13, డిసెంబర్ 2019, శుక్రవారం

కాలి నొప్పులు నివారణ కు

కాలి చీలమండ నొప్పి నివారణ కు  అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  జాగ్రత్తలు,Ankle pain and precautions



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కాలి చీలమండ నొప్పి జాగ్రత్తలు(Ankle pain and precautions)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పాదం, చీలమండ, కాలు చివరిభాగం వీటి ఎముకలను కలిపే లిగమెంట్లు అతిగా సాగినప్పుడు కాని, చిరిగినప్పుడు కాని, చీలమండ బెణికి నొప్పి మొదలవుతుంది. చీలమండ బెణికిన వారిలో 25 శాతం మందికి దీర్ఘకాలంపాటు జాయింట్లలో నొప్పి, కండరాలు బలహీనంగా మారటం ఉంటాయి. చీలమండ బెణకడం అనేది రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటివైపునకు తిరగడం వలన పాదం లోపలికి ఒరగటం మొదటి విధానం. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్‌ ఇంజ్యూరీ(inverson injury) అంటారు. చీలమండ బైట వైపున ఉండే లిగమెంట్లు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇక రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలివైపునకు తిరగడం వలన పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్‌ ఇంజ్యూరీ(everson injury) అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి.

చీలమండ ఏ స్థాయిలో దెబ్బ తిన్నదనేది నిర్ణయించడానికి, తీవ్రతను కొలవడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి. మొదటి శ్రేణిలో లిగమెంట్లు కొద్దిగా సాగటం కాని, లేదా చీరుకుపోవటం కాని జరుగవచ్చు. కొద్దిగా నొప్పి, వాపు, బిగుసుకుపోవటాలు ఉంటాయి. దీనిలో కొద్దిపాటి నొప్పితో నడవటం సాధ్యమవుతుంది. రెండవ శ్రేణిలో చీలమండ చీరుకుపోవడమనేది కాస్తంత ఎక్కువగా జరుగుతుంది. అయితే పూర్తిగా చిరిగిపోవటం ఉండదు. ఒక మోస్తరు నొప్పి, వాపు, ఎరుపుదనాలు ఉంటాయి. దెబ్బతిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తుంది. నడిచేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. మూడవ శ్రేణిలో చీలమండలోని లిగమెంట్లు పూర్తిగా చిరిగిపోతాయి. వాపు, ఎరుపుదనాలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. నొప్పి ఎక్కువగా ఉండటంతో నడవటం దుస్సాధ్యంగా మారుతుంది.

లక్షణాలు
బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది. అలాగే వాపు, ఎరుపుదనాలు కనిపిస్తాయి. దెబ్బ తిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పి వస్తుంది. ఒక మోస్తరు బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. కొంతమంది బెణికినప్పుడు చీరుకుపోయిన శబ్దాన్ని గాని, విరిగిన శబ్దాన్ని గాని వింటారు. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది.

ఉదాహరణకు లిగమెంట్లు పూర్తిగా చిరిగిపోయిన సందర్భాలలో నడవటం, పాదాల మీద బరువు వేయడం వంటివి కష్టతరంగా ఉంటాయి. చీలమండ అస్థిరంగా ఉన్నట్లుగా బెసికిపడిపోయేట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ బెణుకు సక్రమంగా మానకపోతే మరోమారు సమస్య తిరగబెట్టడానికి అవకాశమెక్కువ. మెట్లు దిగుతున్నప్పుడు కాని, ఎగుడుదిగుడు రోడ్డుమీద నడుస్తున్నప్పుడు కాని తిరిగి బెణకవచ్చు. కొంతమందిలో చీలమండ బెణికిన తరువాత దీర్ఘకాలంపాటు నొప్పి, వాపులు కొనసాగుతాయి.

-సూచనలు
దెబ్బ తగలగానే సరైన జాగ్రత్తలు పాటిస్తే చీలమండ నొప్పి త్వరగానే తగ్గిపోతుంది. ఒకవేళ అశ్రద్ధ చేసినా, ఆలస్యం చేసినా చీలమండలో శాశ్వతంగా అస్థిరత్వం, బలహీనతలు చోటు చేసుకుంటాయి.ఒకసారి దెబ్బ తగిలిన చోట మళ్లీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందున చీలమండకు రక్షణ ఉండేలా ఒత్తిడితో కూడిన పట్టీని అమర్చి 24 నుంచి 72 గంటలపాటు ఉంచాలి.దెబ్బ తిన్న భాగానికి విశ్రాంతిని ఇవ్వాలి. పాదంలో నొప్పి ఉన్నంత వరకూ చంక కర్ర లేదా క్రచ్‌లను వాడాలి.దెబ్బ తగిలిన మొదటి 24-72 గంటలలో వాపును తగ్గించడం కోసం ఐస్‌గడ్డలను బట్టలో చుట్టి (రెండు గంటలకు ఒకసారి చొప్పున ప్రతిసారి 10 నుంచి 20 నిముషాలు) ప్రయోగించాలి. 48 గంటలు గడిచిన తరువాత వేడినీళ్లను, చన్నీళ్లనూ మార్చి మార్చి ప్రయోగిస్తే ఉపయోగముంటుంది.

చన్నీళ్లలో పాదాలను 30 సెకండ్ల పాటు ఉంచి వెంటనే వేణ్ణీళ్లలోకి మార్చి 30 సెకండ్లు ఉంచండి. ఇలా అయిదు నిముషాల మార్చి మార్చి చేయండి. మొదటి సారి చన్నీళ్లతో ప్రారంభించి చివరిసారి చన్నీళ్లతో ముగించాలి. ఈ చికిత్సను రోజుకు మూడు సార్లు రిపీట్‌ చేయాలి. క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వైద్య సలహా మేరకు జాయింటులో నొప్పి, వాపు, ఎరుపుదనం, వేడి వంటి ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలను తగ్గించే మందులను వాడాలి.

మొదటి రెండు రోజులు వీటిని క్రమం తప్పకుండా, నిర్ణీతమైన మోతాదులో, నిర్ణీతమైన సమయాల్లో వాడటం ముఖ్యం. దెబ్బ తగిలిన మొదటి 24 -36 గంటలలో వాపు తయారవుతుంది కనుక దానిని నిరోధించడానికి ఒత్తిడితో కూడిన ఎలాస్టిక్‌ పట్టీలు ప్రయోగించాలి. ఈ పట్టీలు వాపును నిరోధిస్తాయి తప్పితే అదనపు రక్షణను కలిగించవు. రక్షణ కోసం ఎలాస్టిక్‌ పట్టి చుట్టబోయే ముందు గట్టిప్యాడ్‌ అమర్చుకోవాలి. కాలుమీద బరువుపడే సందర్భాలలో ఇది మరింత అవసరం.ఎలాస్టిక్‌ పట్టీని మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా ధరించకూడదు. ఒకవేళ ఎలాస్టిక్‌ పట్టీ మరీ బిగుతుగా ఉంటే తిమ్మిర్లు, మొద్దుబారటం, నొప్పి పెరగడం, చల్లదనం, పట్టీ అంచులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు పట్టీని వదులు చేయాలి.చీలమండను గుండెకంటే ఎక్కువ ఎత్తులో రోజుకు 2-3 గంటలపాటు ఉంచాలి. ఇలా చేయడం వలన వాపు, ఎరుపుదనాలు తగ్గుతాయి. దెబ్బ తగిలిన 72 గంటల తరువాత పాదాలను ఉపయోగించడం మొదలెడితే లిగమెంట్లు త్వరగా బలాన్ని పుంజుకుంటాయి.కాళ్లు,పాదాలను సాగదీయడం కోసం, కండరాల్లో శక్తిని పునరుద్ధరించడం కోసం వ్యాయామాలు చేయాలి.

వైద్యుణ్ణి ఎప్పుడు కలవాలి? బెణికినప్పుడు చీలమండ వద్ద ఏదో విరిగినట్లు శబ్దం రావడం. భరించలేనంత స్థాయిలో నొప్పి, వాపు, ఎరుపుదనాలు కనిపించడం లేదా రెండు వారాలకు మించి కొనసాగడం, పాదం మీద బరువు మోపలేకపోవడం, చీలమండ స్థిరత్వాన్ని కోల్పోవడం,దెబ్బ తగిలిన తరువాత తిమ్మిర్లు, మొద్దుబారటాలు ఉండటం తదితర సమయాల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
ముఖ్య గమనిక
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: