచేసుకొని వాటిని అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అందుకే ఆ ప్యాక్స్ ఓసారి ప్రయత్నించండి.
నిమ్మరసం, ఉప్పుతో.. (Lemon And Salt)
నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా, పొడిగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అదే నిమ్మరసంలో కాస్త గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పగుళ్లకు అప్లై చేయండి. మీ సమస్య కొంతవరకు తీరుతుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. టేబుల్ స్పూన్ ఉప్పు, అర కప్పు నిమ్మరసం , రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ , రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, గోరు వెచ్చని నీళ్లు, ఫుట్ స్క్రబ్బర్.. వీటిని రెడీ చేసుకోవడమే. ఆ తర్వాత ఒక బేసిన్‌లో నీళ్లు నింపి.. అందులో ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ను కలిసి.. అందులో కాళ్లను నానబెట్టాలి.
ఆ తర్వాత ఫుట్ స్క్రబ్బర్ సాయంతో పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు టీస్పూన్ గ్లిజరిన్, టీస్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలుపుకొని పగిలిన పాదాలకు అప్లై చేసుకోవాలి. కావాలంటే దీన్ని అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కాళ్లను రుద్దుకొని కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే పగుళ్లు మాయమవుతాయి.
అరటిపండు, అవకాడో మాస్క్ (Banana And Avacado Mask)
అవకాడోలో మన శరీరానికి ఎంతో అవసరమైన ఎస్సెన్సియల్ ఆయిల్స్ ఉంటాయి. విటమిన్లు, ఆవశ్యకమైన కొవ్వులు పొడిబారిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. అలాగే అరటి పండు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీనికోసం ఈ మాస్క్‌ని రోజూ కాళ్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ మాస్క్ తయారీ కోసం ఒక అరటిపండు, సగం అవకాడో తీసుకొని మిక్సీలో వేసి ఈ మిశ్రమాన్ని కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
తేనెతో (Honey)
తేనె మన చర్మానికి పోషకాలు అందించడంతో పాటు తేమను పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. దీన్ని పగుళ్లను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం ముందుగా ఒక కప్పు తేనె, సగం బకెట్ గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. తర్వాత కప్పు తేనెను ఆ నీళ్లలో బాగా కలిపాక.. అందులో కాళ్లు ముంచి పావుగంట పాటు అలాగే ఉండాలి. కాళ్లు బాగా నానిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే పగుళ్లు చాలా త్వరగా తగ్గిపోతాయి.
నిమ్మరసం, వ్యాసెలిన్‌తో.. (Lemon Juice And Vaseline)
నిమ్మరసంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాసెలిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి అప్లై చేస్తే పొడిగా, పగుళ్లు ఎక్కువగా ఉండే పాదాలు తిరిగి మృదువుగా తయారవుతాయి. దీన్ని రోజూ నిద్రపోయే ముందు అప్లై చేసుకోవాలి. అందుకోసం టీస్పూన్ వ్యాసెలిన్, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత, గోరువెచ్చని నీళ్లలో పావుగంట సేపు కాళ్లను నానబెట్టి.. ఆ తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని కాళ్లకు రాయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకొని రాత్రంతా వాటితోనే పడుకోవాలి. సాక్సులు మన శరీరంలోని వేడిని పీల్చేస్తాయి. కాబట్టి పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి.
బేకింగ్ సోడా (Baking Soda)
బేకింగ్ సోడా సాధారణంగా మంచి ఎక్స్ ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కానీ దీన్ని ప్యాక్‌లా ఉపయోగిస్తే కూడా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్న ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. దీనికోసం ఒక బకెట్‌లో సగం నీళ్లు తీసుకొని.. అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. అందులో పావుగంట పాటు కాళ్లు ముంచి తీసి స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కుంటే సరిపోతుంది.
పారాఫిన్ వ్యాక్స్ (Paraffin Wax)
పారాఫిన్ వ్యాక్స్ శరీరాన్ని మృదువుగా మార్చడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే పగుళ్ల బారిన పడిన కాళ్లను తిరిగి మామూలుగా మార్చేందుకు దీనిని వాడవచ్చు. అందుకోసం తొలుత ఒక టేబుల్ స్పూన్ ప్యారాఫిన్ వ్యాక్స్‌ను తీసుకొని.. దానితో రెండు మూడు చుక్కల కొబ్బరి లేదా ఆవ నూనెను మిక్స్ చేయాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమాన్ని కాస్త వేడి చేయాలి. గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు.. దీన్ని కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి.
విటమిన్ ఇ నూనె (Vitamin E Oil)
విటమిన్ ఇ నూనె చర్మానికి తేమను అందిస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించి చర్మాన్ని మ్రదువుగా మార్చేందుకు ఇది పనిచేస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా రోజుకోసారి మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకొని.. అందులోని నూనెను మిక్స్ చేసి కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాళ్లలో బాగా ఇంకేవరకూ రుద్ది.. ఆ తర్వాత కాసేపటివరకూ కాళ్లు కిందపెట్టకుండా చూసుకోవాలి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే పగుళ్లు తగ్గిపోతాయి.
లిస్టరిన్‌తో.. (Listerine)
లిస్టరిన్ మంచి మౌత్ వాష్‌గా మాత్రమే కాదు.. కాళ్లకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు తోడ్పడుతుంది. దీనికోసం కప్పు లిస్టరిన్, కప్పు వైట్ వెనిగర్, రెండు కప్పులు నీళ్లు, ఫుట్ స్క్రబ్బర్ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి.. ఆ మిశ్రమాన్ని బకెట్లో పోయాలి. తర్వాత అదే బకెట్‌లో మీ పాదాలను నానబెట్టుకోవాలి. ఇలా పావుగంట సేపు మీ పాదాలను బకెట్‌లో నానబెట్టాక.. స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నాలుగైదు రోజుల పాటు వరుసగా చేస్తే.. మృత చర్మం మొత్తం పోయి పగుళ్లు తగ్గి కాళ్లు మృదువుగా కనిపిస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Coder Vinegar)
యాపిల్ సైడర్ వెనిగర్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ కూడా చేస్తుంది. దీనికోసం పావు బకెట్ నీళ్లలో కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. అందులో కాళ్లను పావు గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కాళ్లు మృదువుగా కనిపిస్తాయి.
ఈ నూనెలు కూడా.. (Oils)
కాళ్ల పగుళ్లకు ముఖ్య కారణం.. ఆయా శరీర భాగమున్న ప్రాంతంలో తేమ లేకపోవడమే. అందుకే కాళ్ల పగుళ్లను నివారించడానికి పాదాలకు తేమను అందించాలి. దీనికోసం బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మొదలైనవాటితో.. ప్రతీ రాత్రి కాళ్లకు మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కాళ్లు మృదువుగా మారతాయి.
స్క్రబ్స్‌తోనూ పగుళ్లు (cracked heels) మాయం.. (Homemade Scrubs For Cracked heels)
కేవలం కాళ్లను నీళ్లలో నానబెట్టడం, దానికి మాస్క్‌లు వేయడం వల్ల మాత్రమే కాదు.. కొన్ని రకాల స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల కూడా పగుళ్లు మాయమైపోతాయి. దీనికోసం ఎలాంటి స్క్రబ్స్ ఉపయోగించవచ్చంటే..
నిమ్మరసం, ఆలివ్ నూనె (Lemon Juice And Olive Oil)
నిమ్మరసం, ఆలివ్ నూనె రెండూ చర్మానికి ఉపయోగపడతాయి. దీనికోసం కప్పు రాతి ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ నూనె, ఎస్సెన్షియల్ ఆయిల్ అన్నింటినీ కలిపి కాళ్లకు పట్టించి బాగా రుద్దాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని.. తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి.
కొబ్బరినూనె, చక్కెర, పసుపు (Coconut Oil, Sugar And Turmeric)
చక్కెర చర్మానికి మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. ఇది కాళ్లకు కూడా ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనికోసం కప్పు కొబ్బరి నూనె, పావు కప్పు చక్కెర, టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకొని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని కాళ్లకు బాగా అప్లై చేసుకొని గట్టిగా రుద్దాలి. కనీసం రోజుకోసారి ఇలా కాళ్లకు అప్లై చేయడం వల్ల.. కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి.
ఓట్ మీల్‌తో (Oatmeal)
ఓట్ మీల్ చర్మానికే కాదు.. కాళ్లకు కూడా మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మృత కణాలను తొలిగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దీనికోసం పావుగంట పాటు కాళ్లను నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌లో తగినంత ఆలివ్ ఆయిల్ కలిపి బరకగా తయారుచేసి దీన్ని పాదాలకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
బియ్యపు పిండి, తేనెతో.. (Rice Flour And Honey)
బియ్యపు పిండి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంతో పాటు సాఫ్ట్‌గా మారుస్తుంది. తేనె చర్మంలో తేమను పెంచడంతో పాటు పోషకాలను కూడా తిరిగి అందిస్తుంది. వీటితో తయారుచేసే ఫుట్ స్క్రబ్‌ని.. వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కలు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఈ మూడింటినీ కలపాలి. కాళ్లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసిన తర్వాత.. ఈ స్క్రబ్‌ని పాదాలకు పట్టించాలి. కావాలంటే టీ స్పూన్ ఆలివ్ లేదా బాదం నూనెను కూడా కలపవచ్చు. ఈ స్క్రబ్‌తో పాదాలను బాగా రుద్దడం వల్ల.. మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
పాలు, చక్కెరతో.. (Milk And Sugar)
పాలు చర్మంలో తేమను పెంచుతాయి. చక్కెర చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. అందుకే ఈ రెండింటితో తయారుచేసే స్క్రబ్ కాళ్ల పగుళ్లను పూర్తిగా తగ్గిస్తుంది. దీనికోసం కప్పు పాలను.. ఐదు కప్పుల గోరు వెచ్చని నీటితో కలిసి.. తర్వాత ఈ మిశ్రమాన్ని టబ్‌లో పోసి.. అందులో కాళ్లను పావుగంట పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఓ బౌల్‌లో బేబీ ఆయిల్, చక్కెర, కొన్ని పాలు కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి. తర్వాత దాన్ని కాళ్లకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి.
పగుళ్ల గురించి మీ సందేహాలకు సమాధానాలివే.. (FAQ's)
1. కాళ్ల పగుళ్లను త్వరగా తగ్గించే ట్రీట్ మెంట్ ఏది?
కాళ్ల పగుళ్లకు ఇంట్లో లేదా పార్లర్‌లో పెడిక్యూర్ చేయించుకోవడం మంచి పద్ధతి. దీంతో పాటు రోజూ లూఫా, ఫుట్ స్క్రబ్బర్, ప్యూమిస్ స్టోన్‌ల సాయంతో గట్టిబడిపోయి, పొడిబారిపోయిన చర్మాన్ని, మృత కణాలను తొలిగించే ప్రయత్నం చేయాలి. రోజూ కాళ్లకు కూడా ఫుట్ క్రీం లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. లేదంటే కనీసం పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా సరిపోతుంది.
2. కాళ్ల పగుళ్లు రాకుండా చేయాలంటే ఏం చేయాలి.?
ముఖ్యంగా ఎక్కువ సేపు నిలబడి చేసే పనులకు స్వస్తి పలకాలి. అలాగే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సాధారణంగా శరీరంలో, చర్మంలో తేమ తక్కువగా ఉండడం, నీళ్లలో ఎక్కువ సేపు తడవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించడం వల్ల కాళ్ల పగళ్లు రాకుండా చేసుకోవచ్చు.
వీటన్నింటితో పాటు ఫ్లిప్ ఫ్లాప్స్, శాండల్స్, ఓపెన్ బ్యాక్ షూలు, హీల్స్, టైట్‌గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువవుతాయి. కాబట్టి వాటిని ధరించకుండా కాళ్లకు పూర్తి రక్షణను అందించే చెప్పులు ధరించాలి.
అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో నిల్చోవడం, కాలు మీద కాలేసి కూర్చోవడం వంటివి చేయడం సరికాదు.
రోజూ రాత్రి కాళ్లకు తేమను అందించేందుకు ఫుట్ క్రీంని అప్లై చేసుకోవాలి. అంతేకాదు.. రోజంతా నీళ్లు, పండ్ల రసాలు, ఇతర లిక్విడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
3. కాళ్ల పగుళ్లు ఆరోగ్యానికి హానికరమా?
కాళ్ల పగుళ్లు సాధారణంగా పెద్ద హానికరమైనవేమీ కాదు. కానీ డయాబెటిస్, కొన్ని రకాల ఇమ్యూన్ సమస్యలున్నవారికి మాత్రం అవి హానికారకంగా పరిణమించవచ్చు. అలాగే పగుళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్ ప్రారంభమై.. అది సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పగుళ్లను అంత తేలికగా వదిలేయకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిది.
4. ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి? దీన్ని ఎన్ని రోజులకోసారి చేసుకుంటే కాళ్ల పగుళ్లు రాకుండా ఉంటాయి.
కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు కనీసం వారానికి రెండుసార్లు కాళ్లను స్క్రబ్ చేసుకోవాలి. అలాగే వారానికోసారైనా సరే పెడిక్యూర్ చేసుకోవడం మంచిది. దీనికోసం టబ్‌లో కొన్ని నీళ్లు తీసుకొని.. అందులో లిక్విడ్ సోప్ లేదా ఎప్సమ్ సాల్ట్ వేసుకొని పావు గంట పాటు అందులో కాళ్లు ముంచి తీయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా స్క్రబ్బర్ సాయంతో కాళ్ల పగుళ్లన్నీ తొలగించాలి. తర్వాత కాళ్లను టవల్ సాయంతో తుడుచుకొని కాళ్లకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి