L5-S1 జాయింట్ నడుము నొప్పి (lower back pain) కి ఎలా కారణం అవుతుంది?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
LS Joint and Low back Pain – లంబోసాక్రల్ జాయింట్ (L5-S1) గురించి తెలుసుకునే ముందు మనం వెన్నుముక అనాటమీ (నిర్మాణం) గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఉండే వెన్నుముక (స్పైన్) 26 ఎముకలతో లేదా వర్టిబ్రేలతో ఏర్పడుతుంది. ఇవి మెడ నుండి నడుము వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుముక ముఖ్య కర్తవ్యం వెన్నుపామును (స్పైనల్ కార్డ్) రక్షించడంతో పాటు మన శరీర బరువును మోయడం.
వెన్నుముకలో ఒక్కొక్క వెన్నుపూస మధ్య డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్‌లు వెన్నుముక కదులుతున్నపుడు షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తాయి. వెన్నుపాము నరాల సముదాయాలతో నిర్మితమై, మెదడుకు, కండరాలకు మధ్య సందేశాలను చేరవేసే వాహకంగా పనిచేస్తుంది. వెన్ను లోపల ఉండే స్పైనల్ కెనాల్ ద్వార వెన్నుపాము మెదడు నుండి నడుము వరకు వ్యాపించి ఉంటుంది.
వెన్నెముక వక్రత (curve) సహజంగా “S” ఆకారంలో ఉంటుంది. వెన్నెముక పొడవు, శరీర సంతులనం మరియు శరీర బరువును సమాంతరంగా ఉండడానికి సహాయపడుతుంది.
వెన్నుముక 5 భాగాలుగా విభజించబడింది:
- మెడభాగం (Cervical Vertebrae): మెడ భాగంలో 7 వెన్నుపూసలు ఉంటాయి.
- ఛాతిభాగం (Thoracic Vertebrae): ఛాతి భాగంలో 12 వెన్నుపూసలు ఉంటాయి.
- నడుము భాగం (Lumbar Vertebrae): నడుము భాగంలో 5 వెన్నుపూసలుంటాయి.
- వెన్నెముకలో క్రిందభాగం (Sacral Vertebra): సాక్రల్ వెర్టిబ్రె అనే ఈ ఒక ఎముక కౌమారదశలో 5 వెన్నుపూసల కలయికతో ఏర్పడుతుంది. ఇది త్రికోణ ఆకారం లో ఉంటుంది.
- కోక్సిజియల్ వెర్టిబ్రె (Coccygeal Vertebra) లేదా కోకిక్స్: ఈ ఎముక, కౌమారదశలో 4 వెన్నుపూసల కలయికతో ఏర్పడుతుంది.
సాక్రం మరియు కోకిక్స్ వెన్నుముకలో ఉండే చిట్టచివరి రెండు ఎముకలు. ప్రతి వెర్టెబ్రెను అవి ఉండే స్థానాన్ని బట్టి ఎగువ నుండి దిగువ శ్రేణిలో లెక్కించడం జరుగుతుంది. ఉదాహరణకి C1, C2 లేదా L4, L5 ఇక్కడ C అనగా సర్వైకల్ (మెడ భాగంలో ఉండే వెన్నుముక) మరియు 1 అనగా మెడ భాగంలో మొదట ఉండే వెన్నుపూస C1 గా గుర్తించబడుతుంది.
పైన వెన్నెముక యొక్క పూర్తి నిర్మాణం గురించి క్లుప్తoగా తెలుసుకున్నాం, ఇప్పుడు లంబో-సాక్రల్ జాయింట్ గురించి చర్చిద్దాం.
నడుం భాగంలో (లంబార్ రీజియన్) ఉండే 5 వెన్నుపూసలు మరియు వెన్నెముకలో చివరి భాగం అయిన సాక్రం ను కలిపి లంబో-సాక్రల్ జాయింట్ ఏర్పడుతుంది.
సాక్రం భాగం తొంటి లోని రెండు ఇలియాక్ ఎముకలను కలుపుతుంది. దీనిని సాక్రో-ఇలియాక్ జాయింట్ అంటారు. ఇది మెడ, వీపు మరియు నడుము భాగాల వెన్నెముక యొక్క మొత్తం బరువును మోస్తుంది. సాక్రo తర్వాత ఉన్న చివరి వెన్ను భాగాన్ని కోకిక్స్ అంటారు.
వెన్నుపాము నుండి వచ్చే నరాలు L1-S1 భాగం నుండి కాళ్ళ వరకు వెళ్తాయి. ఇందులో ముఖ్యంగా సయటిక్ నరము ఉంటుంది.
నడుము (లంబార్) భాగం లోని 5వ వెన్నుపూస మరియు సాక్రాల్ భాగం లోని మొదటి వెన్నుపూస ల మధ్య గల డిస్క్ ని L5-S1 డిస్క్ అంటారు. ఈ జాయింట్ వద్ద వెన్నుముక వంపు తీరు మారుతుంది; ఈ వంపు వల్ల నడుo మీద అదనపు భారం పడుతుంది.
L5-S1 జాయింట్ లో వచ్చే రుగ్మతలు (low back pain conditions):
డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ (Degenerative Disc Disease):
బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని మృదులాస్థి బయటకు తోసుకుని రావడాన్ని ‘హెర్నియేషన్’ అని అంటారు. మెత్తని మృదులాస్థి బయటికి వచ్చి వెన్ను నుండి మోకాల్లలోకి ప్రయాణించే నరాలపై ఒత్తిడిని కలగజేయడం వల్ల తీవ్రమైన నడుం నొప్పి వస్తుంది. కొన్ని సార్లు ఈ ఒత్తిడి వల్ల రోగి తొంటి మరియు మోకాళ్ళలో స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. దీనినే డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు. ఇది వయసుపైబడిన వారిలో మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో వెన్నుముక డిస్క్ లు మరియు వెన్నుపూసల అరుగుదలకు దారితీస్తుంది.
స్పైనల్ స్టినోసిస్ (Spinal Stenosis):
వెన్నులోపల ఉండే స్పైనల్ కెనాల్ అనే నాళం మూసుకుపోవట౦ లేదా ఇరుకుగా మారటాన్ని స్పైనల్ స్టినోసిస్ అంటారు. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఒత్తిడికి గురై తీవ్రమైన నడుo నొప్పి, తిమ్మిర్లు రావడం, కాళ్లు బలహీన పడటం, మలమూత్రాలు విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
డిస్క్ చిరగడం లేదా తొలగడం (Disk Tear):
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ డిస్కులు బలహీనపడి డిస్క్ అంచున ఉండే ఆన్యులస్ చిరిగి లోపల ఉండే మెత్తని జిగురు న్యూక్లియల్ పల్‌పోసస్ బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన హెర్నియేటెడ్ డిస్క్ నరాల పైన ముఖ్యంగా సయాటికా నరం పైన ఒత్తిడి కలిగించి సయాటికా నరం నొప్పికి దారితీస్తుంది. సయాటికా నొప్పి రావడానికి డిస్క్ చిరగడం లేదా తొలగడమే ప్రధానకారణం.
డిస్క్ హెర్నియేషన్ (Disk Herniation):
బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని జిగురుపదార్థం బయటకు తోసుకుని రావడాన్ని ‘హెర్నియేషన్’ అని అంటారు. ఈ బయటకు వచ్చిన జిగురుపదార్థం నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. డిస్క్ హెర్నియేషన్ లక్షణాలు:
- నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు వ్యాపించడం
- మెడ, భుజాల నొప్పులు
- చేతులు, కాళ్ళు తిమ్మిరెక్కడం
- కాళ్ళు మొద్దుబారినట్లుండడం
- కండరాల నొప్పులు
క్వాడ ఎక్వినా సిండ్రోమ్ (Cauda Equina Syndrome):
ఇది ఒక అరుదుగా వచ్చే వ్యాది. ఇది ముఖ్యంగా వయసు పైబడిన వారిలో వెన్నుపూసల మద్య ఉండే డిస్క్ లు చిరగడం లేదా పక్కకి తొలగి లంబార్ మరియు సాక్రల్ నరాలపై ఒత్తిడి కలిగించడం వల్ల కొన్ని సార్లు రోగి మల-మూత్ర విసర్జనల మీద నియంత్రణ కోల్పోవడం, నడుం కింది నుండి కాళ్ల వరకు స్పర్శ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్వాడ ఎక్వినా సిండ్రోమ్ ఇతర లక్షణాలు:
- సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి
- నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడి నుండి తొడల్లోకి, కాళ్లు, పాదాల వరకు ఉండడం
- కాళ్లల్లో తిమ్మిర్లు రావడం
- పాదాలలో మంటలు రావడం
స్పాండిలోలిస్థిసిస్ (Spondylolisthesis):
వెన్నులోని ఎముకలు పరిమితికి మించి ముందుకు లేదా వెనకకు జారడాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. ఇది ముఖ్యంగా వెన్నులోని ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్లు సాగటం, వెన్నుపూసలో ఒక భాగం విరగడం వల్ల వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే వెన్నుపూస ఎముకల మధ్యలో ఉండే డిస్క్ నరాలపై ఒత్తిడి పెంచి నడుము నొప్పికి దారి తీస్తుంది
స్కోలియోసిస్ (Scoliosis):
స్కోలియోసిస్ వెన్నెముకకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన డిఫార్మిటీ (సమస్య). ఇది వెన్ను మొత్తంలో (మెడ, ఛాతి, నడుం) భాగంలో ఎక్కడైనా రావచ్చు. వెన్నెముకలో అసాధారణ వక్రతను లేదా గూని ని స్కోలియోసిస్ అంటారు. ఇది ముఖ్యంగా యువకులలో, వయసు పైబడిన వారిలో మరియు ఆర్థరైటిస్ తో బాధపడుతున్న రోగులలో గమనించవచ్చు. స్కోలియోసిస్ (గూని) వల్ల నరాలు ఒత్తిడికి గురికావడంతో నడుం నొప్పి వస్తుంది.
సయాటిక (Sciatica):
వెన్నుపూసల మద్య ఉండే డిస్క్ బయటకు వచ్చి నరాల పైన ముఖ్యంగా సయాటికా నరం పైన ఒత్తిడి కలిగించి నడుము కింది భాగంలో నొప్పి మొదలయి అది తోడల నుండి పాకి కాలు కదపలేని స్తితికి రావటమే సయాటిక. ఈ సయాటిక రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏoటoటే:
- వెన్ను డిస్క్ లో వాపు వల్ల
- వెన్ను పాములో వాపు వల్ల
- డిస్క్ లో మార్పుల వల్ల
ఆస్టియోమైలైటిస్ (Osteomyelitis):
వెన్నెముక ఇన్‌ఫెక్షన్స్ కి గురికావడాన్ని ఆస్టియోమైలైటిస్ అంటారు. ఇది చాలా అరుదుగా వచ్చే ఎముకల ఇన్‌ఫెక్షన్. దీని వల్ల రోగులు దీర్ఘకాలిక నడుo నొప్పితో బాధపడుతుంటారు.
L5-S1 సిండ్రోమ్ కలగడానికి గల కారణాలు:
L5-S1 సిండ్రోమ్ రావడానికి గల ప్రధాన కారకాలు:
- వృద్ధాప్యం
- పని ఒత్తిడి
- గాయాలు
- జన్యు సంబంధ (జెనిటిక్ రిలేటెడ్)
- పుట్టుక లోపాలు
- ఒబెసిటీ
- తరచూ ఒత్తిడి (వెన్ను దిగువ భాగంపై)
- వెన్నుపై బరువు పడే అవకాశం ఉన్న క్రీడల వల్ల
- ధూమపానం – కీళ్ళు వేగవంతంగా వృద్ధాప్యంకు లోనయ్యేలా దారితీయవచ్చు
- జనన లోపం కారణంగా వెన్నెముకలో పెరుగుదల లోపాలు ఉండడం
- వెన్నుపూస కు ఏవైనా ఇంఫెక్షన్ లు సోకినపుడు
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
తేలికపాటి వెన్నునొప్పి ఉన్నపుడు మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. కానీ మీ నొప్పి ఒకటి లేదా రెండు వారలకన్నా ఎక్కువసేపు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
వెన్నులోని L5-S1 భాగానికి సంబంధించిన పరిస్థితులు సాధారణంగా వెన్నునొప్పి, కొన్నిసార్లు తిమ్మిర్లు మరియు పిరుదులలో నొప్పితో పాటు ఒక కాలిలో నొప్పి ఉంటుంది. లేదా మూత్రాశయం మరియు ప్రేగుల నియంత్రణ కోల్పోవటం వంటివి కూడా వెన్ను సమస్యల వల్ల కలిగే అవకాశం ఉండవచ్చు.
L5-S1 జాయింట్ లో అసాధారణతలకు సంబంధించిన లక్షణాలు:
- వెన్ను భాగంలో కండరాల నొప్పి
- వెన్నెముక బిగుతుగా మారడం
- కూర్చున్నపుడు లేదా వంగినపుడు నొప్పి తట్టుకోలేనంతగా ఉండడం – కాని పడుకున్న సమమయంలో ఉపశమనం అనిపించడం
- ఎక్కువ సమయం కూర్చొని ఉన్నపుడు అసౌకర్యంగా ఉండడం
- ఎక్కువ సమయం నిలబడి ఉన్నపుడు నొప్పిగా ఉండడం
- నొప్పి వెన్ను క్రింది భాగం నుండి పిరుదులు లేదా మోకాలు మరియు అరికాళ్ళ వరకు పాకినట్టు ఉండడం
- విసర్జన వ్యవస్థలో మార్పులు మరయు శరీర సమతులనం కోల్పోవడం
L5-S1 జాయింట్ లో వచ్చే మార్పులను ఎలా గుర్తిస్తారు?
మెడికల్ హిస్టరీ ద్వారా:
రోగి ప్రస్తుత శారీరక ఆరోగ్య పరిస్థితి పట్ల పూర్తిగా ఒక అవగాహనకు రావడానికి, గతంలో గాని ప్రస్తుతం గాని ఏమైనా ఆరోగ్య సమస్యలు లేదా వెన్నుకు ఏమైనా ప్రమాదవశాత్తు గాయాలు అయ్యుంటే, వాటికి సంభందించిన అన్ని వైద్య పరమైన పరీక్షల రిపోర్ట్ లు ఉంటె ఉపయోగకరంగా ఉంటుంది.
మీరు ఏవైనా ఆరోగ్యస మస్యలకు మందులు వాడుతున్నట్లయితే వాటి వివరాలు కూడా డాక్టర్ కు తెలియజేయాలి.
శారీరక పరీక్షల ద్వారా:
డాక్టర్ మీ ఆరోగ్యపరమైన మార్పుల గురించి, మలమూత్ర విసర్జన, లేదా శరీర సమతులనానికి సంభందించి ఏవైనా మార్పులు గమనించారేమో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగవచ్చు.
క్లినికల్ పరీక్షలో వెన్నుపూస కదలిక మరియు స్థిరత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. నాడీ వ్యవస్థ లో ఏదైనా గాయాలు గుర్తించడానికి నరాల ప్రతిచర్యలు పరీక్షించడం అవసరం.
- నరాల ఇరిటేషన్ ను అంచనా వేయడానికి – SLR (స్ట్రెయిట్ లెగ్ రైజింగ్) టెస్ట్ ను చేస్తారు.
- రూట్ కంప్రెషన్ లేదా డ్యామేజ్ అంచనా వేయడానికి – డెర్మటోమల్ సెన్సరి లాస్ (చర్మ స్పర్స)/ మయోటోమ్ డిఫిసిట్ పరిక్ష చేస్తారు.
- మస్కులో స్కెలెటల్ మన్యువర్స్ – మీ డాక్టర్ ఎముకల మరియు కండరాల కదలిక ద్వారా కీళ్ళ కదలికను మరియు నొప్పిని పరీక్షించడానికి ఈ పద్దతిని వాడుతాడు.
L5-S1 జాయింట్ లో వచ్చే రుగ్మతలు ఇతర వ్యాధులలో లేదా ఆరోగ్య సమస్యలలో కనిపించే సందర్భాలు:
- కిడ్నిలో రాళ్ళు ఉన్నపుడు
- అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిసమ్స్ – కడుపు, పొత్తికడుపు, మరియు కాళ్ళకు సరఫరా చేసే రక్తనాళాలు అసాధారణంగా వ్యాకోచించడం.
- ఆస్టియోపొరోసిస్: ఎముక ఖనిజ సాంద్రత క్షీణతకు కారణమయ్యే జీవక్రియ వ్యాధి.
- ఎండోమెట్రీయాసిస్: గర్భాశయ కణజాలం యొక్క అసాధారణ పెరుగుదల.
- ఫైబ్రోమైయాల్జియా: దీర్ఘకాలిక కండరాల నొప్పి ఉండే వ్యాధి.
L5-S1 జాయింట్ సమస్యలు ఉన్నపుడు చేయించుకోవలసిన పరీక్షలు:
- x-ray: X- ray వెన్నెముక యొక్క నిర్మాణంలో ఏదైనా అసాధారణతలను గుర్తించడంలో సహాయపడుతుంది. X-ray ఎముకలలో ఫ్రాక్చర్, వైఫల్యాలు, పెరుగుదలకు సంభందించిన లోపాలు, మరియు కణితులను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
- మైలోగ్రామ్ (Myelogram): వెన్నెముకలో ఒక రంగును ప్రవేశపెట్టి x-ray లో కణజాలం పారదర్సకతను చూడడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్ (CT Scan): ఇది మరొక ఇమేజింగ్ టెక్నిక్, ఇది వ్యాది తీవ్రతను నిర్దారించడంలో X- ray కన్నా మెరుగుగా ఉపయోగపడుతుంది
- మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI): ఈ పరీక్ష ద్వారా వెన్నెముక యొక్క అంతర్గత కణజాలాల మరియు డిస్క్ వ్యాధులను, ఉదాహరణకు డిస్క్ హెర్నియేషన్, నరాల మూలాలు మరియు ఇతర మృదు కణజాల లోపాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
- ఎలెక్ట్రోమయోగ్రఫీ (EMG): ఈ పరీక్ష ద్వారా నరాల ప్రేరణ మరియు కండరాల ప్రతిస్పందనను కొలుస్తుంది మరియు మార్పు చెందిన నరాల ప్రేరణల నిర్ధారణలో సహాయపడుతుంది.
- ఎముక స్కాన్లు (Bone Scans): ఈ పరీక్షలు ద్వారా వెన్నెముక లేదా ఎముక లోపాల యొక్క ఇన్ఫెక్షన్లను లేదా ఫ్రాక్చర్లను నిర్ధారించడానికి ఉపయోగించబడతాయి.
- ఆల్ట్రాసౌండ్ (Ultrasound): దీనిని అల్ట్రా సోనోగ్రఫి అని కూడా అంటారు. ఈ పరీక్షను కండరముల, లిగమెంట్ల మరియు టెండాన్ల వంటి మృదు కణజాలాలను పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
- రక్త పరీక్షలు: ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ మరియు ఆర్థరైటిస్ ఉనికిని గుర్తించడంలో సహాయపడతాయి.
- ఎముక సాంద్రత పరీక్ష (Bone density test): ఆస్టియోపోరోసిస్ ను గుర్తించడానికి ఈ పరీక్ష సిఫార్సు చేస్తారు.
- NCS / EMG (నెర్వ్ కండక్షన్ స్టడీస్ / ఎలెక్ట్రోమయోగ్రామ్): నరాల సంబంధిత రుగ్మతల ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
- QST (Quantitative Sensory Testing Technique): నొప్పి తీవ్రతను గుర్తించడంలో సహాయపడుతుంది.
L5-S1 జాయింట్ రుగ్మతలను నిరోధించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు:
L5-S1 జాయింట్ కారణంగా ఒచ్చే తీవ్రమైన వెన్నునొప్పిని నొప్పి-ఉపశమన మందులతో చికిత్స చేయవచ్చు, ఇంకా అధిక బరువు ఉంటె తగ్గించుకోవడం మరియు ఫిజికల్ థెరపి ద్వారా నొప్పి మళ్ళి పునరావృతం అవకుండా జాగ్రత్త పడవచ్చు. ఫిజికల్ థెరపి కండరాలను బలపరుస్తుంది మరియు నొప్పినుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
జీవనశైలిలో మార్పులు, చేసే పనులలోని భంగిమలలో మార్పులు, పోషకాహారం తీసుకోవడం మరియు శారీరక వ్యాయామాలు నొప్పితో బాధపడుతున్న కొందరి విషయంలో ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అయితే, వ్యాయామాలు ఒక శిక్షకుడు లేదా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
గాయం కలిగిన సందర్భాలలో, 24 గంటల్లోపు ఐస్ ప్యాక్స్ తరువాత హాట్ ప్యాక్స్ ద్వారా కండరాల నొప్పిని తగ్గించవచ్చు. వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన గాయాలు ఏమైనా తగిలినపుడు వెంటనే శ్రద్ధ వహించి వైద్యుడిని సంప్రదించాలి.
L5-S1 జాయింట్ కు సంభందించిన రుగ్మతలు నివారించడానికి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా అవసరం.
L5-S1 జాయింట్ కు సంభందించిన రుగ్మతల నివారణకు పాటించాల్సిన నియమాలు:
- వ్యాయామం: నడక, ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వెన్ను మరియు పొట్ట కండరాలను బలపరుస్తాయి.
- శరీర బరువు ఆరోగ్యకరంగా ఉంచుకోవడం: శరీర బరువు అధికంగా ఉంటే వెన్ను చివరి భాగంపై అధికంగా ఒత్తిడి పడుతుంది. కనుక శరీర బరువును నియంత్రణ లో ఉంచుకోవాలి.
- ధూమపానం మానివేయడం: ధూమపానం వెన్నెముక యొక్క వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
- సరైన శరీర భంగిమ: నిలబడి ఉన్నపుడు, కూర్చొన్నపుడు మరియు బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా జాగ్రత్త పడాలి. వంగి చేయవలసిన పనులకు సరైన పద్దతి అనుసరించాలి మరియు వెన్నుపై ఎక్కువ భారం పడే పనులు తోగ్గించుకోవాలి.
L5-S1 జాయింట్లో వచ్చే రుగ్మతలకు చికిత్సా పద్ధతులు:
నొప్పి తగ్గించడానికి ఉపయోగించే మెడిసిన్స్:
- మీ వైద్యుడు పారాసెటమాల్ 500 mg, లేదా నొప్పి తీవ్రంగా ఉంటె ఇతర యాంటి-ఇన్ఫ్లమేటరి టాబ్లెట్లను సూచించవచ్చు. ఇవి నొప్పి నుండి తాత్కాలిక ఉపసమనాన్ని కలిగిస్తాయి. కండరాల నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల టాబ్లెట్లను సిఫార్సు చేస్తారు.
- కొన్ని రకాల స్టెరాయిడ్ (టాబ్లెట్లు) లను కూడా నొప్పి తగ్గించడానికి సూచిస్తారు.
- పిలేట్స్ లేదా యోగ వంటి ఇతర వ్యాయామాలు కొన్ని సందర్భాల్లో సహాయపడతాయి.
స్టెరాయిడ్ ఇంజెక్షన్లు: తాత్కాలిక నొప్పిని తగ్గించి రోగి కదలడానికి సహాయపడుతాయి.
ఫిజియోథెరపి: ఫిజియోథెరపి కదలిక మరియు శారీరక ధృడత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
బ్రేసెస్: నొప్పి తీవ్రంగా ఉన్న కొన్ని సందర్భాలలో నడుముకు సపోర్ట్ చేసే బ్రెస్ లను డాక్టర్ సిఫార్సు చేస్తాడు.
శస్త్ర చికిత్స పద్ధతులు:
మెడిసిన్స్ మరియు ఫిజియోథెరపి చికిత్సల ద్వారా 6 వారాలలో ఉపశమనం కలగకుంటే నడుము నొప్పిని శాశ్వతంగా తగ్గించడానికి మీ డాక్టర్ శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తాడు.
జనరల్ అనస్థీషియాతోనే L5-S1 జాయింట్ సర్జరీ నిర్వహిస్తారు. దిగువన ఇచ్చిన రుగ్మతలలో శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
- డిస్క్ హెర్నియేషన్
- కణితి కారణంగా నరాలు ఒత్తిడికి లోనవుతుంటే
- లంబార్ కెనాల్ స్టినోసిస్
- వెన్నుపూసల అరుగుదల
- వెన్నెముక లేదా వెన్నుపాము ఇన్ఫెక్షన్లకు లోనైనపుడు
వర్టిబ్రోప్లాస్టి మరియు కైఫోప్లాస్టి (Vertebroplasty and Kyphoplasty): ఈ శస్త్రచికిత్స పద్ధతులు ఆస్టియోపొరోసిస్ వల్ల కలిగిన స్ట్రెస్ ఫ్రాక్చర్లను సరిచేయడానికి ఉపయోగపడతాయి.
స్పైనల్ లామినక్టమీ (Spinal Laminectomy): ఈ శస్త్రచికిత్సను స్పైనల్ స్టెనోసిస్ లో ఉపయోగిస్తారు. ఈ శస్త్రచికిత్స పద్ధతి నరములు మీద ఒత్తిడిని తొలగించడానికి ఉపయోగపడుతుంది.
డిస్సెక్టమీ లేదా మైక్రోడిస్సెక్టమీ (Discectomy or microdiscectomy): హెర్నియేటెడ్ డిస్క్ లేదా బోన్ స్పర్స్ ను సరిచేయడానికి ఈ శస్త్రచికిత్స సిఫార్సు చేయబడింది.
ఫార్మినోటిమిని (Foraminotomy): ఈ శస్త్రచికిత్స పద్దతిని మూసుకుపోయిన వెన్నెముక నాలాన్ని(స్పైనల్ కెనాల్) విస్తరించడానికి మరియు నరాలపై ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ఇంట్రాడెసికల్ ఎలెక్ట్రోథర్మల్ థెరపీ (IDET): ఈ శస్త్రచికిత్సను స్పైనల్ డిస్క్ కు సంభందించిన అరుగుదల వంటి రుగ్మతలను సరిచేయడానికి ఉపయోగిస్తారు.
న్యుక్లియోప్లాస్టి (Nucleoplasty) అనే ఈ శస్త్రచికిత్స పద్దతిని ప్లాస్మాడిస్క్ డీకంప్రెషన్ (PDD) అని కూడా అంటారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా హెర్నియేటెడ్ డిస్క్ వల్ల కలిగే నడుం నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
స్పైనల్ ఫ్యూషన్ సర్జరీ (Spinal Fusion Surgery): డీజనరేటివ్ డిస్క్ డిసీస్ లేదా స్పొండిలోలెస్థిసిస్ ఉన్నపుడు ఈ పద్ధతి ద్వారా వెన్నెముకలో వక్రతను సరిచేయడానికి మరియు నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతుంది.
డిస్క్ మార్పిడి (Disc Replacement): వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ పూర్తిగా అరిగిపోయినపుడు లేదా దెబ్బ తిన్నపుడు దానిని కృత్రిమ డిస్క్ తో మార్చడం జరుగుతుంది.
L5-S1 సర్జరీ చేయించుకొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- శారీరకంగానే కాక మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండడానికి, ఆపరేషన్ కు ముందు అన్ని వివరాలు డాక్టర్ తో క్షున్నంగా చర్చించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆపరేషన్ పట్ల ఏమైనా భయాలు లేదా సందేహాలు ఉంటే శస్త్రచికిత్సను ఎంచుకునే ముందు ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లతో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి.
- సర్జరీ కి ముందు సంకోచించకుండా మీ డాక్టర్ తో సర్జరీ విధానం మరియు అందులో వాడే ఇంప్లాంట్స్ గురించి వివరంగా అడిగి తెలుసుకోవాలి. ఇంకా సర్జరీ కి అయ్యే ఖర్చులు గురించి కూడా అవగాహన పొందవచ్చు.
- సర్జరీ కి ముందు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకొవలసి ఉంటుంది. ఉదాహరణకు ఆహారపు అలవాట్లు, చేసే పనులలో మార్పులు మరియు ఇతర అలవాట్లను మార్చుకోవలసి ఉంటుంది.
- మీ వైద్యుడు సర్జరీ కి ముందు కొన్ని మందులు, కొన్నిసార్లు ఫిజియోథెరపి సిఫార్సు చేస్తాడు.
- మీకు అవసరమయ్యే సర్జరీ మీ మెడికల్ ఇన్సురెన్సు కంపెనీ కవర్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ కవర్ చేస్తే ఎంత రీఎంబర్స్ అవుతుందో మరియు ఈ సౌకర్యం ఏ హాస్పిటల్లో ఉందో తెలుసుకోవాలి.
- సర్జరీ తరువాత రికవర్ అయ్యే సమయంలో ఆఫీస్ మరియు ఇంట్లో మీరు చేసే పనులలో ఎటువంటి స్ట్రెస్ మరియు ఇతర ఏవైనా దెబ్బలు తగలకుండ మీ పరిసరాలను అనుగుణoగా మార్చుకోవాలి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది.
సర్జరీ తరువాత ఎన్ని రోజులు హాస్పిటల్ లో ఉండాలి?
సాధారణంగా, ఏదైనా వెన్నెముక శస్త్రచికిత్స తరువాత 1-3 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సివస్తుంది. ఎన్ని రోజులు ఉండాలి అనేది మీరు భాదపడుతున్న రుగ్మత మరియు ఆపరేషన్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు స్కొలియోసిస్ తో భాదపడుతున్న రోగులు సర్జరీ తరువాత 6 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది.
సర్జరీ తరువాత కోలుకోవడానికి పట్టే సమయం:
సర్జరీ తరువాత కొద్దిగా నొప్పి ఉంటుంది. ఆపరేషన్లో వేసిన కుట్లు సాధారణంగా 5 నుండి 10 రోజుల తరువాత తీసి వేయడం జరుగుతుంది. నొప్పి పూర్తిగా తగ్గడానికి 6వారాలు సమయం పడుతుంది, దాని తరువాత కండరాలు నెమ్మదిగా శక్తిని పుంజుకొంటాయి.
కొంతమంది రోగులలో ఆపరేషన్ తరువాత మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమైనవే అయినప్పటికీ వెంటనే మీ సర్జన్ ను సంప్రదించాలి.
సర్జరీ తరువాత కొన్ని రోజులకు మీరు నడవవచ్చు. కానీ పూర్తిగా కోలుకోవడానికి 6వారాలు పట్టవచ్చు. మీరు తొందరగా కోలుకోవడానికి ఫిజియోథెరపి అవసరం అవుతుంది.
ప్రారంభదశలో బలం చేకూరెంతవరకు మరియు స్వంతంగా పనులు చేసుకోగలిగే వరకు వాకర్ లేదా ఇంకొకరి సహాయం తీసుకోవాలి. అయితే మీరు అధిక ఒత్తిడికి గురికాకూడదు, ఉదాహరణ బరువులు ఎత్తడం, నేలపై కోర్చోవడం, ముందుకు వంగడం వంటివి చేయరాదు. కీళ్ళు బిగుసుకుపోకుండా ఉండడానికి 15 నుండి 20 నిమిషాలకంటే ఎక్కువ సమయం కోర్చోవడం లేదా నిలబడడం వంటివి మానుకోవాలి.
ఓపియాయిడ్లు, NSAID లు (నాన్ స్టెరాయిడ్-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) మరియు లోకల్ అనెస్తిటిక్స్ వంటి మందులు నొప్పి తగ్గించడానికి వైద్యుడు సిఫార్సు చేస్తాడు. ఇవి తొందరగా కోలుకోవడానికి తోడ్పడతాయి. మీ డాక్టర్ మీ రికవరీ గురించి తెలుసుకవడానికి మీరు తరచూ మీ వైద్యుడిని కలుస్తుoడాలి.
తిరిగి మీ పనులు మొదలు పెట్టడం అన్నది మీరు చేసే పని ఎంత శారీరక శ్రమతో కూడుకొన్నది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ముందుగా మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
కోలుకొనే దశలో, స్వంతంగా పనులు చేసుకోలేక, వేరే వారిపై ఆధారపడాల్సి రావడంతో కొందరు రోగులు భావోద్వేగానికి లోనవుతారు; ఇలాంటి వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపి తొందరగా కోలుకోవడానికి కౌన్సిలింగ్ మరియు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం.
L5-S1 జాయింట్ శస్త్రచికిత్స తరువాత వచ్చే సమస్యలు (రిస్కులు)?
L5-S1 జాయింట్ శస్త్రచికిత్స తరువాత చాలావరకు ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ చాలా అరుదుగా ప్రతి శస్త్రచికిత్స లో ఉన్నట్లే ఇందులో కూడా కొన్ని రిస్కులు ఉంటాయి. L5-S1 శస్త్రచికిత్సలో సమస్యలు:
- నరాలు దెబ్బ తినడం (Nerve damage)
- శస్త్రచికిత్స తరువాత జాయింట్ ఇన్ఫెక్షన్ కి లోనవడం (Post-surgical infection in the joint)
- నిరంతర నొప్పి (Persistent pain)
- జాయింట్ లో కదలిక లేకపోవడం
- కాళ్ళలో రక్తం గడ్డకట్టడం (Blood clots in the leg)
- లైంగిక సమస్యలు (Sexual dysfunction)
- ఊపిరితిత్తుల సమస్యలు (Lung problems)
L5-S1 జాయింట్ శస్త్రచికిత్సల గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చూద్దాం:
2016 లో ఒక అధ్యయనం, పిల్లలు మరియు యుక్తవయస్కులలో డిస్క్ హెర్నియేషన్ యొక్క చికిత్సలు మరియు కోలుకునే స్థితిని అంచనా వేసింది. ఈ సమూహానికి నాన్ సర్జికల్ మరియు శస్త్రచికిత్స పద్ధతులు ఉపయోగించవచ్చు అని నిర్ధారించబడింది. ఏది ఏమయినప్పటికీ, శస్త్రచికిత్స ఎటువంటివారికి అవసరం అవుతుందంటే,
- ధీర్ఘకాలిక వెన్నునొప్పితో భాదపడుతున్న వారికి
- నొప్పి తరచూ వస్తుంటే
- నరాలకు సంభందించిన రుగ్మతలకు మందులు వాడినాకూడా నొప్పి 6 వారాలకంటే ఎక్కువ ఉన్నపుడు సర్జరీ సిఫారసు చేయబడుతుంది.
2016 లో మరొక అధ్యయనంలో మిని-ఓపెన్ ట్రాన్స్ ఫోరామినల్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూజన్ (నడుం వద్ద ఉండే వెన్నుపూస డిస్క్ అరుగుదలకు లోనైనపుడు వాడే శస్త్రచికిత్స పద్ధతి) యొక్క భద్రత మరియు సామర్ధ్యాన్ని పరిశీలించింది. ఈ శస్త్రచికిత్స పద్ధతిలో మృదు కణజాల డ్యామేజ్, రక్తస్రావం తక్కువగా ఉండడం మరియు హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అవడమే కాకుండా ఈ విధానం నడుం వద్ద ఉండే వెన్నెముక యొక్క డీజనరేటివ్ డిసీస్ ని (వెన్నుపూసల అరుగుదల) నయం చేయడానికి సమర్థవంతంగా మరియు సురక్షితమైనదిగా ఉపయోగపడుతుందని గుర్తించబడింది.
2017 లో ఒక ఆసక్తికర అధ్యయనం ప్రకారం, పెర్క్యుటేనియస్ ట్రాన్స్ ఫొరామినల్ ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స (ఈ శస్త్రచికిత్సా పద్ధతిని నడుం దగ్గర వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలను కరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు) సమర్థవంతమైన మరియు సురక్షిత పద్ధతిగా నిరూపించబడింది. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న 209 మంది రోగులలో ఎవ్వరికీ నరాల డ్యామేజ్, ఇతర సమస్యలు తలెత్తలేదని వెల్లడైంది.
2017 లో జరిపిన అధ్యయనంలో నడుం దగ్గర వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ సమస్యలతో భాదపడుతున్న వారికి నాన్ సర్జికల్ (టాబ్లెట్స్, ఫిజియోథెరపి) పద్ధతులు, విశ్రాంతి మొదటి చికిత్స ఎంపికలుగా పరిగణించబడ్డాయి.
L5-S1 జాయింట్ (లంబో సాక్రల్ జాయింట్) శస్త్రచికిత్స కు అయ్యే ఖర్చు:
భారతదేశంలో, లంబో సాక్రల్ జాయింట్ శస్త్రచికిత్స ఇంచుమించు 1.3 నుంచి 5 లక్షల మధ్య ఖర్చు అవుతుంది. శస్త్రచికిత్స రకం మరియు ప్రక్రియను బట్టి ఖర్చు మారవచ్చు.
భారతదేశంలోని కొన్ని ప్రభుత్వ మరియు ఛారిటబుల్ ఆస్పత్రులు సబ్సిడీ రేట్లలో శస్త్రచికిత్సకు వీలు కల్పిస్తున్నాయి.
మీరు వైద్య బీమాను కలిగి ఉంటే, ఈ శస్త్రచికిత్స మీ పాలసీ లో కవర్ అవుతుందా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఒకవేళ కవర్ అయితే అయ్యే ఖర్చు మొత్తంలో ఎంత వరకు మీ పాలసీలో కవర్ చేస్తుందో ముందుగానే తెలుసుకోవాలి.
L5-S1 joint treatment options in Telugu, All about L5-S1 in Telugu, back pain causes in Telugu, back pain symptoms in Telugu, low back pain treatment options in Telugu, Disc prolapse in Telugu, Slip disc and back pain in Telugu, Herniated disc in Telugu, spondylolisthesis in Telugu, spinal stenosis in Telugu, Ankylosing spondylitis in Telugu, back pain prevention in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి