12, నవంబర్ 2019, మంగళవారం

గుండె లో నాళాలు సమస్య ఉంటే అవగాహనా కోసం

*గుండె రక్తనాళాల్లో పూడికలు మరియు  గుండెలో బ్లాకులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి నివారణ పరిష్కారం మార్గం తీసుకోవాలిసిన జాగ్రత్తలు* ,

       కొందరు పొట్టలో, ఛాతీలో ఏ కొంచెం నొప్పి వచ్చినా
అది 'గుండెపోటు' నొప్పేనేమో అని తీవ్రంగా గాభరా పడిపోతుంటారు. వీళ్లను ఆ భయంవెన్నాడుతూనే ఉంటుంది.  ఇటువంటి వారు కూడా ఒకసారి వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకుని సందేహాలను నివృత్తి చేసుకోవటం మంచిది.
        ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించే వారికి అంత భయం అక్కర్లేదుగానీ.. అది కొరవడినప్పుడు గుండెల్లో 'బ్లాకు'లు నిజంగానే ప్రమాదకరం. గుండెలో  పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు ఇప్పుడున్న పరీక్షలు ఏమిటి? వీటిలో సమస్యను ఏవెంత కచ్చితంగా చెప్పగలుగుతాయన్నది తెలుసుకోవడం ముఖ్యము .
* మధుమేహులు
* హైబీపీ ఉన్నవాళ్లు
* కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు
* పొగతాగే అలవాటున్న వాళ్లు
* వూబకాయులు
* తగినంత శారీరక శ్రమ, వ్యాయామాలు చెయ్యనివారు
* వయసు: సాధారణంగా రక్తనాళాలు పూడుకుపోవటమన్నది 40-50 ఏళ్ల పైబడిన వారికే ఎక్కువ. కానీ ఇటీవలి కాలంలో ఇంకా చిన్నవయసులోనే అంటే 30-40 మధ్య వయసు వారిలో కూడా గుండె రక్తనాళాల్లో పూడికలు కనబడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ముప్పులున్నా చిన్న వయసు నుంచీ జాగ్రత్తలు అవసరమని గుర్తించాలి.
* ఇవి కాకుండా రక్తంలో- లైపోప్రోటీన్‌-ఎ, హోమోసిస్టీన్‌, కార్డియోలిపిన్‌, ఫైబ్రినోజెన్‌ వంటివి ఉన్నవారికీ పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ. సాధారణంగా గుండెకు సంబంధించిన పరీక్షల ప్యాకేజీల్లో ఇవీ ఉంటాయి. లేదూ అనుమానం బలంగా ఉన్నవారికి వైద్యులు ఈ పరీక్షలు చేయిస్తారు.

పూడికలున్నాయేమో పరీక్షలు ఎవరికి అవసరం?
* పైన చెప్పిన ముప్పుల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ ముప్పులున్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవటం అవసరం. ఇవే కాకుండా..
* కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి లేదా ఆయాసం వంటివి వస్తున్న వాళ్లు,
* కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్లు,
* శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాలకు 'ఫిట్‌నెస్‌' పరీక్షలకు వెళుతున్న వాళ్లు, అలాగే తరచూ ఫిట్‌నెస్‌ పరీక్షలు అవసరమయ్యే పైలెట్ల వంటి ఉద్యోగులు..
..వీరంతా కూడా గుండెలో 'పూడికలు' ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం.

ప్రస్తుత పరిస్థితులను బట్టి 30-40 ఏళ్ల నుంచీ అందరూ కొన్ని ప్రాథమికమైన పరీక్షలు చేయించుకోవటం మంచిది. అందరికీ గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ అవసరం ఉండదుగానీ 'ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌'తో మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది. శారీరక వ్యాయామంతో కూడుకున్న ఈ పరీక్ష- గుండెలో అస్సలే పూడికలూ లేవని చెప్పలేకపోయినా.. దీని ఫలితాల ఆధారంగా చాలా వరకూ పెద్ద, ప్రమాదకరమైన పూడికలేమీ లేవని కచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటి ముప్పులేవైనా ఉండి, 40 ఏళ్ల పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి; 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఏటా ఒకసారి- ట్రెడ్‌మిల్‌, ఎకో, ఈసీజీ పరీక్షలు మూడూ చేయించుకోవటం మంచిది.

1. ఈసీజీ
మనిషిని విశ్రాంతిగా పడుకోబెట్టి.. ఛాతీ మీద కొన్ని వైర్లను అతికించి చేసే తేలికపాటి పరీక్ష ఇది. ఛాతీలో నొప్పిగా ఉన్న సమయంలో ఈ పరీక్ష చేస్తే.. దానిలో పూడికలకు సంబంధించిన తేడాలేమీ లేకపోతే.. అప్పుడు పూడికలు లేవని భావించవచ్చు. అంతేగానీ నొప్పి లేకుండా విశ్రాంతి సమయంలో ఈ పరీక్ష చేసి..పూడికలేమీ లేవని కచ్చితంగా చెప్పటం కష్టం.

ముఖ్యమైన విషయమేమంటే
ఎవరైనా నొప్పితో వస్తే వైద్యులు ఆసుపత్రిలో ఓ రోజు ఉంచి కొన్ని కొన్ని గంటల వ్యవధిలో పలుమార్లు ఈసీజీలు తీసి చూసి, అప్పుడు నిర్ధారిస్తారు.

2. ఎకో కార్డియోగ్రామ్‌ (ఎకో)
ఛాతీ మీది నుంచి అల్ట్రాసౌండ్‌ తరంగాల సాయంతో గుండెను పరిశీలించే ఈ 'ఎకో' పరీక్షతో చాలావరకూ గుండె గదుల మధ్య ఉండే కవాటాలు, గుండె పంపింగ్‌ సామర్థ్యం, అందులో పీడనాల వంటివి తెలుస్తాయి గానీ రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది దీనిలో స్పష్టంగా తెలియదు. పూడికలకు సంబంధించిన సమాచారం కోసం ఇతరత్రా పరీక్షల మీద ఆధారపడాల్సిందే.

3. ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ)
మనల్ని ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తిస్తూ.. క్రమేపీ దాని వేగం పెంచుతూ.. వరసగా ఈసీజీలు తీస్తారు. శారీరక వ్యాయామం పెరుగుతున్న కొద్దీ గుండెలో వస్తున్న మార్పులను గుర్తించటం ఈ పరీక్ష లక్ష్యం. చాలాకాలంగా ఉన్న, గుండెలో పూడికలకు సంబంధించి విలువైన సమాచారాన్నిచ్చే మంచి పరీక్ష ఇది. వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ గుండె కొట్టుకునే వేగం, పంపింగ్‌, బీపీ వంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పని చెయ్యాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్తసరఫరా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. గుండె మీద ఇంత ఒత్తిడి ఉన్నా సాధారణ ఆరోగ్యవంతులైతే 40-50 ఏళ్ల వయసులో కూడా కనీసం పది నిమిషాల పాటు వ్యాయామం చెయ్యగలుగుతారు. ఒకవేళ గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు వస్తే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్తసరఫరా జరగదు, అందుతున్న రక్తం సరిపోదు. దీంతో వాళ్లకు ఈసీజీలో తేడాలు కనబడతాయి. గుండెలో నొప్పి ఆరంభమవ్వచ్చు. కొన్నిసార్లు బీపీ తగ్గిపోతుండొచ్చు. ఈ లక్షణాలు మొదలైతే వెంటనే పరీక్ష ఆపేస్తారు. వీటన్నింటినీ బట్టి 'ట్రెడ్‌మిల్‌టెస్ట్‌ (టీఎంటీ) పాజిటివ్‌' అంటారు. ఇలా తేడా వస్తే గుండెలో పూడికలున్నట్టు బలంగా అనుమానించి.. రక్తనాళాల్లో పూడికలను కచ్చితంగా నిర్ధారించి చెప్పే 'యాంజియోగ్రామ్‌' పరీక్షకు పంపిస్తారు.

* టీఎంటీలో ఎటువంటి తేడాలూ లేవని తేలినంత మాత్రాన.. గుండెల్లో ఎటువంటి పూడికలూ లేవని నూటికి నూరు శాతం చెప్పగలమా? అంటే లేదు. ఈ పరీక్షలో కూడా 60% వరకే ముప్పును చెప్పగలం. 40% కేసుల్లో పూడికలు ఉన్నా ఇది కచ్చితంగా పట్టుకోలేకపోవచ్చు. అలాగే ఒక రక్తనాళమే పూడుకున్నా కూడా అదీ పరీక్షలో బయటపడకపోవచ్చు. కనీసం 2 నాళాల్లో బ్లాకులు వస్తేనే దీనిలో 'పాజిటివ్‌' వస్తుంది. ఇటువంటి పరిమితులున్నాయి కాబట్టి... ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే చాలావరకూ ఫర్వాలేదని చెప్పచ్చుగానీ నూరు శాతం పూడికలే లేవని చెప్పలేం.

* ట్రెడ్‌మిల్‌ పరీక్షతో మరికొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతోందంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీన్నిబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం ఎంత వరకూ చెయ్యచ్చన్నది కూడా ఇందులో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి 30 ఏళ్ల తర్వాత రెండేళ్లకోసారి అయినా ఈ పరీక్ష చేయించుకోవచ్చు.

4. డొబిటమిన్‌ స్ట్రెస్‌ ఎకో
వ్యాయామాలు చెయ్యలేని వారికి చాలా ఉపయోగకరమైన పరీక్ష, కానీ దీని ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదు. చాలామంది స్త్రీలు ట్రెడ్‌మిల్‌ మీద సరిగా నడవలేరు. వాళ్లకూ ఇది బాగా ఉపయోగపడుతుంది. మనిషిని పడుకోబెట్టి 'డొబిటమిన్‌' అనే మందు కొద్దికొద్దిగా ఇస్తూ.. మధ్యమధ్యలో 'ఈసీజీ', 'ఎకో' పరీక్షలు చేస్తుంటారు. ఈ మందు గుండె వేగాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఎక్కడైనా ఒక ప్రాంతంలో పూడిక వస్తే అక్కడ గుండె కొట్టుకోవటం తగ్గిపోతుంది. దీంతో ఆ ఒక్క ప్రాంతంలో తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇది 15 నిమిషాల్లో పూర్తయిపోయే సున్నితమైన, కచ్చితమైన, సురక్షితమైన పరీక్ష. రక్తనాళాల్లో పూడికలు ఉంటే దీనిలో 85% వరకూ కచ్చితంగా పట్టుకోవచ్చు. ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే తర్వాత 2-3 ఏళ్లలో గుండెపోటు

5. స్ట్రెస్‌ థాలియం
అమెరికా వంటి దేశాల్లో ట్రెడ్‌మిల్‌కు ప్రత్యామ్నాయంగా చాలా విరివిగా వాడేస్తున్న పరీక్ష ఇది. ఈ పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పూడికలుంటే 80% వరకూ కచ్చితత్వంతో చెబుతుంది. ట్రెడ్‌మిల్‌ మీద నడిపిస్తూ గుండె కట్టుకునే రేటు ఒక స్థాయికి చేరుకోగానే- 'థాలియం' అనే 'రేడియో ఐసోటోపు' పదార్థాన్ని ఇంజక్షన్‌ ఇచ్చి, అప్పుడు స్కానింగ్‌ చేస్తారు. బ్లాకులు లేకుండా రక్తప్రసారం బాగున్న ప్రాంతమంతటికీ థాలియం బాగా చేరిపోతుంది. బ్లాకులుండి, రక్తసరఫరా లేని చోటికి థాలియం చేరదు కాబట్టి స్కానింగ్‌లో ఆ ప్రాంతాలన్నీ మచ్చల్లా (కోల్డ్‌ స్పాట్స్‌) కనబడతాయి. గుండెలో ఎంత ప్రాంతానికి రక్తసరఫరా అందుతోందన్నది దీనిలో స్పష్టంగా తెలుస్తుంది. మిగతా పరీక్షల్లో రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? లేవా? ఉంటే ఎంత శాతం ఉన్నాయన్నది తెలిస్తే దీనిలో
గుండెలో ఎంత ప్రాంతానికి రక్తప్రసారం తగ్గుతోందన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా   కచ్చితమైన పరీక్ష. కాకపోతే దీనిలో 'రేడియేషన్‌' ప్రభావం ఉంటుంది కాబట్టి మన దేశంలో అంత విరివిగా వాడటం లేదు.

6. సీటీ యాంజియోగ్రామ్‌
ఇది అత్యాధునికమైన పరీక్ష. అయోడిన్‌ రంగు పదార్థాన్ని ఇంజక్షన్‌ చేసి.. కొద్ది నిమిషాల తర్వాత గుండెకు 'సీటీ స్కాన్‌' చేస్తారు. పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆసుపత్రిలో చేరటం వంటి బాదరబందీలేమీ ఉండవు. చివరికి ఫలితం దాదాపు 'యాంజియోగ్రామ్‌' అంత స్పష్టంగా, అంత కచ్చితత్వంతో ఉంటుంది. పైగా యాంజియోగ్రామ్‌ కంటే ఖరీదు తక్కువ. ఇప్పుడిప్పుడే   ఏర్పడుతున్న పూడికలను కూడా ఇది కచ్చితంగా పట్టుకోగలుగుతుంది. రేడియేషన్‌ ప్రభావం మరీ ఎక్కువేమీ ఉండదు. కొత్తతరం యంత్రాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ రేడియేషన్‌ ప్రభావం మరింత తగ్గుతోంది కూడా. మొత్తానికి రేడియేషన్‌ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని 35 ఏళ్ల లోపు వారికి దీన్ని చెయ్యరు. అలాగే 65-70 ఏళ్ల వారికి చేస్తే క్యాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడి ఉంటాయి కాబట్టి ఫలితాలు అంత స్పష్టంగా ఉండవు. కాబట్టి- గుండెలో రక్తనాళాలు   మూసుకుపోయే రిస్కు ఎక్కువగా ఉన్నవారికి, కుటుంబ చరిత్ర ఉన్న వారికి, తరచుగా ఛాతీలో నొప్పి వస్తున్న వారికి, గుండెపోటు భయం పీడిస్తున్న వారికి.. దీనితో చాలా ప్రయోజనం ఉంటుంది.

7. యాంజియోగ్రామ్‌
గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయా? లేదా? ఉంటే మూడు రక్తనాళాల్లో ఎన్నింటిలో పూడికలు వచ్చాయి? ఎన్ని చోట్ల పూడుకున్నాయి? ఎంత శాతం పూడుకున్నాయి? వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది? వంటి సమాచారాన్నంతా కచ్చితంగా చెప్పే అత్యంత ప్రామాణికమైన పరీక్ష ఇది. నేడు అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటిలో కచ్చితత్వం దీనికే ఎక్కువ. కాకపోతే కాస్త ఖరీదైన పరీక్ష ఇది. 10-15 నిమిషాల సమయం పడుతుంది. గుండెలోకి గొట్టాలు  ప్రవేశపెట్టటం వంటివి అవసరమైన పరీక్ష కాబట్టి పరీక్ష పూర్తయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచి, తర్వాత ఇంటికి పంపించేస్తారు.

* సాధారణంగా ఇతరత్రా సాధారణ పరీక్షల్లో పూడికలున్నాయని బలమైన అనుమానం వ్యక్తమైనప్పుడు- కచ్చితత్వంతో గుర్తించి నిర్ధారించుకునేందుకు ఈ యాంజియోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. దీని ఫలితాల ఆధారంగా రోగికి స్టెంట్‌ అమర్చాలా? ఆపరేషన్‌ అవసరమా? చేస్తే ఎలాంటి చికిత్సలు చెయ్యాలన్నది కచ్చితంగా నిర్ధారించటం వీలవుతుంది. పూడికలు ఉన్నట్టు గుర్తిస్తే ఈ పరీక్షా సమయంలోనే 'స్టెంట్‌'లను కూడా అమర్చే వీలుంటుంది, దానికి అదనంగా మరో 30-40 నిమిషాలు పడుతుంది.

అత్యాధునికం
గుండెలోని రక్తనాళంలో పూడిక ఏర్పడితే- చికిత్స అందించటానికి ఆ పూడిక స్వభావం ఏమిటన్నది తెలుసుకోవటం అవసరం. ఇందుకు యాంజియోగ్రామ్‌ చెయ్యటానికి గుండెలోకి పంపించే గొట్టం చివర్లోనే చిన్న కెమేరా ఉండే 'కరోనరీ యాంజియోస్కోపీ', పూడికలో కొవ్వు ఎక్కువగా ఉందా.. దాని స్వభావమేంటో చెప్పే 'ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ', పూడికకు ముందు, ఆ తర్వాత రక్త ప్రవాహ పీడనంలో తేడా ఎంత ఉంది? దానికి స్టెంట్‌ అవసరమా? అన్నది తేల్చి చెప్పే 'డాప్లర్‌ ఫ్లో వైర్‌', రక్తనాళం లోపలే అల్ట్రాసౌండ్‌ తరంగాలు పంపించటం ద్వారా పూడిక ఎంత మేర ఉంది, దాని స్వభావం ఏమిటన్నది చెప్పే 'ఇంట్రా వ్యాస్క్యులర్‌ అల్ట్రాసౌండ్‌' వంటివి లోతైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి.

చికిత్స
పూడికలుంటే యాంజియోగ్రామ్‌ పరీక్ష తర్వాత వాటిని ఓ మోస్తరు (50% కంటే తక్కువ), మధ్యస్తం (50-70%), తీవ్రం (70% కంటే ఎక్కువ) అని వర్గీకరిస్తారు. అలాగే పూడికలు ఒక రక్తనాళంలో ఉన్నాయా? రెంటిలో ఉన్నాయా? మూడింటిలోనూ ఉన్నాయా? అన్నది చూసి, వీటన్నింటి ఆధారంగా ఏ రకం చికిత్స చెయ్యాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా 40-60 మధ్య వయసు వారిలో ఒకటి గానీ, రెండు గానీ పూడికలు ఉంటే 'స్టెంట్‌'లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో మూడు నాళాల్లోనూ పూడికలుంటే 'బైపాస్‌' ఆపరేషన్‌ ఉత్తమం. 75 ఏళ్లు పైబడిన వారిలో పూడికలుంటే వాళ్లు పెద్దగా శారీరక శ్రమ చెయ్యరు కాబట్టి చాలా వరకూ మందులతో చికిత్స చేస్తారు.

* స్టెంట్‌, బైపాస్‌ రెండూ కుదరనప్పుడు 'కరోనరీ కౌంటర్‌ పల్సేషన్‌' చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. ఇది శాస్త్రీయమైన చికిత్సే. మిగతా మార్గాలేవీ లేవనుకున్నప్పుడు, రోజూ నొప్పి వస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తనాళాలను గుండె కొట్టుకునే వేగానికి అభిముఖంగా ఆడిస్తూ వాటిలో ఒత్తిడి పెంచటం దీని ప్రత్యేకత. ఇది పూడికలను తొలగించలేదుగానీ దీనివల్ల పక్కనుండే చిన్న రక్తనాళాల్లోకి ప్రవాహం పెరిగి.. నొప్పి బాగా తగ్గుతుంది.

*👉🏿గ్రూపులో వారు ఉన్న అపోహలు*
* ఈసీజీగానీ, ఎకో పరీక్ష గానీ 'నార్మల్‌' అయితే గుండెలో పూడికలు లేవనేం కాదు. ట్రెడ్‌మిల్‌ పరీక్షలో నెగిటివ్‌ వస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువనేగానీ అస్సలుండవని కాదు.

*ఒకసారి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ తర్వాత జబ్బు పూర్తిగా నయమైపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్‌ సాయంతో, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ సాయంతో మనం... రక్తనాళంలో ఇప్పటికే ఉన్న అవరోధాన్ని తొలగించామేగానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా అదేమీ అడ్డుకోదు*. పూడికలు రావటమన్నది ఒక్కసారితో నయం చేసేయటానికి వీలైన సమస్య కాదు. కాబట్టి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ తర్వాత కూడా మళ్లీ పూడికలు రాకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూనే ఉండాలి.

*👉🏿జాగ్రత్తలు*
1. నిత్యం పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవటం.
2. యోగా, ధ్యానం చెయ్యటం.
3. నిత్యం వ్యాయామం చెయ్యటం.
4. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటిని కచ్చితగా అదుపులో ఉంచుకోవటం.. ఇవి చాలాచాలా ముఖ్యం. స్టెంట్‌, బైపాస్‌ సర్జరీల వంటివి సాధ్యం కాకపోయినా... ఈ నాలుగు జాగ్రత్తలతో పూడికలు బాగా తగ్గుతున్నాయని మౌంట్‌అబూ, ఎయిమ్స్‌ అధ్యయనాల్లో నిర్ధారించారు కూడా. కాబట్టి వీటిని తక్కువగా అంచనా వెయ్యటానికి లేదు.

ఉదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--Courtesy with Naveen Kumar Nadiminti
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: