ఆయుర్వేద శాస్త్రం మనిషి శరీరంలోని జాయింట్లను 'సంధులు' అని వ్యవహరించిది. సంధి అంటే కూడిన, వ్యవహారిక భాషలో జాయింట్లను కీళ్లు అంటారు. కీళ్ళనొప్పులకు సంబంధించి, కీళ్ల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విస్తృతమైన వివరణలు లభిస్తాయి.
కీళ్ల ప్రధాన విధి శరీరంలో కదలికలను కలిగచేయడం, కొన్ని కీళ్లు తక్కువస్థాయి కదలికలు కలిగినవిగా ఉంటే, మరికొన్ని ఎక్కువస్థాయి కదలికలను కలిగిఉంటాయి.
ఉదాహరణకు భుజం కీలు శరీరంలో ఇతర కీళ్లకంటే అధిక స్థాయిలో, విభిన్న దిశలలో కదలికలు కలిగి ఉంటుంది. బంతిగిన్నె కీలుగా అందరికీ తెలిసిన ఈ జాయింటు ముందుకూ, వెనకకూ, లోపలికీ, బైటకూ,పైకి, కిందకూ ఇలా రకరకాల కోణాలలో కదలికలు కలిగి ఉంటుంది. ఇంత విస్తృతమైన కదలికలు ఉన్నప్పుడు సహజంగానే ఈ జాయింటుకు స్వస్థానం నుంచి పక్కకు వైదొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 'గూడ జారడా'న్ని మనం ఎక్కువగా చూసేది అందుకే. దీనికి విరుద్దంగా నడుము కింద భాగంలో ఉండే త్రికాస్థి శ్రేణ్యస్థిల సంగమం (సేక్రో ఇలియాక్ జాయింట్) లో దాదాపు కదలికలు పూజ్యమనే చెప్పాలి.
మనలో చాలామందికి కీళ్లకు సంబంధించిన ఉచితానుచితజ్ఞత అనేది కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంటుంది. మనం ప్రతినిత్యం అలవోకగా ఎన్నెన్నో పనులను చేతులతోను, కాళ్లతోనూ చేసేస్తుంటాము, అయితే ఆయా భాగాల కీళ్లలో నొప్పి మొదలైతే మాత్రం తేలికగా జరిగిపోయే చిన్న పనైనా అసాధ్యంగా మారుతుంది. జాయింట్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కారణాలవైపు దృష్టి సారించడం అవసరం. లక్షణాత్మకమైన చికిత్సకంటే కారణానుగుణమైన చికిత్స తీసుకుంటే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది.
1. అభిఘాతాలు / దెబ్బలు:
కీళ్ల మీద ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు జనిస్తుంది. ఎముకల చిట్ట చివరిభాగం సాధారణంగా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. జాయింట్లను ఒకటిగా బంధించి ఉంచే క్యాప్సూల్ తాలూకు లోపలి పొర ఈ తైలయుతమైన సైనోవియల్ ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఒకవేళ కీలుకు ఏదైనా హాని జరిగినా, దెబ్బ తగిలినా సైనో వియల్ పొరకు విఘాతం కలగడం, కీలు నుండి చిన్న చిన్న ముక్కలు విడిపోవడం వంటివి జరుగుతాయి. అప్పుడు సైనోవియల్ పొర విపరీతంగా స్పందించి, అత్యధికస్థాయిలో ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన ద్రవమూ, దానిలో ఉండే కొన్ని పదార్థాలూ కలిసి నొప్పికి, వాపునకూ కారణమవుతాయి.
ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బ తగిలిన విషయం దృష్టిలోకి రాకుండా, సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తరువాత హఠాత్తుగా జాయింటు వాచిపోయి కనపడుతుంది. అలాంటి సందర్భాలలో నింపాదిగా ఆలోచిస్తే దెబ్బ తగిలిన విషయం బైటపడుతుంది.
సూచనలు: దెబ్బలు తగిలినప్పుడు జాయింట్లలో వాపు రాకుండా ఉండాలంటే జాయింటును కొంచెం ఎత్తులో ఉంచాలి. కదలకుండా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ముక్కలను పొడిలాగా నూరి ఒక గుడ్డలో వేసి కీలుపైన కట్టుకడితే వాపు జనించడానికి ఆస్కారం ఉండదు. కీళ్ల చుట్టూ స్థానికంగా వేడిగా ఉంటే శీతల ఉపచారాలనూ, చల్లగా బిగదీసుకుని ఉంటే ఉష్ణ సంబంధమైన ఉపచారాలనూ ఆయుర్వేదం సూచించింది.
ఔషధాలు: పునర్నవాదిగుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం.
బాహ్యప్రయోగాలు - మర్మగుటిక, సురదారులేపం.
2. పాత దెబ్బలు, గాయాలు:
ఒకోసారి, చాలా సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బలూ, బెణుకులూ వర్తమానంలో కీళ్ల నొప్పులుగా మారుతాయి. నడుము నొప్పి దీనికి మంచి ఉదాహరణ. జాయింట్లలో ఎముకలు విరగడం, తప్పుకోవడాలు జరిగినప్పుడు అప్పటికి బాధ సమిసిపోయినా, తరువాత ఎప్పుడో తీవ్రమైన నొప్పిరూపంలో తిరగబెట్టే అవకాశం ఉంది.
సూచనలు: అంతకు ముందెప్పుడో దెబ్బతగిలి, ఇప్పుడు దెబ్బతగిలినకీలు నొప్పిగా తయారైతే స్నేహ స్వేదాలను చికిత్సగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ చికిత్సా ప్రక్రియలలో ఔషధ తైలాలను బాహ్యంగా ప్రయోగించి, పదమూడు రకాలైన స్వేద ప్రక్రియలలో ఒకదానిని ఎంచుకుని చమటను పుట్టించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సల వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవ్వటమే కాకుండా, కీళ్లకు ఇరువైపులా ఉండే కండరాలు కూడా బలంగా తయారై నొప్పి తగ్గుముఖం పడుతుంది.
ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, వాతవిధ్వంసినీరసం, రాసానా ఏరండాదిక్వాథం, బాహ్యప్రయోగం - మహానారాయణతైలం.
3. సంధి శూల (ఆస్టియోఆర్తరైటిస్):
మోకాళ్లలోనో, తుంటి కీలులోనో నొప్పి ఉంటూ, విశ్రాంతితో బిగదీసుకుపోవడం, కదిలేటప్పుడు మరింత బాధామయంగా తయారవ్వటం జరుగుతుంటే అది సంధి వాతాన్ని (ఆస్టియోఆర్తరైటిస్) సూచిస్తుంది. ఎముకల కణజాలాల సముదాయాలు శిథిలమవడం వలన ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితి ఎక్కువగా శరీరపు బరువును మోసే జాయింట్లు - అంటే మోకాళ్లు, తుంటి కీళ్లకే పరిమితమై ఉండటాన్ని బట్టి, అధిక బరువు వలన అరుగుదల ఏర్పడి. తత్ఫలితంగా నొప్పులు ఉత్పన్నం అవుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే లావుగా ఉండే వ్యక్తులందరిలోనూ కీళ్ల నొప్పులు ఉండకపోవటమూ, సన్నగా ఉండే వాళ్లలో కూడా కీళ్ల నొప్పులుండటాన్ని బట్టి సంధి వాతానికి కారణాలుగా వంశపారంపర్యత, జన్మతః ఏర్పడిన నిర్మాణ లోపాల వంటి వాటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది.
ఆయుర్వేదం వ్యాధులు రావటానికి గల కారణాలను తెలియచేస్తూ అతియోగం అనే దానిని ప్రముఖంగా చెప్పింది. జాయింట్లను అతిగా, అసహజంగా ఉపయోగించడమే అతియోగమంటే, బాక్సర్ల మణికట్టు నొప్పులకూ, ఫుట్‌బాల్ ఆటాగాళ్ల మోకాళ్ల నొప్పులకూ కారణం ఇలాంటి అతియోగమే.
సూచనలు: సంధివాతం (ఆస్టియోఆర్తరైటిస్) జాయింట్ల అరుగుదల వలన సిద్దిస్తుంది కనుక దీనిలో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కావడాలను, ఐస్ ప్యాక్ లను మార్చి మార్చి ప్రయోగించడం వలన కూడా నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంతే కాకుండా దీనిలో ఆముదం, పిండ తైలాలూ అయోఘంగా పనిచేస్తాయి. వీటిలో ఒక దానిని కొద్దిగా వేడి చేసి కీలు పైన పలుచగా రాసి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. అలాగే సరైన వ్యాయామాలను ఎంచుకుని సాధన చేస్తే కీళ్లు అల్లుకుపోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి.
గృహ చికిత్సలు: 1. వెల్లుల్లిని ముద్దగా నూరి రెండు చెంచాల మోతాదుగా నువ్వులనూనెతో కలిపి (ఒక చెంచాడు) రోజుకు రెండుసార్లు వేడినీళ్లతో తీసుకోవాలి. 2. పారిజాతం ఆకులను (పది) గాని, వావిలి ఆకులను (గుప్పెడు) గాని ముద్దగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి చిన్న మంటమీద సగం కషాయం మిగిలెంతవరకు మరిగించాలి. దీనికి ఆముదం (ఒక చెంచా) చేర్చి ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. 3. మహిసాక్షి గుగ్గిలాన్ని అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు వేడినీళ్ళతో పుచ్చుకోవాలి. 4. శొంఠికషాయానికి (అరకప్పు) ఆముదం (రెండు చెంచాలు) చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 5. శొంఠి (అరచెంచా), నువ్వులు (ఒక చెంచా), బెల్లం (అరచెంచా) అన్నీ కలిపి ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
ఔషధాలు: యోగరాజగుగ్గులు, త్రయోదశాంగగుగ్గులు, లాక్షాదిగుగ్గులు, మహారాస్నాదిక్వాథం, మహావాతవిధ్వంసినీ రసం.
బాహ్యప్రయోగం - మహానారాయణతైలం. మోకాలు జాయింటు
4. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్):
కీళ్ళనొప్పులతో పాటు సాదారణారోగ్యం కూడా దెబ్బతింటే అది అమవాతాన్ని (రుమటాయిడ్ ఆర్త రైటిస్) ని సూచిస్తుంది. సంధి వాతం (ఆస్టియోఆర్తరైటిస్) లో మాదిగిగా దీనిలో కేవలం జాయిట్ల చివర్లు శితిలమవడం మాత్రమే ఉండదు. కేవలం బరువు మోసే జాయింట్లే వ్యాధిగ్రస్తం కావు. అంటే, సంధివాతంలో ఇన్ ఫ్లమేషన్ కు ఆస్కారం లేదు. అమవాతంలో అరుగుదలకు అవకాశం లేదు. రెండూ రెండు విభిన్నమైన వ్యాధులు. ప్రతి వందమందిలోనూ ముగ్గురు వ్యక్తులు అమవాతంలో బాధపడుతున్నారని ఒక అంచనా, అందునా, మగవారికంటే మహిళలే ఎక్కువగా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో ముందస్తుగా రెండు మడిమలూ, లేదా రెండు మణికట్లూ వాస్తాయి. నొప్పి ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. ఉదయంపూట ఈ లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. రక్తాల్పత కూడా ఉండవచ్చు.
కీళ్ళనొప్పులు ఎప్పుడూ ఒకే ప్రదేశానికి నిబద్ధం కాకుండా మారుతుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని కేవలం కీళ్ల వ్యాధిగా కాకుండా, శారీరక వ్యవస్థాగత వ్యాధిగా (సిస్టమిక డిసీజ్) పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అమవాతంలో కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగ ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం. దీనిలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. (అంటే, శరీరంలో ఉండే ప్రతిరక్షక కణాలు శరీరపు స్వంత కణజాలాలను బయటివాటిగా భావించి పాదదోలే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడటం). దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం (రుమాటిక్ ఫీవర్) మొదలైనవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా, దీర్ఘకాలం పాటు పునరావృత్తమౌతుంటాయి.
అమవాతానికి పూర్తిస్థాయి చికిత్స తీసుకోనట్లయితే శాశ్వత అంగవైకల్యంతోపాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి పురోగమనంలో కాని, వ్యక్తీకృత లక్షణ తీవ్రతలో కాని, వ్యక్తీనుండి వ్యక్తికీ కొంత వ్యత్యాసమున్నప్పటికీ ఇది ప్రాప్తించిన ప్రతివారూ నిస్సృహలకు, నిరాశకూ లోనవుతారనేది మాత్రం నిజం. అయితే దీని సమగ్ర రూపాన్ని అర్థం చేసుకుని చికిత్స తీసుకుంటే నిరాశా నిస్పృహలకు తావుండదు. సూచనలు: అమవాతానికి కొంత విజ్ఞతతో చికిత్సచేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో రెండు అవస్థలుంటాయి; ప్రకోపావస్థ మొదటిదైతే, శమనావస్థ రెండవది. ఈ రెండు అవస్థలలోనూ 'అమం' అనేది అన్యాపదేశంగా ఉంటుంది. (అపరిపూర్ణంగా, వ్యత్యస్థంగాపచనమైన ఆహారం విషతుల్యంగా మారి, శరీరపుధాతువులలోనికి విలీనమైనప్పుడు దానిని అమం అంటారు)రుమటాయిడ్ ఆర్త రైటిస్ తగ్గాలంటే ముందు అమానికి చికిత్స జరగాలి. అమవాతంలో ఆకలి మీద వేటు పడుతుంది కనుక ఆహారం తేలికగా జీర్నమయ్యేదిగా, అంటే ద్రవయుక్తంగా ఉండాలి.
జీర్ణశక్తి మెరుగవుతున్నకొద్దీ క్రమంగా అన్నం, పెసరకట్టు, పులగం వంటివి చేర్చుకుంటూ వెళ్లాలి. ఆహారంలో ఏ పదార్థాలు సరిపడవో వాటిని వాటిని గుర్తించి వదిలివేయాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని కనిపెట్టడం కష్టమైతే దానికి ఒక పధ్ధతి ఉంది; ఆహార పదార్థాన్ని తినకముందూ, తిన్న తరువాత నాడిని చూసుకోండి, ఆహారం తీసుకున్న తర్వాత నాడి ఐదు శాతం పెరిగితే మీకు ఆ పదార్థం సరిపడటం లేదని గ్రహించాలి. పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో షోథహర ఔషధాలు (ఇన్ ఫ్లమేషన్ తగ్గించే మందులు) ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. యోగ, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుంచి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి.
ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, స్వర్ణవాతరాక్షసం, వాత గజాంకుశరసం, సింహనాదగుగ్గులు, మహారాస్నాదిక్వాథం,
బాహ్యప్రయోగం: మహావిషగర్భతైలం. అరిగిన మోకాల
5. ఇన్ఫెక్షన్ వల్ల కీళ్లనొప్పి (ఇన్ ఫెక్టివ్ ఆర్తరైటిస్):
శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే జాయింట్లకు కూడా ఇన్ఫెక్షన్సోకే అవకాశం ఉంది. జలుబుకు కారణమైన వైరస్ కు సైతం తాత్కాలికంగా అయినప్పటికీ - కీళ్ల వాపును కలిగించే వీలుంది. అలాగే, జర్మన్ మీజిల్స్, హైపటైటిస్ వైరస్ లను కూడా ఈ నైజం ఉంది. జ్వరంతోపాటు వేళ్ల కణువుల వంటి చిన్న జాయింట్లలో నొప్పి ఉంటూ, అది ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతూ ఉంటే, దానిని రుమాటిజానికి చెందిన జ్వరంగా అనుమానించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఈ రకమైన జ్వరం గొంతునొప్పితో ప్రారంభమవుతుంది. జాయింట్లపైన ఏవైనా గడ్డలుకాని, కంతులుకాని లేస్తే, వాటినుంచి ఇన్ఫెక్షన్ జాయింట్ల లోనికి ప్రవేశించి, అక్కడినుంచి గుండె కవాటాలను చేరి, ఆ కవాటాలను లేదా వాల్వులను సైతం వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను అలా ఉంచితే అనైతిక లైంగిక సంబంధాలతో ప్రాప్తించే గనోరియా వ్యాధిలో జననాంగాల స్రావాలు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం, ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా జాయింట్లను చేరి వాటిని వ్యాధిగ్రస్తం చేయడమే.
సూచనలు: ఇన్ఫెక్షన్ వలన కీళ్ల నొప్పులు ఉత్పన్నమైనప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి కీటాణు నాశక ఔషధాలు అవసరమవుతాయి.
ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, శారిబాద్యాసవం, మహామంజష్టాదిక్వాథం, వ్యాధిహరణరసాయనం, భల్లాతకవటి.
6. వాతరక్తం (గౌట్):
పాదం బొటనవేలు వాచిపోయి నొప్పిని కలిగించడమనేది గౌట్ వ్యాధి లక్షణం. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం విశదీకరించిన వాతరక్తంతో పోల్చవచ్చు. ఇది ఎక్కువగా మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది. ఐతే స్త్రీలలో చాలా అరుదనే చెప్పాలి. ఏ కొద్దీమందిలోనో కనిపించినా, అది బహిష్టులు ఆగిపోయిన తరువాతనే. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యలక్షణంగా కొనసాగుతుంటుంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా దీనికి తోడ్పడుతాయి. గౌట్ వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. వేళ్ల కణువుల్లో (ముఖ్యంగా కాలి బొటనవేలులో) ప్రప్రథమంగా గౌట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత క్రమంగా కాలి మడమలు, మోకాళ్లు, ఇతర వేళ్ల కణువులు, మణికట్టు, మోచేతులు.... ఇలా ఒక్కొక్క దానిలోనూ, నొప్పి మొదలవుతుంది.
ఏ అర్థరాత్రో హఠాత్తుగా కాలి బొటనవేలి బాధతో మెలకువ వస్తుంది. వ్యాధికి గురైన జాయింటు వేడిగా, ఎర్రగా ఉబ్బిపోయి కనిపించడమే కాకుండా నునుపుగా, ఉబికిన రక్తనాళాలతో కూడి కనిపిస్తుంది. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. చిన్నగా చేతితో తాకినా భరించలేరు. ప్రారంభావస్థలో అనుబంధ లక్షణంగా జ్వరం ఉంటుంది, గౌట్ బయటపడేముందు ఆకలి మందగించడం, వాంతి వచ్చినట్లుండటం, చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు కొంతమందికి అనుభవమవుతాయి.
నొప్పి కొన్ని రోజులపాటు, లేదా కొన్ని వారాలపాటు బాధించి సద్దుమనుగుతుంది. ఆ సమయంలో కొద్దిగా దురదగా కూడా ఉండొచ్చు. నొప్పి మళ్లీ కొన్ని నెలల తరువాత తిరగబెడుతుంది. రానురాను ఇలాంటి పునరావృతాల మధ్య వ్యవధి తగ్గిపోయి నొప్పి ఒక నిరంతర లక్షణంగా, మారుతుంది. శారీరక శ్రమ, ఆపరేషన్లు, దీర్ఘవ్యాధుల వంటివీ, మిరిమీరి ఆహారాన్ని తీసుకోవడం (ముఖ్యంగా మాంసాహార భోజనాలు), త్వరితగతిన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కఠోరంగా ఉపవాస దీక్షలు చేయడం వ వంటివీ, మద్యపానం, మూత్రాన్ని జారీచేసే మందులు వంటివీ గౌట్ ను ఎక్కువ చేస్తాయి. దీని వల్ల రక్తంలో ల్యాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి సీరం యూరేట్స్ కు ఆస్కారం ఏర్పడుతుంది. గౌట్ కు ఒక ప్రధాన కారణం ఇలా సీరమ్ యూరేట్స్ పెరగడమే.
సూచనలు: గౌట్ వ్యాధి ఉన్నప్పుడు మద్యాన్నీ, మాంసకృత్తులు కలిగిన ఆహారాలనూ పూర్తిగా మానేయాలి. అలాగే తటాలున బరువు తగ్గటం కూడా మంచిది కాదు.
ఔషధాలు: మహామంజిష్టాదిక్వాథం, సిద్ధహరితాళభస్మం, తాళ సింధూరం, కైశోరగుగ్గులు, మహాయోగరాజగుగ్గులు, చవికాసవం, శారిబాద్యాసవం, భల్లాతకవటి.
7. సోరియాసిస్ వల్ల కీళ్ళనొప్పులు (సోరియాటిక్ ఆర్తరైటిస్):చర్మం పైన మోస్తరు ఎరుపు రంగుతో వలయాలు మాదిరి పొరలు ఏర్పడి. వాటిపైన దళసరిగా పొలుసులు తయారవుతుంటే అలాంటి స్థితిని సోరియాసిస్ అంటారు. నిజానికి సోరియాసిస్ చర్మవ్యాధే ఐనప్పటికీ, దానిని ఉపేక్షిస్తే జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొద్దీ మందిలో ఈ సోరియాసిన్ చర్మంపైన మచ్చలుగా కనిపించకపోయినా, తలలో చుండ్రు మాదిరిగా భ్రమింపచేస్తూనో, లేదా వేలి గోళ్లను పిప్పిగోళ్లుగా కనిపించేలా చేస్తూనో ఉండవచ్చు. అప్పుడు సహజంగానే సోరియాసిస్ అన్న అనుమానం రాదుగాని, నిద్రాణంగా వ్యాధి మాత్రం కొనసాగుతూ జాయింట్లను వ్యాధిగ్రాసం చేస్తుంది. సోరియాసిస్ వలన కీళ్ల నొప్పులు వస్తుంటే ముందస్తుగా రక్తశోధనౌషధాలతోసోరియాసిస్ ను చికిత్సించాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. తెల్లగన్నేరు వేరు, కానుగ చెట్టు పట్ట, జాజి చిగుళ్లు అన్నీ కలిపి ముద్దగా నూరి లేపనం చేసుకోవాలి. 2. మనష్శిల, అన్నభేది, మైలతుత్థం వీటిని సమభాగాలు తీసుకుని గోమూత్రంతో సహా నూరి పైకి రాయాలి. ఇవన్నీ తీక్షణ పదార్థాలు కనుక కంటికి, నోటికి తగలకూడదు. 3. కానుగ గింజలను ముద్దగానూరి పిండితే నూనె వస్తుంది, దీనిని నిలవచేసుకుని రోజువారిగా పైపూతగా వాడాలి. 4. రేల లేత చిగుళ్లను మెత్తగా నూరి పులిసిన మజ్జిగతో కలిపిరాయాలి. 5. గుప్పెడు వేపాకులను ముద్దగానూరి రోజు రెండుపూటలా చన్నీళ్ళతో తెసుకోవాలి. 6. తెడ్ల పాలాకుతో సూర్యపాక విధానాన్ని అనుసరించి తైలం తయారుచేసి పైకి, లోపలికి (ఒక చెంచాడు గ్లాసుడు పాలతో) వాడాలి.
ఔషధాలు: ఆరోగ్యవర్దినీ వటి, మహామంజిష్టాదిక్వాథం, పంచతిక్త గుగ్గులు, ఘృతం, అమృతభల్లాతక లేహ్యం, సర్పగంధవటి, చండమారుతం.
8. అంతర్గత రక్తస్రావం:
దెబ్బల వల్లనో,యథాలాపంగానో జాయింటులోనికి రక్తం స్రవిస్తే వాపు జనించడమే కాకుండా, కదలికలు కూడా పరిమితమై పోతాయి. అలాంటి సందర్భాలలో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది.
నవీన్ సూచనలు: జాయింట్లలోనికి రక్తస్రావమావుతున్నప్పుడు కారణాలను విశ్లేషించి తదనుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
ఔషధాలు: చంద్రకళారసం, బోల బద్దరసం, నాగకేశరచూర్ణం.
9. మందుల దుష్ఫలితాలు:
చాలా రకాల ఇంగ్లీషు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మం పైన దద్దుర్లు ఏర్పడడం, వాంతి వచ్చినట్లుండటం, కడుపులో గడబిడ వంటి లక్షణాలే కాకుండా కీళ్ళనొప్పులు కూడా ఇలాంటి అవాంచిత లక్షణాలలో భాగమే. అందుకే, ఏ మందునూ మీకై మీరు వాడకూడదు, ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వాడుతున్నప్పుడు కీళ్ళనొప్పులు వస్తే ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి. కీళ్ళనొప్పుల వెనుక సాధారణమైన కారణాల నుండి అసాధారణమైన కారణాల వరకూ ఎన్నో ఉంటాయి. నొప్పిని తగ్గించే మందు బిళ్లలను నేరుగా కొనేసి వేసుకోవడం దీనికి పరిష్కారం కాదు; అలా చేస్తే కడుపులో మంట పుట్టడమే కాకుండా, ఒకోసారి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉంది.
వ్యాయామం వలన నొప్పి మాయం
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.
వ్యాయామం వలన నొప్పి మాయం
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.
కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత రెండో కాలుతో కూడా అలాగే చేయండి. అలా ఒక్కో కాలుతో అయిదుసార్లు చేయండి.
వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. ఒక కాలుని పెైకి లేపాలి. పది అంకెలు లెక్కపెట్టేంత వరకూ అలాగే ఉంచాలి. అలాగే రెండో కాలుతో చేయాలి. ఒక్కో కాలుతోనూ అయిదుసార్లు అలా చేయాలి. అలా చేసేటప్పుడు క్రింద ఉన్న కాలుని నిటారుగా ఉంచలేకపోతే మోకాలు దగ్గర కొద్దిగా వంచండి. రెండో కాలుని ఎత్తండి.ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.
వెల్లకిలా పక్క మీద పడుకోండి. కాళ్ళని చాచి నెమ్మదిగా మోకాళ్ళను ఛాతీవెైపు తేవాలి. వాటి వెనుక చేతులుంచి అలా చేతులతో మోకాళ్ళను చాతిని ఎంత దగ్గరగా తేగలరో అంత దగ్గరగా తీసుకురండి. తలని పెైకి లేవనీకండి. కాళ్ళని క్రిందికి తెచ్చిన తరువాత నిటారు చేయకండి. అలా అయిదు సార్లు చేయాలి.కాళ్ళని దూరంగా ఉంచి నిల్చోండి. చేతుల్ని నడుము మీద ఉంచండి. మోకాళ్ళని నిటారుగా ఉంచండి. వీలెైనంత వెనక్కి నడుమును వంచండి. అలా ఆ భంగిమలో ఒకటి, రెండు సెకండ్లు శరీరానుంచి మళ్ళీ మామూలు భంగిమలోకి రావాలి. ఇలా రోజూ చేస్తే నడుముకి మంచింది.ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా నడుమునొప్పి, మెడనొప్పి వస్తుంటాయి. ఒక వేళ మెడలోంచి నొప్పి చేతుల్లోకి ప్రాకినట్టుండటం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెైద్యుణ్ని కలవాలి.
నడుమునొప్పి కాళ్ళలోకి ప్రాకినా, తిమ్మిర్లెక్కినా మనకు వెన్ను సమస్యలున్నాయన్న అనుమానం రావాలి. నరాల మీద ఏదెైన కారణాల వల్ల వెన్నుపూసలో ఒత్తిడి పడితే, ఆ నరం వెళ్ళే మార్గంలో నొప్పి, తిమ్మిర్లు వస్తాయి.చాలా మంది ఈ సమస్యల్ని పట్టింకోకుండడం చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో సమస్య తీవ్రమై శస్త్ర చికిత్స తప్పనిసరవుతుంది. మొదటి స్థాయిలో ఇంటువంటి సమస్యల్ని పసిగట్టు వెైద్యుణ్ని కలవాలి. మొదటి స్థాయిలో గుర్తించే లక్షణాల్ని ‘రెడ్‌ప్లాగ్స్’ అంటారు.
ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పెైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.
* మెడ, నడుమునొప్పి చేతుల్లోకి కాళ్ళలోకి వ్యాపిస్తే వెంటనే వెైద్యుడికి చూపించాలి.
* చేతులూ, కాళ్ళలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారినట్లనిపిస్తున్నా అలసత్వం చేయకూడదు.
* చిన్నదెైనా పెద్దదెైనా దెబ్బ తగిలినా తర్వాత మెడ, నడుములో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పితో పాటు జ్వరం వస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండవచ్చుననే అనుమానం రావాలి.
* నొప్పితో పాటు ఆకలి తగ్గినా, బరువు తగ్గినా వెన్నులో ఇన్ఫెక్షన్ గాని, కణితలు గాని వచ్చి ఉండవచ్చనే అనుమానం రావాలి. కాళ్ళలో గాని, చేతుల్లో గాని కండరాలలో పటుత్వం తగ్గినా, మలమూత్రాల మీద అదుపు తప్పినా, నడకలో మార్పు ఉన్నా వెంటనే వెైద్యుణ్ని సంప్రదించాలి.
చాలా వరకు వెన్ను సమస్యలు మందులు, ఫిజియోథెరపిలతో తగ్గిపోతాయి. 5 శాతం కన్నా తక్కువ మంది రోగుల్లోనే శస్త్రచికిత్సల అవసరముంటుంది. వెన్ను శస్త్రచికిత్స గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. వెన్ను శస్త్రచికిత్స జరిపితే కాళ్ళు, చేతులు పడిపోతాయని, ముందుకు వంగిలేకపోవడం బరువులెత్తకపోవడం లాంటివి చేయకూడదని ఎక్కువకాలం బెడ్గరెస్ట్ తీసుకోవాలని, నపుంసకత్వం కలగవచ్చని, ఆడవాళ్ళలో ప్రసవ సమయంలో వెన్నుకి మత్తు ఇవ్వడం వల్ల నడుమునొప్పి వసుందని భయాలున్నాయి. వెన్ను వంకర, (స్కోలియోసిస్, కైఫోసిస్) వస్తుంటే నడుము పెరిగే దాకా ఆగాలనుకుంటారు. అది తప్పు. ఏ వయస్సులో గుర్తిస్తే ఆ వయస్సులోనే శస్త్రచికిత్స చేయడం మంచిది. ఆగిన కొద్దీ వంకర వయసుతో పాటు పెరగవచ్చు. పెరిగే కొద్ది శస్త్రచికిత్స కష్టమవుతుంది.
కొంతమంది మెడకు, నడువుకు వెైద్యుల సలహా లేకుండా మెడకు కాలర్లు, నడుముకి బెల్టులు వాడుతుంటారు. ఇది తప్పు, అలా ఎక్కువ కాలం వాడడం వల్ల మెడ, నడుము భాగాల్లో కండరాలు బలహీనపడతాయి. దీంతో వెన్ను సమస్యలు వస్తాయి. అందుకని వెైద్యుల సలహ ప్రకారం ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులే ఆ బెల్టులు వాడాలి. సలహ లేకుండా వీటిని ప్రయత్నించవద్దు.విపరీతంగా నొప్పి ఉందా? బెడ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని కొందరు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకుంటుంటారు. 48 నుంచి 72 గంటలకన్నా ఎక్కువ విశ్రాంతిని తీసుకోవడం మంచిందికాదు. అలా కదలకుండా ఉంటే కండరాలు బలహీనమయి, భవిష్యత్తులో వీటివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మనం సరెైన పద్దతిలో బరువులెత్తకపోయినా వెన్ను నొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చున్నా నడుము, మొడ నొప్పి రావచ్చు. పద్దతి ప్రకారం వ్యాయామం చేయకపోయినా, ఊబకాయంవల్లా, మానసిక ఒత్తిళ్ళు, ధూమపానం, సరెైన ఆహారం తీసుకోవకపోవడం వల్లా వెన్ను సమస్యలు రావచ్చు. మనం కూర్చునే కుర్చీల విషయంలో, వాటిలో కూర్చునే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి. కుర్చీ వెనుక భాకం మెడవరకూ ఉంటే మంచింది. కూర్చున్నప్పుడు మోకాలు తుంటి కన్నా ఎత్తులో ఉండకూడదు. పాదాలు రెండింటిని నేలమీద ఆన్చాలి. లేకపోతే పుట్ రెస్ట్ మీద ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వారంలో అయిదు రోజులు నడవడం లేదా వ్యాయామం చేయాలి. నడక వల్ల నొప్పులు దూరమవడమే కాక, రక్తంలోంచి ఎముకలు కాల్షింని ఎక్కువగా తీసుకుని ఎముకలు గట్టిపడతాయి. సిగరెట్లు లాంటి అలవాట్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా, పుస్తకపఠనం, ఆటలు, సంగీతంలాంటివి తోడ్పడతాయి. సమతులాహారాన్ని తీసుకోవాలి. తిరుతిళ్ళు మానేయాలి.
డాక్టర్ జి.పి.వి.సుబ్బయ్య, స్పైన్ సర్జన్, గ్లోబల్ హాస్పిటల్, లక్డికాపూల్, హైదరాబాద్.
మోకాళ్ళ నొప్పులు నడివయసేలో
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.
మోకాళ్ళ నొప్పులు నడివయసేలో
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.
మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్ (cartilage) అనే ప్రొటీన్ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి. పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారు.
మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.
ఆస్టియో ఆర్థరెైటిస్(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.
చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.
ఫిజియో థెరపిస్ట్ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్ పరికరం (ఐ.ఎఫ్.టి, అల్ట్రాసౌండ్, ఐ.ఆర్.ఆర్., ఎస్.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.
గుండె బాగా కొట్టుకుంటుంది.
శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
ఇన్సులిన్ సూక్ష్మత పెరగడంతో షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.
షుగర్, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.
నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి. రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు. బ్రిస్క్ వాకింగ్.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి. నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు. పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. వెస్టెర్న్ టైప్ కమోడ్ ఉపయోగించాలి.
వ్యాయామం:
మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది. స్థరమైన సైకిల్ తొక్కితే మంచిది. ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.
ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్ నీ రీప్లేస్మెంట్ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్ మెటల్ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్) ‘అన్‌లోడర్ వన్’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.
క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది. కీళు సులువుగా కదులుతుంది. ఎముకలు బలపడతాయి. బ్యాలెన్స్ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి. చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి. సాధారణంగా మార్నింగ్ వాక్ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.
మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.
ధన్యవాదములు 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి