27, డిసెంబర్ 2019, శుక్రవారం

మానసిక సమస్య నుండి బయటకు రావాలి అంటే


మానసిక రోగాలకు చికిత్సఎలా ఉంటది అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ?

edti

 

ప్రజారోగ్యం గురించి మనం మాట్లాడుతుంటాం కాని దేశంలో మానసికారోగ్యం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక అంచనా ప్రకారం పదిహేను కోట్ల మంది భారతీయులు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక మానసిక రుగ్మతలకు గురై ఉన్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం భారతదేశంలో మానసికారోగ్యం పట్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరిని ఏదో ఒకవిధమైన మానసిక రుగ్మత పీడిస్తోంది. గమనించవలసిన మరో వాస్తవమేమంటే, అల్పాదాయానికి, మానసిక సమస్యలకు సంబంధం ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది.
గత సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ బెంగుళూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ 22వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. దేశంలో మానసికారోగ్యం గురించి మాట్లాడారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం మానసికారోగ్యానికి సంబంధించిన ఒక విపత్తును ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. మానసిక సమస్యలను నివారించడానికి 2022 వరకు మెంటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బాలీవుడ్ నాయిక దీపికా పదుకునె తాను ఎదుర్కొన్న డిప్రషన్ గురించి చెప్పడం ద్వారా ప్రజల్లో ఈ సమస్య గురించి చర్చ జరిగే వాతావరణం ఏర్పరిచారు. ఆమె తాను ఎదుర్కొన్న పరిస్థితిని, డిప్రషన్ నుంచి ఎలా బయటపడిందో ఆ వివరాలను, ఆమెకు సహాయపడిన మానసిక నిపుణులు, కుటుంబసభ్యులు, వైద్యచికిత్సల గురించి తెలియజేశారు. సమస్యేమిటంటే దీపికా పదుకునే వంటి వారు తమ సమస్యకు చికిత్స చేయగలిగిన వైద్యుడిని వెదికి చికిత్స పొందడం సులభం. చికిత్సకయ్యే ఖర్చును భరించడం కూడా వారికి కష్టం కాదు. కాని దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, అందులో చాలా మంది పేద, బలహీనవర్గాలైనప్పుడు సమస్య తీవ్రమవుతుంది. అందుకే దేశంలో ఈ విషయమై చర్చ జరగవలసి ఉంది. ముఖ్యంగా పేద బలహీనవర్గాలు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై మాట్లాడవలసిన అవసరం ఉంది.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీని 1982లో ప్రవేశపెట్టారు. దేశంలో మానసికారోగ్య కేంద్రాలు లేని సమస్యను నివారించడానికి ఈ విధానం తీసుకొచ్చారు. మానసిక అనారోగ్యానికి చికిత్స అందజేయడమే కాదు, దాంతో పాటు ప్రజల మానసికారోగ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ విధానం ఉద్దేశం. అయినా భారతదేశం ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఎందుకుందన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఈ పాలసీ అమలు విషయంలో సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలోని మానసికారోగ్య కేంద్రాలన్నీ మానసిక రుగ్మత వల్ల తలెత్తే బయాలజికల్ ప్రభావాలను నివారించడానికి ఉద్దేశించినవి మాత్రమే. సైకో సోషల్ , మనో సామాజిక కోణంలో సమస్య పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. తక్కువ స్థాయి విద్య జీవనప్రమాణాలు ఉన్న వారిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిమ్నస్థాయి సాంఘిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చినవారు అనేక మానసిక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశం 2020 నాటికి మానసిక రుగ్మతల విషయంలో ప్రపంచంలోనే అత్యధికమంది బాధితులు ఉన్న దేశంగా మారవచ్చు. డిప్రషన్ (మానసిక కుంగుబాటు), యాంగ్జయిటీ (ఆందోళన) వంటి రుగ్మతలు పెరిగిపోవచ్చు. వీరికి పునరావాస కల్పనలో శిక్షణ పొందిన మనీషా శాస్త్రి చెప్పిన మాటలివి.
దేశంలో మానసికారోగ్యానికి సంబంధించి చికిత్సా సదుపాయాలు చాలా తక్కువగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణమేమంటే, మానసిక రుగ్మతలను మనం పెద్దగా పట్టించుకోం. సమాజంలో ఈ విషయమై అవగాహన, చైతన్యం లేదు. అనేక మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఉన్నాయి. మానసిక సమస్య ఎందుకు తలెత్తిందో అర్ధం చేసుకునే వాతావరణం లేదు. అసలు మానసిక రుగ్మత ఎలాంటిదో అర్ధమయ్యే పరిస్థితి కూడా లేదని మనీషా శాస్త్రి అన్నారు.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే మానసికారోగ్య కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడడం. ముఖ్యంగా బలహీన, పేదవర్గాల ప్రజలకు, ఇల్లు వాకిలి లేనివారికి, మారుమూల ప్రాంతాల వారికి, సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా అణగారిన వారికి అందుబాటులోకి వచ్చేలా చేయడం.
దేశంలో మానసికారోగ్యానికి సంబంధించి, ముఖ్యంగా మానసిక సమస్యలు ఏవి ఎక్కువగా ఉన్నాయన్న వివరాలు లేవు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే విధానాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదని మానసికారోగ్యానికి సంబంధించి విధానాల రూపకల్పన, సలహాసూచనల కోసం పనిచేస్తున్న మనిషా శాస్త్రి అన్నారు. నిజానికి ఇదొక విషవలయం, సామాజిక భద్రత, విద్య,ఆరోగ్యం, నివాసగృహం వగైరా కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటివి ఎమోషనల్ సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాల వల్ల తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో చాలా పెద్ద జనాభా బతుకుతోంది. ఈ పరిస్థితులు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరికి జన్యుపరంగా కూడా మానసికాందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తులకు ఈ కారణాల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య తీవ్రం కావడం వల్ల వారి జీవన పరిస్థితి దిగజారుతుంది. దాంతో సమస్య మరింత జటిలమవుతుంది.
దేశంలో కొన్ని కేంద్రాలు మానసికారోగ్యం కోసం పనిచేస్తున్నాయి. ది లివ్ లాఫ్ ఫౌండేషన్ను దీపికా పదుకునే ప్రారంభించారు. కాని దేశంలో బలహీన పేదవర్గాల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అనేక కేంద్రాలు సంస్థల అవసరముంది. ఢిల్లీలో ఇలాంటి ఒక కేంద్రం పనిచేస్తున్నది. మనస్ ఫౌండేషన్ పేరుతో ఈ కేంద్రం పనిచేస్తోంది. కమ్యూనిటీ మెంటల్ హెల్త్ కేర్ రంగంలో సేవలందిస్తోంది. చికిత్సా పద్ధతులతోను, చైతన్యం పెంచడం ద్వారాను బలహీన, పేదవర్గాల ప్రజల్లో మానసిక ఆరోగ్యం కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. మానసికారోగ్యాన్ని మనోసామాజిక కోణంతో అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది. మానసిక రుగ్మతలను నివారించడం ఇతర ఆరోగ్య సమస్యల వంటిది కాదు. ఈ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తున్న కృతా రౌత్ ఈ విషయమై మాట్లాడుతూ, షుగరు వ్యాధి ఉన్నవారికి ఆ వ్యాధి నుంచి బయటపడమని చెప్పనవసరం లేదు. కాని మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తికి ఆ రుగ్మత నుంచి బయటపడమని చెప్పడం సాధ్యం కాదు. ఈ సమస్య పరిష్కారం చాలా సున్నితమైనది. పైగా మానసిక రుగ్మతలకు వైద్యం కూడా ఖరీదైనదిగా మారింది. అందువల్ల పేద, బలహీనవర్గాలు ఈ చికిత్స పొందడం సాధ్యపడడం లేదు.
ఆసుపత్రుల్లో వారికి సహాయం లభించదు. చికిత్సా ప్రక్రియ ఖరీదైనది కావడం వల్ల, చికిత్స పొందే వ్యక్తి సుదీర్ఘకాలం చికిత్స పొందవలసి ఉండడం వల్ల పేద బలహీనవర్గాలకు ఇది స్తోమతకు మించిన పనవుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రుగ్మతలకు చికిత్సా కేంద్రాలుండవు. నగరాలకు తరలి రావలసి ఉంటుంది. నగరాల్లో చికిత్సా కేంద్రాలు చాలా తక్కువ. కాబట్టి, చికిత్స అందుబాటులో లేకపోవడం, ఖరీదైనది కావడం వల్ల పేద బలహీనవర్గాలే కాదు మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వారికైనా ఇది తలకు మించిన భారమైపోతోంది. దేశంలో ప్రతి మూడులక్షల మంది మానసిక రోగులకు ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 

ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


కామెంట్‌లు లేవు: