నడుము నొప్పి నివారణకు ఆయుర్వేదం సలహాలు అవగాహనా కోసం
1. నొప్పి హఠాత్తుగా మొదలయిందా?-- ఘాతాలు / దెబ్బలు,
2. నడుము నొప్పి చాలాకాలం నుంచి ఉందా?-- వెన్నుపూసలు అరిగిపోవటం (స్పాండిలోసిస్),
3. వెన్నుకు నిర్దేశితమైన ఆకృతీ, సహజమైన వంపులూ దూరమయ్యాయా?-- ఎముకల బోలుతనం (ఆస్టియోపోరోసిస్), వెన్నుపూసలు కలిసిపోవటం (యాంకైలోజింగ్ స్పాండిలోసిస్),
4. కదలికలతో నడుము నొప్పి ఎక్కువవుతుందా? -- నరంమీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్),
5. దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ నడుములో నొప్పి వస్తుందా?--వెన్నుపూసల మధ్యనుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్)
6. సాధారణారోగ్యం కుంటుపడిందా? నలతగా అనిపిస్తుందా?--అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్)
7. కాళ్లలో శక్తి లేనట్లుగా, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుందా?--నరంమీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్)
8. మూత్రం కంట్రోల్లో లేకుండా పడిపోతుందా? మల విసర్జన మీద నియంత్రణ ఉండటం లేదా?--నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్ నెస్)
9. మీరు స్త్రీలైతే - నడుమునొప్పి, నెలసరి సమయాలలో ఎక్కువవుతుంటుందా?--గర్భాశయం వెనక్కి తిరిగి వుండటం (రెట్రోవర్డెడ్ యుటిరస్)/ గర్భాశయపు లోపలిపొర ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్)
10. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారా? మూత్రంలో రక్తం కనిపిస్తుందా?--మూత్రపిండాల్లో రాళ్ళు / కిడ్నీ వ్యాధులు
11. నడుము నొప్పితో పాటు ఉదర ప్రాంతంలో నొప్పి ఉంటుందా?--ఉదరావయవాల వాపు
12. బరువు తగ్గిపోతున్నారా?--దీర్ఘకాల వ్యాధుల ప్రభావం / ప్రమాదకర రుగ్మతలు
బస్సులలోనూ, రైళ్లలోనూ గంటల తరబడి కూర్చుని ప్రయాణం చేయడం, టెలివిజన్ ముందు అదే పనిగా చేరగిలపడం, డజన్లకొద్దీ నీళ్ల బిందెలు యోయడం ఇవన్నీ చేయడానికి మన శరీరానికి కొన్ని పరిదులున్నాయి, అయినా తప్పకనో, అశ్రద్ధ వల్లనో, తెలిసో, తెలియకనో చేసేస్తుంటాము. వీటి పర్యవసానమే నడుము నొప్పి. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు కటీశూల అనే పేరుతో దీనిని వివరించాయి. సంహితా కారుడు నడుము నొప్పికి దైనందిన పరిస్థితులను కారణాలుగా పేర్కొంటూ, వాటిని 'మిథ్యాయోగం' అన్న పదంతో వ్యవహరించాడు. నడుమునొప్పి అనేది జలుబు తరువాత కనిపించే అత్యంత సాధారణమైన సమస్య. డాక్టర్లకు తరచుగా వినిపించే ఫిర్యాదు ఇది. నడుము నొప్పిని నివారించే ప్రయత్నంలో మానవ శరీర నిర్మాణాన్ని గురించి లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి.
ఆధునిక శాస్త్ర అధ్యయనాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం జరుగుతోంది. అయినప్పటికీ, చిత్రంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చి తీరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల పనిగంటలు కేవలం నడుము నొప్పి కారణంగా వ్యర్ధమవడాన్ని బట్టి .... ఈ సమస్య మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం అవసరమని గ్రహించాలి. నడుము నొప్పికి ప్రధాన కారణం మనం పరిణామక్రమంలో పొందిన పరిణతేనని జీవశాస్త్రాధ్యయనకారుల అభిప్రాయం. అంటే మనం స్వతహాగా - మన పూర్వీకులైన వానరాల్లాగా నాలుగు కాళ్ల మీద నడవాలనీ, అయితే జీవ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డామనీ, అయినప్పటికీ శరీరం మాత్రం నాలుగు కాళ్లతో కూడిన సమతుల్యానికి అలవాటు పడిందనీ, సమస్య సరిగ్గా ఇక్కడే వస్తుందనీ వీరంటారు. వీరి అభిప్రాయంలో కొంత నిజం ఉన్నా. అదే పూర్తి నిజమని అంగీకరించాల్సిన పనిలేదు. ఎందుకంటే పరిణామక్రమంలో శరీరం తన చుట్టుపక్కల పరిసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది కనుక.
నడుము నొప్పికి నివారణగా భారతీయ శస్త్రచికిత్సా పితామహుడు సుశృతుడు మనిషి భంగిమలను గురించి, వ్యాయామాలను గురించి ప్రత్యేకంగా చెప్పాడు. నడుమును ఆవరించి ఉండే కండరాల శక్తిని పెంపొందించుకోవడం, రోజువారి పనులను ఒక నిర్దుష్టమైన శైలిలో చేయడం వంటి చిన్న చిన్న మార్పులతో నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు. ఆఫీసులో కూర్చునే కుర్చీలనూ, బల్లలనూ, ఇళ్లలో వాడే మంచాలనూ మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని తయారుచేసిన వాటిని వాడాలి. అలాగే బరువులను సరైన పద్ధతిలో మోయడం నేర్చుకోవాలి.
నడుము నొప్పి ఆనడంతోనే ముందుగా ఎవరి దృష్టయినా వెన్నుపూస మీదకి వెళుతుంది. పూసా అని దీనిని వ్యవహరించడంలోనే కొంత అర్థముంది; దీనిలో 33 ఎముకల 'పూసల దండ' మాదిరిగా ఒక దానిమీద మరొకటి అమరి ఉంటాయి. ఒకటే ఎముకలాగా కాకుండా ఇలా పూసలుగా మరి ఉండటం వలన వెన్నును వివిధ భంగిమల్లో పంచగలిగేందుకూ, తిప్ప గలిగేందుకూ వీలు కలుగుతుంది, వెన్ను అనేది శరీరం అగ్ర భాగంలో తలకూ, మధ్యభాగంలో ఛాతి ప్రాంతానికీ, కింది భాగంలో తుంటి ప్రాంతానికి అధారాన్నిస్తుంది. అలాగే వీటి నుంచి ఆధారాన్ని పొందుతుంది. వెన్నులోని ఎముకలు ఒకదాని మీద మరొకటి, వాషర్ పైన తిరిగే చక్రాల మాదిరిగా, మృదులాస్థి పైన అమరి ఉంటాయి. అంతే కాకుండా ఈ వెన్నుపూసలు వెన్నుపామును (స్పైనల్ కార్డ్) నిలువునా ఆవరించి రక్షిస్తూ ఉంటాయి.
వెన్నుపాము నరాల సముదాయాలతో నిర్మితమై, మెదడుకు, శరీర భాగాలకు మధ్య సందేశాలను చేరవేసే వాహకంగా పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. నడుము నొప్పి ఉత్పత్తి స్థానం: నడుము నొప్పి కేవలం వెన్నుపూస వల్లనే కాకుండా, దానిని అంటిపెట్టుకుని ఉండే నిర్మాణాల వలన కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఆయా కారణాలను అన్ని కొణాలనుంచి శోధించాల్సి ఉంటుంది. సమస్య స్వస్థానంలో కేంద్రీకృతమై ఉంటే నొప్పి ఉత్పత్తి స్థానాన్ని కనిపెట్టడం కష్టం కాదు. అయితే చాలా సందర్భాలలో నొప్పి స్థానికంగానే కాకుండా, నరాల ద్వారా ఇతర భాగాలకు సైతం ప్రసరిస్తుంది. దీనిని వైద్యపరిభాషలో ;రిఫర్డ్ పెయిన్' అంటారు, అంటే సమస్య ఒకచోట ఉంటే ఫలితం మరొకచోట ఉంటుందన్నమాట. ఇలాంటి నొప్పికి సరైన ఉదాహరణ, సయాటికా నొప్పి అని అంటారు.
మామూలుగా సయాటిక్ నరం అనేది నడుము ప్రాంతంలోని వెన్నుపాము నుండి కొన్ని పాయలుగా విడివడి, వెన్నుపూస ఎముకల మధ్యనుంచి మార్గాన్ని చేసుకుని, కాలులోనికి ప్రవేశించి పాదాల వరకూ పయనిస్తుంది. కాళ్ల కదలికలకు, స్పర్శాగ్రహణానికి కారణం ఈ సయాటిక్ నరమే. ఒకవేళ నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసలో అస్తవ్యస్తత చోటు చేసుకుంటే సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు నడుములో నొప్పి ఉన్నా లేకపోయినా సయాటిక్ నరం వ్యాపించినంత మేరా (తొడ వెనుక భాగం, పిక్కలు, పాదం తదితర ప్రాంతాలు) విపరీతంగా లాగుతున్నట్లుగాని, సలుపుతున్నట్లుగాని ఉంటుంది. నడుము నొప్పికి అసలైన కారణాలు: నడుము నొప్పులకు ప్రధాన కారణాలుగా శరీరానికి తగిలిన దెబ్బలను, ఇన్ ఫ్లమేషన్ నూ, వెన్నుముకకూ సంబంధించిన ఆర్త రైటిస్ నీ పరిగణించాల్సి ఉంటుంది.
నడుము నొప్పికి మరో ప్రధాన కారణం స్లిప్ డిస్క్, వెన్నుపూస ఎముకల మధ్య ఉండే కుషన్ వంటి మృదులాస్థి పక్కకు వైదొలిగి వెన్నుపాము మీద ఒత్తిడిని కలిగిస్తున్నప్పుడు దానిని స్లిప్ డిస్క్ అంటారు. ఈ స్థితి బరువులను ఎత్తినప్పుడో, లేక హఠాత్తుగాను, అసహజంగాను కదిలినప్పుడో సంభవిస్తుంది. కొన్ని కేసులలో మాత్రం నడుమునొప్పి అమవాతం (రుమటాయిడ్ ఆర్త రైటిస్), క్యాన్సర్ తదితరాల వలన వచ్చే అవకాశం లేకపోలేదు. కొన్నిసార్లు కొద్ది మందిలో వెన్నెముకతో సంబంధం కూడా నడుము నొప్పి రావచ్చు. మూత్ర పిండాల వ్యాధులూ, మహిళల్లో వచ్చే పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ వంటివీ దీనికి ఉదాహరణలు. ఇప్పుడు నడుం నొప్పిని కలిగించే సాధారణ కారణాలను సమీక్షిద్దాం.
1. అభిఘాతాలు / దెబ్బలు:
బరువును లేపుతున్నప్పుడో, పక్కకు తిరిగినప్పుడో, వంగినప్పుడో నడుము లోపల కలుక్కుమని, ఆ తరువాత ఆ నొప్పి అలాగే కొనసాగుతూ ఉంటే వెన్నుపూసలకుకాని, వాటిని అంటిపెట్టుకుని ఉండే నిర్మాణాలకుకాని దెబ్బ తగిలినట్లు అర్థం చేసుకోవాలి. కండర సముదాయాలు చిట్లినప్పుడు లేదా సాగిలపడినప్పుడు ఈ స్థితి ప్రాప్తిస్తుంది. అలాగే వెన్నుపూస ఎముకల మధ్యనుండే మృదులాస్థి (డిస్క్) స్థానభ్రంశం చెంది వెన్నుపాము మీద ఒత్తిడి కలుగచేసినప్పుడు కూడా నడుము నొప్పి మొదలవుతుంది. ఇంతే కాకుండా ఎముకలు చిద్రమై పెళుసెక్కినప్పుడూ, క్యాన్సర్ కారకాంశాలు ప్రథమ దశను దాటుకుని ద్వితీయ దశలోనికి ప్రవేశించినప్పుడూ ఏ మాత్రం అహితకరమైన కదలికలు చోటుచేసుకున్నా డిస్క్ పక్కకు తప్పుకుని నడుము నొప్పి వస్తుంది.
సూచనలు: వీటికి కారణానుగుణమైన చికిత్సలు అవసరమవుతాయి. సామాన్య చికిత్సగా నొప్పినివారణ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది.
2. వెన్నుపూసలు అరిగిపోవడం (స్పాండిలోసిస్):
నిజం చెప్పాలంటే నడుమునొప్పి చాలా రోజుల పాటు బాధించే దీర్ఘకాలిక స్థితి. దెబ్బ తగిలిన తరువాత వెన్నుపూసలను అంటి పెట్టుకుని ఉండే కండరాలు త్వరితంగా పూర్వపు స్థితిని సంతరించుకున్నప్పటికి వెన్నుపూసలను కలిపే లిగమెంట్లూ, వ్యాదిగ్రస్తమైన జాయింట్లూ అంత తేలికగా సర్దుకోవు. దీనికి కారణం ఆయా నిర్మాణాలను అంతగా రక్త సరఫరా అందక పోవడమే. సూచనలు: వెన్నువెనుకకు, ముందుకు వంచుతూ వ్యాయామాలను చేయడం, శారీరక భంగిమలను సరిదిద్దుకోవడం, కుర్చీలనూ మంచాలనూ సరైన పద్ధతిలో వాడటం, పంచకర్మలనే ఆయుర్వేద చికిత్సలను తీసుకోవడం వీటన్నిటి ద్వారా నడుము నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు.
3. ఎముకల బోలుతనం (ఆస్టియోపోరోసిస్)/ వెన్నుపూసలు కలిసిపోవడం (యాంకైలోజింగ్ స్పాండిలోసిస్):
డ్రస్సింగ్ టేబుల్ ముందు ఒక పక్కకు నిలబడి చూసుకోండి, మీకు మీ వెన్నులో నాలుగు చోట్ల వంపులు కనిపిస్తాయి: మెడ దగ్గర, నడుము దగ్గర ఈ వంపులు లోపలికి తిరిగి ఉంటే (వీపు వైపు నుంచి చూసేటప్పుడు) దానికి విరుద్ధంగా భుజాల మధ్య ప్రాంతంలోనూ, తుంటి ప్రాంతంలోనూ వంపులు వెలుపలికి తిరిగి కనిపిస్తాయి. అయితే స్లిప్ డిస్క్, ఆస్టియోపోరోసిస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ వంటి వ్యాధులతో బాధ పడే వారికి ఈ ఆకృతి దెబ్బతింటుంది. ఈ వ్యాధుల వల్ల వెన్నచుట్టుప్రక్కల కండరాలు బిగదీసుకుపోయి, వెన్నెముక బల్లపరుపుగా తయారవుతుంది. అలాగే కదలికలు కష్టమైపోతాయి.
ఎముకలు చిద్రయుక్తం (పోరస్)గా మారి పెళుసెక్కడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు ఎముకలలో సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా చిన్నపాటి కదలికలకూ, దేబ్బలకూ లేదా అకారణంగా కూడా ఫ్రాక్చర్లు జరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆసియా ఖండానికి చెందిన వారే ఈ తరహా వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారని వెల్లడయింది. మగవారికంటే స్త్రీలెక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందునా పొట్టిగా, బల్ల పలచగా ఉండే వారికీ, సంతానం లేని వారికి ఈ స్థితి ప్రాప్తించే అవకాశాలెక్కువ. హిస్టరెక్టమీ ద్వారా బహిష్టుళు ఆగిపోయేలా చేసుకున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. పాలు, గుడ్లు మొదలైన కాల్షియం కలిగిన పదార్థాలను దగ్గరకు రానివ్వని వారికీ, ఏ పనిచేయకుండా బద్ధకంగా గడిపే వారికి, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లు ఉన్నవారికి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలెక్కువ, ఆల్యూమినియం కలిగిన యాంటాసిడ్స్ వాడకం, స్తీరాయిడ్స్ వినియోగం ఈ వ్యాధికి ఒక ప్రధానమైన కారణం, ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, ఆస్టియోపోరోసిస్ నడుము నొప్పి ఒక లక్షణంగా ఉంటుందని.
సూచనలు: దీనికి సాంప్రదాయక ఆయుర్వేద చికిత్సలతో పాటు క్యాల్షియం కలిగిన ప్రవాళ పిష్టి, మోతీ భస్మం, కుక్కుటాండ త్వక్ భస్మం అనే మందుకు కూడా అవసరమవుతాయి. నడుము నొప్పి ప్రధానంగా కనిపించే వ్యాధుల్లో యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది కూడా ముఖ్యమైనదే. ఈ వ్యాధిలో వెన్నుపూసలు లేదా ఎముకలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి.
తరచు వెన్నునొప్పి రావడమూ, అది పిరుదుల ద్వారా తొడలలోనికి వ్యాపించడమూ ఈ వ్యాధిలో కనిపించే లక్షణం. విశ్రాంతి తీసుకున్న తరువాత, రాత్రి నిద్ర తరువాత ఈ లక్షణాలు మరీ ఉధృతంగా కనిపిస్తాయి. పక్కటెముకలు వెన్నుపూసలతో కలిసే చోట కదలికలు నిబద్దమైపోయి ఛాతి సైతం వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతిలో నొప్పి ఎక్కువ కావటమనే లక్షణం ఈ వ్యాధిని గుర్తించడానికి తోడ్పడుతుంది. అరికాళ్ల తీపులు, మడిమల వెనుక ప్రాంతంలో నొప్పి, ఎముకల్ అగ్ర భాగాల్లో ముట్టుకోలేనంత నొప్పి అనేవి ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తాయి. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే క్రమంగా వెన్ను పొడుగునా కదలికలు తగ్గిపోతాయి.
ఛాతీలో సంకోచ వ్యాకోచాలు తగ్గిపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఎక్స్ రే లో వెన్నుపూసలు ఒక దానితో మరొకటి కలిసిపోయి వెదురుబొంగు కణువుల మాదిరిగా కనిపిస్తాయి. ఇది పురోగమించే నైజం ఉన్న మొండి వ్యాధి.
4. నరం మీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్):
నడుములో పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తూ కదలికలతో పెరిగిపోతుంటే వెన్నుపాము నుంచి బైటకు వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. విశ్రాంతితోనూ, మహానారాయణ తైలం వంటి ఔషధ నూనెతోనూ మూడు రోజుల్లోగా నొప్పి సర్దుకుంటే దానిని సాధారణమైన కండరాల నొప్పిగా భావించి వదిలివేయవచ్చు. లేని పక్షంలో వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.
5. వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్):
వెన్నుపూసల మధ్య ఉండే మృదులాస్థి పక్కకు తప్పుకున్నప్పుడు వెన్ను అంతర్భాగంలో ఉండే జాగా తగ్గిపోయి ఇరుకుగా మారుతుంది. దగ్గటం, తుమ్మటం మొదలైన చర్యల వలన, అంతర్గతంగా ఒత్తిడి పెరిగి, వెన్నుప్రాంతానికి ప్రసరించి పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంది, దీనికి ;కటి వస్తి' అనే ఆయుర్వేద చికిత్సను చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. (వేడిగా ఉండే ఔషధ తైలాలను నడుము మీద నిర్ణీత సమయం పాటు ప్రయోగించడాన్ని 'కటివస్తి' అంటారు.)
6. అమవాతం (రుమటాయిడ్ ఆర్త రైటిస్):
నడుము నొప్పితో పాటు జ్వరం, బరువు తగ్గటం, రక్తల్పాత, నీరసం మొదలైనవి కనిపిస్తుంటే ఇతర శారీరక వ్యాధుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) దీనికి ఉదాహరణ. అమవాతంలో కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగ ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఏ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారడం. దీనినే ఆటో ఇమ్యూనిటి అంటారు. అంతే, శరీరంలో ఉండే ప్రతిరక్షణ కణాలు శరీరపు స్వంత కణజాలాలను బయటివాటిగా భావించి పారదోలే ప్రయత్నం చేయడంతో సమస్య మొదలవుతుందన్నమాట. దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం మొదలైనవి (రుమాటిక్ ఫీవర్) ఉత్పన్నమవుతాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా, దీర్ఘకాలం పాటు పునరావృతమౌతుంటాయి.
సూచనలు: పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో మహా విషగర్భతైలం, ధనవంతరీ తైలం, క్షీర బలాతైలం, సింహనాదగుగ్గులు, మహాయోగ రాజ గుగ్గులు వంటి ఔషధాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా, యోగా, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుంచి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి.
7. నరం మీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్):
కాళ్లలో బలం లేనట్లుగా, సూదులతో గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంటే ఎగువ నరాల మీద ఒత్తిడి పడుతుందేమో చూడాలి. సాధారణంగా డిస్క్ స్లిప్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీనిని అశ్రద్ధ చేస్తే క్రమంగా కండరాలలో పట్టు తప్పిపోవడం, కాళ్లు అచేతనంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. దీనికి వాత చింతామణి రస వంటి రాజౌషధాలు అవసరమవుతాయి.
8. నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్ నెస్):
ఈ స్థితి కూడా డిస్క్ స్థానభ్రంశం చెందడం వలన ఉత్పన్నమైనప్పటికీ ఇతర స్థితులన్నింటిలోనికి దీనిని అత్యంత ప్రమాదకరమైన స్థితిగా భావించాల్సి ఉంటుంది. దీనికి తక్షణమే వైద్య సహాయం అవసరమవుతుంది.
9. గర్భాశయం వెనక్కి తిరిగి వుండటం (రెట్రోవర్డ్ టెడ్ యుటిరస్)/ గర్భాశయపు లోపలిపొర ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిన్):
ఈ రెండు సందర్భాల్లోనూ నడుం నొప్పి వస్తుంది. కొంతమందిమహిళలలో గర్భాశయం వెనక్కి తిరిగి ఉంటుంది, దీనిని 'రెట్రోవర్డ్ టెడ్ యుటిరస్' అంటారు. అటువంటి వారికి నెలసరి సమయంలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గర్భాశయంపు లోపలి పొర వ్యాధిగ్రస్తమై ఇతర భాగాలకు ప్రసరించినప్పుడు (ఎండోమెట్రియోసిస్) కూడా ఇలా జరుగవచ్చు.
ఔషధాలు: అశోకారిష్టం, పుష్యానుగచూర్ణం, చంద్రకళారసం, త్రిఫలాగుగ్గులు, లోధ్రాసవం, ప్రదరాంతకరసం.
10. మూత్రపిండాల్లో రాళ్ళు / కిడ్నీ వ్యాధులు:
కిడ్నీ వ్యాధులుగాని, కిడ్నీలలో రాళ్లుగాని ఉన్నప్పుడు నడుము నొప్పి వచ్చేఅవకాశం ఉంది. ఈ వ్యాధులలో మూత్రాన్ని జారీచేసే ఔషధాలను, అశ్మరీభేదన (రాళ్ళను కరిగించే (ఔషధాలను వాడాలి).
ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గోక్షురాది గుగ్గులు, పునర్నవాది మండూరం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సూరాక్షార కాసీస భస్మం.
11. ఉదరావయవాల వాపు:
ఎపెండిక్స్, పెద్ద పేగులు, గాల్ బ్లాడర్ లు వ్యాధిగ్రస్తమైనప్పుడు నడుము ప్రాంతానికి కూడా నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ కారణానుగునమైన చికిత్సలు అవసరమవుతాయి.
12. దీర్ఘకాల వ్యాధుల ప్రభావం / ప్రమాదకర రుగ్మతలు:
దీర్ఘకాలం నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు దానికి బరువు తగ్గిపోడవం కూడా తోడైతే, అది ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుంది. ఎముకల మూలుగా వ్యాధిగ్రసం కావడం (ఆస్టియోమైలైటిస్), బోన్ టీబీ, లుకేమియా, ఇంకా ఇతర రకాల క్యాన్సర్ల తాలూకు వివిధ అవస్థల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సత్వరమే వైద్య సహాయం పొందాలి.
సలహాలు:
జాయింట్ల కదలికలు తగ్గిపోవడం, నరాలమీద ఒత్తిడి పడటం వంటివి నడుము నొప్పిని పదే పదే తిరగబెట్టేలా చేస్తాయి. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే కింది సూచనలు పాటించాలి.
1. నడుము నొప్పికి నివారణగానూ, చికిత్సగానూ దశమూలాలను, శొంఠి వాడుకోవచ్చు. వీటిని డికాక్షన్ కాచి పూటకు అయిదు చెంచాల చొప్పున రెండు చెంచాల వంటాముదంతో కలిపి తీసుకోవాలి. దీనితోపాటు త్రయోదశాంగ గుగ్గులు అనే మందును లోపలికి, మహానారాయణ తైలం అనే ఔషధాన్ని బాహ్య ప్రయోగానికి వాడవలసి ఉంటుంది.
2. బరువులను, బ్యాగ్ లను, సూట్ కేసులను మోయాల్సి వచ్చినప్పుడు ఒక చేత్తో కాకుండా, రెండు చేతులతోనూ పట్టుకోండి. బరువులతో చాలా దూరం నడవాల్సి వస్తే మధ్య మధ్యలో సేదతీరే వరకూ ఆగండి.
3. స్టూల్స్ మీద, బ్యాక్ రెస్ట్ లేని ఆసనాల మీద కూర్చోవద్దు. కుర్చీలో కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. పాదాలను నేల మీద బల్లపరుపుగా ఆనించాలి. చేతులను హ్యాండ్ రెస్ట్స్ మీదగాని, ఓడిలోగాని పెట్టుకోవాలి.
4. పడుకునేందుకు స్థిరంగా ఉండే కాయర్ పరుపులను వాడాలి. ముఖ్యంగా పరుపు కిందనుండే బేస్ గట్టిగా ఉండాలి. ప్లేవుడ్ అయితే మంచిది.
5. బరువును లేపాల్సివస్తే, కాళ్లను ఎడంగా నడుమును నిటారుగా ఉంచి, మోకాళ్ల వద్ద ముడిచి, బరువును శరీరానికి దగ్గరగా పట్టుకొని లేపాలి. ముందుకు వంగొని బరువులను లేపకూడదు.
6. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఎందుకంటే నడిచేటప్పుడు హైహీల్స్ శరీరాన్ని ముందుకు వంచుతాయి. దీనితో నడుము ప్రాంతంలోని వెన్ను మరింతగా వంకర తిరిగి నడుము నొప్పి ఎక్కువవుతుంది.
7. పక్కమీద పడుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు వెల్లకిలా పడుకోండి, మెడ వంపు కింద, మోకాళ్ల కింద మెత్తని దిండ్లను అమర్చుకోండి. ఇలా చేయడం వలన నడుము ప్రాంతపు కండరాలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.
8. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు దుస్తులు ధరించాల్సి వస్తే నిలబడి కాకుండా పడుకునే ధరించండి.
9. పక్కమీద నుంచి లేచేటప్పుడు రెండు మూడు దశల్లో లేచి కూర్చోండి. ఒక్క ఉదుటన లేవకూడదు.
10. గర్భధారణ సమయంలో - ముఖ్యంగా చివరి మూడు మాసాలలో చాలా మందికి నడుము నొప్పి బాధిస్తుంటుంది. గర్భాశయంలో శిశువుపెరుగుతున్న కొద్దీ తల్లి భంగిమలో మార్పు చోటు చేసుకోవడమే దీనికి కారణం. గర్భస్థ శిశువు బరువును బ్యాలెన్స్ చేయడానికి తల్లి వెనుకకు వంగాల్సి వస్తుంది. దీనితో నడుముపైన అదనపు భారం పడుతుంది. ఇలాంటప్పుడు నిటారుగా నిలబడి నడుము మీద చేతులు ఉంచుకుని బలంగా శ్వాస తీసుకుని వెనుకకు వంగండి. ఇలా రోజుకు పది సార్లు చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
11. నడుము నొప్పి కొత్తగా మొదలైనప్పుడు ఐస ప్యాక్లనూ, దీర్ఘకాలం నుంచి బాధిస్తున్నప్పుడు వేడి కాపాడాలనూ ప్రయోగిస్తే మంచి మార్పు కనిపిస్తుంది.
12. నడుము నొప్పి దీర్ఘకాలం నుంచి బాధిస్తున్నప్పుడు ముందు వెనుకలకు వెన్నును వంచుతూ చేసే వ్యాయామాల వల్ల, యోగాసనాల వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
- =========================
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
ఫోన్ -9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి