17, జూన్ 2020, బుధవారం

కంటి కింద నల్లటి వలయాలు ఆయుర్వేదం సలహాలు


కంటి కింద నల్లటి వలయాలా? - ఎందుకు వస్తాయి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

కళ్లు... ఎన్నో ఊసులను చెబుతాయి. 
కళ్లు... ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి. 
కళ్లు... నిశ్శబ్దంగానే అనేక అంశాలు వెల్లడిస్తాయి. మరి కళ్ల కింద ఏర్పడే వలయాలు... 
ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అనేక అనారోగ్యాలకు సూచనలు ఇస్తాయి. అసలు... ఈ నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా? 
తెలియజేసేదే ఈ ముందుజాగ్రత్త...
‘‘కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి...!’’ అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త’లు ఇవి...
డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

ప్రధాన కారణం... 
రక్తనాళాల చివరను రక్తకేశనాళికలు అంటారు. అంటే వెంట్రక అంత సన్నగా ఉండే రక్తనాళాలన్నమాట. వీటినే క్యాపిల్లరీస్ అంటారు. కనురెప్పల్లో చివరన ఉండే రక్తకేశనాళికల చివరలు చిట్లడం, అందులోని ఎర్ర రక్తకణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురునీలం రంగులో కనిపిస్తుంటుంది. అక్కడి చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటికింది భాగం నల్లగా, ముదురునీలంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా ఇవి కళ్ల కింద ఇలా వలయాల్లా కనిపిస్తుంటాయి. కంటి కింద నల్ల వలయాలు కనిపించడానికి అనేక కారణాలున్నాయి. 
చికిత్స... 
ఇటీవల కంటికింది నలుపును తగ్గించుకోడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాధారణ మేకప్ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి. 
హైపర్ పిగ్మెంటేషన్:
ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం నల్లగా మారి మచ్చలాగా కనిపించడం జరుగుతుంది. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి, కనురెప్పలకు కూడా పాకితే కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా కళ్లు, కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం మొదటగా చేయాల్సిన పని. 
గుంటకళ్లు: 
కొందరిలో కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కనుగుడ్డు లోపలికి ఉంటుంది. దాంతో కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. కనుగుడ్డు కింద ఉండే కొవ్వు పదార్థం లోపించడం వల్ల చాలామందిలో ఇది అనువంశికంగా కనిపిస్తుంటుంది. కంటికింద కొవ్వునింపడం, (ఫ్యాట్ గ్రాఫ్టింగ్), బ్లఫరోప్లాస్టీ వంటి శస్తచ్రికిత్సల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. కొందరిలో శస్తచ్రికిత్స చేయకుండానే కంటి కింద డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్ల ద్వారా చాలా తక్కువ గాటుతో చేసే శస్తచ్రికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. డెర్మల్ ఫిల్లర్స్ అంటే చాలా మృదువైన కణజాలంతో అక్కడి ఖాళీని భర్తీ చేయడం అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా కూడా కంటికింది నల్లమచ్చల వలయాలకు చికిత్స చేయవచ్చు.
నివారణ  
డార్క్ సర్కిల్స్‌కు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖకాంతి కోసం లేజర్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి. 
తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 
సమతులాహారం వేళ ప్రకారం తీసుకోవాలి. 
వంశపారంపర్యంగా వచ్చే వలయాలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. 
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. 
శారీరక వ్యాయామాలు మనసునూ ఉత్తేజంగా ఉంచుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి రిలాక్సింగ్‌గా ఉంటారు. అందుకని రోజూ 30 నుంచి 60 నిమిషాలు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
చల్లని నీటిలో ముంచిన కాటన్‌ని అలసిన కళ్లపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. 
కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి. 
క్రీములతో... 
హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తే... వాటిని కొన్ని పూత మందుల (క్రీమ్‌ల) ద్వారా తగ్గించవచ్చు. డాక్టర్‌ల సలహా మేరకు హోడ్రోక్వినైన్, కోజిక్ యాసిడ్, ఆర్‌బ్యుర్టిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్‌లు వాడటంతో నల్లటి వలయాలకు చికిత్స చేయడం సాధ్యమే. అర్జనైన్ వంటి హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండే కెమికల్ పీలింగ్‌తోనూ (అంటే... పూత మందు రాశాక కాసేపాగి అది పొరలా ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం) వాటిని తొలగించడం ఇప్పుడు సాధ్యమే. అయితే ఇది ఒకేసారిగాక కొన్ని సిట్టింగ్స్‌లో చేసే ప్రక్రియ.
కంటి కింది నలుపునకు కారణాలు:
ఎడతెరిపిలేని కంటి దురద 
నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు....)
అటోపిక్ డెర్మటైటిస్ 
అలెర్జీలు 
హె ఫీవర్ 
దుమ్ము 
ఎగ్జిమా
పాలిపోవడం: 
ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. 
ఐరన్ లేదా విటమిన్ లోపాలు 
వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు 
వయసు: 
మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి. 
డి-హైడ్రేషన్
వంశపారంపర్యం: 
కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి. 
జీవనశైలి: 
పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం... వంటివి. 
ముక్కు సమస్యలు: 
కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి) 
పిగ్మెంటేషన్ 
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం. 
క్యాచెక్సియా
అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం..

కామెంట్‌లు లేవు: