అందమైన పాదం అంటే ఎలాంటి పగుళ్లు మరియు నల్లని మచ్చలు లేని పాదమే. కానీ అలాంటి పాదం సులభంగా సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి రోజు మనం మన పాదాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటాము కానీ వాటి పై ఎలాంటి జాగ్రత్తలు లేదా కేర్ తీసుకోము. పాదాల విషయంలో మనకు ఎక్కువ బాధ కలిగించేదే పగుళ్లు. ఇవి ప్రారంభంలో చూసేందుకు వికారంగా ఉంటుంది మరి వీటి యొక్క తీవ్రత పెరిగే కొద్ది నొప్పి కూడా పెరుగుతుంది. పాదాలలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి వీటి యొక్క కారణాలు వీటిని నివారించే పద్దతులను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పాదాలలో పగుళ్లు రావటానికి కారణాలు

కాళ్ల వెనుక మడమ భాగంలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.

  • పొడి గాలి, సరైన కేర్ తీసుకోక పోవటం, సమతుల్యమైన ఆహారం లేకపోవటం, వృద్ధాప్యం, దీర్ఘకాలం పాటు నిలబడి ఉండటం మరియు సరైన బూట్‌లను ధరించక పోవటం.
  • తామర, ఆనికాయ, థైరాయిడ్ మరియు డయాబెటీస్ వంటి కొన్ని వ్యాధుల వలన కూడా పగుళ్లు ఏర్పడతాయి.
  • స్థూలకాయం వలన పాదాలపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి.
  • చలి కాలంలో తగిన తేమ పదార్థాలు చర్మంలో లేకపోవటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.
  • వృధాప్యంలో శరీరంలోని నేచురల్ ఆయిల్స్ తగ్గిపోవటం వలన పగుళ్లు ఏర్పడవచ్చు.
  • ఎక్కువ సమయం పాదాలను నీటిలో ఉంచటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.

పగుళ్ల యొక్క లక్షణాలు

  • చర్మం దురదగా ఉండటం, రెడ్నెస్, వాపు మరియు పీలింగ్.
  • మడమ చుట్టూ చర్మం రఫ్ గా కఠినంగా ఉంటుంది.
  • మొదటి దశలోనే చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి లోతైన పగుళ్లు, రక్తస్రావం మరియు తీవ్ర నొప్పికి దారితీస్తుంది.

పగుళ్లు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు

పగుళ్ల యొక్క కారణాలు తెలుసుకుంటే సులభంగా వాటిని అవాయిడ్ చేయవచ్చు.

  • డ్రై స్కిన్ ఉన్నవారికి ఉదాహరణకు, వారి పాదాలను తేమగా ఉంచడానికి వేర్వేరు చర్యలను ప్రయత్నించాలి. సహజ నూనెలు మరియు క్రీం తో పాదాలను మాయిశ్చర్ చేసుకోవాలి. ఈ ఉత్పత్తులలో ఆల్కహాల్ మరియు చికాకు కలిగించే రసాయనాలు లేకుండా ఉండాలి.
  • పాదాలను తేలికపాటి సబ్బుతో మాత్రమే కడగాలి, తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ వాడాలి.
  • నీరు పుష్కలంగా త్రాగటం వలన చర్మం యొక్క మాయిశ్చర్ లెవెల్స్ బాలన్స్ అవుతుంది మరియు పగుళ్లు ఏర్పడకుండా సున్నితంగా ఉంటుంది.

పాదాల పగుళ్లను తొలగించేందుకు హోం రెమెడీస్

  1. కూరగాయల నూనెలతో మసాజ్ : ఆలివ్ నూనె, సెసెమ్ ఆయిల్, ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె వంటి నూనెలను ఉపయోగించవచ్చు. ముందుగా వెచ్చని సబ్బు నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ప్యూమిస్ స్టోన్ తో బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక నూనెని అప్‌లై చేసి కొంత సేపు బాగా మసాజ్ చేయాలి. ఆ తరువాత సాక్స్ ని తొడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ రెగ్యులర్గా చేయటం వలన పగుళ్లు నయమవుతాయి.
  2. నిమ్మకాయఉప్పుగ్లిసరిన్రోజ్ వాటర్ ఫుట్ మాస్క్ : మొదటి దశలో ఉన్న పగుళ్లను క్యూర్ చేసేందుకు ఇది ఒక ఉత్తమ రెమెడీ. ముందుగా వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్ మరియు రోజ్ వాటర్ ని వేసి బాగా కలపాలి. పాదాలను ఈ వెచ్చని నీటిలో కొంత సేపు సోక్ చేయాలి. పాదాలను బాగా స్క్రబ్ చేసి డ్రై స్కిన్ ని తొలగించాలి. ఇప్పుడు థిక్ గ్లిసరిన్ మరియు నిమ్మరసం ని కలిపి పాదాలపై రాసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం చల్లని నీటితో పాదాలను కడగాలి.
  3. పండ్లతో మసాజ్ : బాగా మాగిన అరటి పండు లేదా బొప్పాయి పండును మాష్ చేసి పగిలిన పాదాలపై రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమంగా చేయటం వలన పాదాలకు కావలసిన తేమ పదార్థం అందుతుంది మరియు పగుళ్లు తగ్గుతాయి.
  4. బియ్యం పిండి : ఎక్స్‌ఫోలియేటింగ్‌ స్క్రబ్‌గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడిబారి, పగిలిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి క్రాక్స్ ని సరిచేస్తుంది. బియ్యం పిండికి కొన్ని చుక్కల తేనె, ఆపిల్ సీడర్ వినిగర్‌ ని చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. పాదాల మీద పగుళ్లు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చాలి. గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె రాసి సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
  5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ మరియు ఆవాల నూనె : పగుళ్లు పెద్దవై బాధపెడుతూ ఉంటే ప్యారాఫిన్‌ వ్యాక్స్‌తో తక్షణ ఉపశమనం లభిస్తుంది. పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేవరకు వేడి చేసి పూర్తిగా చల్లార్చాలి. రాత్రి పడుకునేముందు పాదాలను వెచ్చని నీటిలో కొంత సేపు నానపెట్టి ఆ తరువాత పగుళ్ల లోపలికి వెళ్లే విధంగా ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్‌లై చేసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా రెండు వారాలు చేయటం వలన పగుళ్ల నుండి ఉపశమనం పొందుతారు.
  6. వేపాకుతో : యాంటీ ఫంగల్‌ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది. గుప్పెడు వేపాకుకు ఒక స్పూన్ పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్‌లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దించాలి.
  7. గోరింటాకు : గోరింటాకును బాగా రుబ్బుకొని పగుళ్లు ఉన్న చోట రాసి ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.
  8. ఆలోవీరా జెల్ : పాదాల మడమ భాగంలోని పగుళ్లను తగించడంలో కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడుక్కొని ఆలోవీరా జెల్ ను పాదాలకు పట్టించడం ద్వార కాళ్ల పగుళ్లను తగ్గించడమే కాకుండా మృదువైన పాదాలను పొందవచ్చు.