17, మార్చి 2020, మంగళవారం

థైరాయిడ్ సమస్య పరిష్కారం మార్గం


థైరాయిడ్‌ సమస్య పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



వచ్చీ.. రాని.. థైరాయిడ్‌!

డోలాయమానం! సమస్య ఉన్నట్టే ఉంటుంది. కానీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం ఉందా? లేదా? అర్థం కాదు. నిజంగా సమస్య ఉందా? లేక అది సహజంగా తలెత్తిన శారీరక పరిణామమేనా? అనుమానం పీడిస్తుంటుంది.

శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలకమైన ‘థైరాయిడ్‌’ హార్మోన్ల విషయంలో తరచూ ఎదురయ్యే సంశయమే ఇది. పరీక్ష చేసి చూస్తే విలువల్లో ‘కొద్దిగా’ తేడా కనబడుతుంది. మరీ ఎక్కువుంటే చికిత్స ఎలాగూ తప్పదు. కానీ కొద్దిగా పెరిగినప్పుడు చికిత్స ఆరంభించాలా? అక్కర్లేదా?

స్థాయులు పెరిగి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరంలేదు. వ్యక్తిని బట్టి, బరువును బట్టి, వయసును బట్టి, పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అవసరమైతే మరికొన్ని పరీక్షలు చేసి అయినా.. ఏం చెయ్యాలన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సులభంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలక హార్మోన్లు... థైరాయిడ్‌ హార్మోన్లు! మన శరీర అవసరాలకు తగినట్లుగా థైరాయిడ్‌ గ్రంథి స్రవించే ఈ హార్మోన్లు రెండు. T3, T4.

అయితే శరీరంలో వీటి మోతాదులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇవి సరిపోతున్నాయా? లేక వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా? వీటిని ఇంకా స్రవించాలా? లేక తగ్గించాలా? అన్నది గమనిస్తూ... అందుకు తగ్గట్టుగా థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మరోటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంటుంది. దీన్నే ‘థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ ’ (టీఎస్‌హెచ్‌) ‘Thyroid Stimulating Hormone‌’ (TSH‌) అంటారు. థైరాయిడ్‌ సమస్యలను నిర్ధారించేందుకు ఈ ‘టీఎస్‌హెచ్‌’ అత్యంత కీలకం.

TSH.. ఎందుకు కీలకం?
థైరాయిడ్‌ గ్రంథి నేరుగా స్రవించే T3, T4 కంటే కూడా పిట్యూటరీ గ్రంథి స్రవించే టీఎస్‌హెచ్‌ మరింత కీలకమైనది. ఇది థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి- T3, T4 హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. T3, T4 హార్మోన్లు తక్కువగా ఉంటే ఈ TSH మరికాస్త ఎక్కువగా విడుదలై.. థైరాయిడ్‌ గ్రంథిని మరింతగా ప్రేరేపిస్తుంటుంది. మరోవైపు రక్తంలో T3, టి4లు ఎక్కువైతే- అవి TSH విడుదలను నిరోధిస్తుంటాయి. ఇలా ఒకవైపు T3, T4; మరోవైపు టీఎస్‌హెచ్‌.. ఇవో చక్రంలా పని చేస్తుంటాయి.

* థైరాయిడ్‌ గ్రంథి సరిగా పని చేయకపోతే.. అంటే T3, T4 అవసరమైనంత లేకపోతే.. TSH ఉత్పత్తి పెరిగి, థైరాయిడ్‌ గ్రంథిని ఎక్కువగా ప్రేరేపిస్తుంటుంది. అంత మాత్రాన T3, T4 నార్మల్‌ కన్నా తక్కువగా ఉండాల్సిన పని లేదు. ఇవి నార్మల్‌ స్థాయుల్లో ఉండేలా చూసేందుకు కూడా TSH ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుండొచ్చు. అంటే T3, T4 స్థాయులు పడిపోవటాని కన్నా ముందుగానే TSH స్థాయులు పెరుగుతాయన్న మాట. కాబట్టి T3, T4 స్థాయుల కంటే కూడా TSH పెరగటమన్నదే మనకు సమస్యను పట్టిచూపే అత్యంత కీలకమైన అంశం అవుతుంది.

చికిత్సా సమయంలోనూ TSH పరీక్షే కీలకం!
థైరాయిడ్‌ సమస్యను అర్థం చేసుకునేందుకు సాధారణంగా T3, T4, టీఎస్‌హెచ్‌.. మూడు పరీక్షలూ చేయిస్తుంటారు. అయితే చాలామందికి TSH ఒక్కటే సరిపోతుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు ఒక్క దీంతోనే తెలిసిపోతుంది. హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌థైరాయిడిజమ్‌ రెండింటినీ దీని ద్వారానే నిర్ధరించొచ్చు. చికిత్స సమర్థంగా జరుగుతోందా? లేదా? అన్నది కూడా TSH ద్వారానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హైపోథైరాయిడ్‌ సమస్యకు చికిత్స తీసుకుంటున్న వారికి బయటి నుంచి థైరాయిక్సిన్‌ (T4) హార్మోన్‌నే ఇస్తారు. కాబట్టి వీరిలో పరీక్ష చేసినప్పుడు రక్తంలో T3, T4 హార్మోన్‌ స్థాయులు ఎక్కువగానే ఉంటాయి. ఇది చూసి చాలామంది ఆందోళన చెందుతుంటారు. అందువల్ల T3, T4 పరీక్షలతో ప్రయోజనం ఉండదు. TSH ఒక్కటే సరిపోతుంది.

చికిత్స తీసుకుంటున్నప్పుడు ఈ TSH పరీక్ష కూడా నార్మల్‌కు వచ్చేస్తే ఆర్నెల్లకోసారి, తేడాలుంటే 3 నెలలకోసారి చేయించుకోవటం అవసరం. గర్భిణులు మాత్రం 2 నెలలకోసారి చేయించుకోవాలి.

అయితే- ఎదుగుదల సరిగా లేని పిల్లల్లో మాత్రం పిట్యుటరీ గ్రంథి సరిగా పని చేయకపోవచ్చు. వీరిలో T3, T4 తక్కువగానూ.. TSH కూడా తక్కువగానూ లేదా నార్మల్‌గానూ ఉండొచ్చు. ఇలాంటి పిల్లలకు మాత్రం మూడు పరీక్షలూ, వీటితో పాటు మరికొన్ని పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.





యాంటీబోడీ పరీక్ష: ఒక్కసారే
థైరాయిడ్‌ సమస్య కచ్చితంగా నిర్ధారణ కానప్పుడు.. TSH బోర్డర్‌ లైన్లో ఉన్న వారికి కచ్చితమైన నిర్ధారణకు థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఉపయోపడుతుంది. చాలాసార్లు కొన్ని తెలియని కారణాలు, పర్యావరణ అంశాల మూలంగా థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తూ పోతుంటుంది (ట్రాన్సియెంట్‌ థైరాయిడైటిస్‌). వాపు ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గిపోతాయి. వాపు తగ్గినపుడు తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో వాపు అలాగే ఉండిపోవచ్చు కూడా. ఇలాంటి వారిలో శాశ్వతంగా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతుంది. శాశ్వతంగా ఉండిపోయే థైరాయిడైటిస్‌ సమస్యకు- మనలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున మన థైరాయిడ్‌ గ్రంథి మీదే దాడి చేసి, దాన్ని దెబ్బతీయటమే (ఆటో ఇమ్యూన్‌) ప్రధాన కారణం. ప్రస్తుతం చాలామందిలో కనబడుతున్న హైపోథైరాయిడిజం సమస్యలకు మూలం ఇదే. వీరికి పరీక్ష చేస్తే థైరాయిడ్‌ యాంటీబోడీలు కనబడతాయి. కాబట్టి TSH మోతాదులు అటూఇటూ కాకుండా మధ్యస్థంగా ఉన్నవారికి థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష చేస్తే సమస్య కచ్చితంగా నిర్ధరణ అవుతుంది. ఈ యాంటీబోడీలు ఉండి, TSH ఎక్కువగా ఉన్నవారికి జీవితాంతం చికిత్స చేయాల్సి ఉంటుంది.

* అయితే యాంటీబోడీలు ఉన్నా కూడా - TSH స్థాయులు పూర్తి నార్మల్‌గా ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతుల్లో కూడా 10% మందిలో థైరాయిడ్‌ యాంటీబోడీలు ఉండే అవకాశముంది.

* థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఎవరికైనా జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. తరచుగా చేయాల్సిన పనిలేదు.




TSH ఎంత నార్మల్‌?

0.5 - 5.5 మధ్య ఉంటే: నార్మల్‌
5.5 -10 మధ్య ఉంటే: బోర్డర్‌ లైన్‌ (దీన్నే ‘సబ్‌క్లినికల్‌ హైపోథైరాయిడిజమ్‌’ అంటారు.)
10 కంటే ఎక్కువ: హైపోథైరాయిడిజం సుస్పష్టం!

ఇక్కడ TSH 5.5 నుంచి 10 మధ్య.. అంటే బోర్డర్‌ లైన్‌లో ఉన్న వారికి ఏం చెయ్యాలన్నది కీలకం. దీన్నే ‘Subclinical Hyperthyroidism’ అంటారు. వీరిలో T3, T4 నార్మల్‌గానే ఉంటాయి. TSH మాత్రం ఇలా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరమేం లేదు. వ్యక్తులను బట్టి, వారి వయసు, పరిస్థితులను బట్టి చికిత్స చెయ్యాలా? వద్దా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ వయసులో ఉన్న యువతులకు, గర్భిణులకు, వృద్ధులకు, ఎదుగుదల మందగించిన పిల్లల విషయంలో చికిత్స అవసరమా? కాదా? అన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.






చికిత్స ఎవరికి?
సుమారు 2-3 శాతం మంది స్పష్టంగా ‘హైపో థైరాయిడిజమ్‌’తో బాధపడుతున్నట్టు అంచనా. కానీ 6-7 శాతం మందిలో TSH స్థాయులు ఇంత స్పష్టంగా పెరిగి ఉండవు. ఓ మోస్తరుగానే (సబ్‌ క్లినికల్‌) పెరిగి ఉంటాయి. అందుకే వీరి విషయంలో ఏం చెయ్యాలన్నది కీలకంగా మారుతోంది. ఆయా వ్యక్తులను, లక్షణాలను బట్టి చికిత్స అవసరమా? లేదా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.

వృద్ధులు
సాధారణంగా TSH 0.5-5.5 ఉండటం నార్మల్‌. అయితే 65 ఏళ్లు పైబడిన చాలా మంది వృద్ధుల్లో ఇది 7 నుంచి 10 వరకూ కూడా ఉంటుండొచ్చు. అయినా వీరికి చికిత్స అవసరం ఉండదు. దీని గురించి ఇంకా లోతుగా పరీక్షలు చెయ్యాల్సిన అవసరమూ ఉండదు.

యువతులు
నెలసరి సరిగా రాకపోతుండటం, గర్భధారణకు ప్రయత్నిస్తుండటం వంటి సందర్భాల్లో వీరు TSH స్థాయులు బోర్డర్‌ లైన్లోనే (5.5-10 మధ్య) ఉన్నా కూడా విధిగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

గర్భిణులు
గర్భిణుల్లో TSH 3 లోపే ఉండాలి. అంతకు మించి ఉంటే దానికి చికిత్స అవసరం. వాస్తవానికి గర్భధారణ తర్వాత తొలి మూడు నెలల్లో TSH స్థాయులు పడిపోతాయి. కొందరిలో 0.1-0.2 వరకూ కూడా తగ్గొచ్చు. దీనికి గర్భధారణ సమయంలో తలెత్తే శారీరక మార్పులే కారణం. రెండో త్రైమాసికంలో తిరిగి TSH పెరుగుతాయి. అయితే ఇది 3 కంటే ఎక్కువకు పెరిగితే మాత్రం కాన్పు అయ్యేంత వరకూ కూడా చికిత్స తీసుకోవాలి. దీన్ని ‘జెస్టేషనల్‌ థైరోటాక్సికోసిస్‌’ అంటారు. వీరికి చికిత్స చేయటం ద్వారా పుట్టబోయే బిడ్డల్లో విషయగ్రహణ, తెలివితేటలు, చురుకుదనం, మానసిక స్థితి ప్రభావితం కాకుండా చూసుకోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* ఒకవేళ గర్భిణులకు పరీక్షల్లో T3, T4 ఎక్కువగా ఉన్నా గాబరా పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ హార్మోన్లు రెండూ థైరాయిడ్‌ బైండింగ్‌ గ్లోబులిన్‌ (టీబీజీ)  (Thyroxine Binding Globulin - TBG) అనే ప్రోటీన్‌కు అంటుకొని ఉంటాయి. గర్భధారణ సమయంలో ఈ TBG మోతాదులు సహజంగానే పెరుగుతాయి. అందువల్ల గర్భిణులందరిలోనూ T3, T4 స్థాయులూ ఎక్కువగానే ఉంటాయి. దీనికి గాబరా పడాల్సిన పనిలేదు. T3, T4 ఎక్కువగా ఉండి, TSH నార్మల్‌గానే అంటే.. 0.5-3 మధ్యలో ఉంటే దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు.

* మరీ అనుమానంగా ఉంటే గర్భిణుల్లో- సమస్య నిర్ధారణకు ఫ్రీ T3, T4 అనే పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది.

* ఇక కాన్పు తర్వాత.. గర్భధారణ సమయంలో ఓ మోస్తరుగా పెరిగిన TSH స్థాయులు.. కాన్పు తర్వాత అలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల వీరికి కాన్పు తర్వాత చికిత్స కొనసాగించాలా? అవసరం లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఉపయోగపడుతుంది. యాంటీబోడీ పాజిటివ్‌గా ఉంటే చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా TSH మధ్యస్థంగా ఎక్కువగా ఉన్నప్పుడు చెయ్యాల్సింది. ఒకవేళ గర్భధారణ మొదట్లోనే TSH 10 కన్నా ఎక్కువున్నట్టు గుర్తిస్తే అసలీ యాంటీబోడీ పరీక్ష అవసరమేమీ ఉండదు. అది హైపోథైరాయిడిజమ్‌కు స్పష్టమైన సూచిక. కాబట్టి వీరికి కాన్పు తర్వాత కూడా చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది.

అల్ట్రాసౌండ్‌-డాప్లర్‌ పరీక్ష:
గర్భిణుల్లో కొందరికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గర్భధారణ మూలంగా కూడా కొందరిలో గుండె వేగం పెరగుతుంటుంది. అలాగే గర్భం ధరించినపుడు థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం కూడా పెరుగుతుంది. దీంతో హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి, జీవక్రియలూ వేగవంతమవుతాయి. దీనివల్ల గొంతు దగ్గర ఉబ్బు (గాయిటర్‌) కూడా రావచ్చు. ఇలాంటి వారిలో T3, T4 అధికంగానూ, TSH మాత్రం తక్కువగా ఉంటాయి. ఇది సరిగ్గా హైపర్‌ థైరాయిడిజమ్‌ మాదిరిగానే కనబడుతుంది. దీనికి శారీరక మార్పులే కారణమని తెలుసుకోవటానికి ఈ డాప్లర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది.

థైరాయిడ్‌ సమస్యను అర్థం చేసుకునేందుకు సాధారణంగా T3, T4, టీఎస్‌హెచ్‌.. మూడు పరీక్షలూ చేయిస్తుంటారు. అయితే మూడూ తప్పనిసరేమీ కాదు. చాలామందికి TSH ఒక్కటే సరిపోతుంది.



థైరాయిడ్‌ గ్రంథి
గొంతు దగ్గర.. ముందు వైపు.. మన గాలి గొట్టానికి చిన్న సీతాకోక చిలుకలా కరుచుకుని ఉంటుంది థైరాయిడ్‌ గ్రంథి. చూడటానికి ఇది చిన్నదేగానీ పనిలో మాత్రం చాలా పెద్దది. మన శరీరం మొత్తాన్ని.. ఒంట్లోని ప్రతి కణాన్నీ, ప్రతి అవయవాన్నీ చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత నిర్వర్తిస్తుంటుందీ గ్రంథి! ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే దేహానికి చురుకుదనాన్ని ఇస్తుంటాయి.




స్థూలంగా థైరాయిడ్‌ గ్రంథి వల్ల తలెత్తే సమస్యలు ఈ రెండే. వీటికి చికిత్స కూడా సులభమే. కాకపోతే ఎవరికి చికిత్స అవసరమన్నది నిర్ధరించటం కీలకం. ముఖ్యంగా పరీక్షల రిపోర్టుల్లో విలువలు - అటూ ఇటూ కాకుండా- మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలన్నది తెలుసుకోవటం మరీ కీలకం.




ఊబకాయులు
ఊబకాయం మూలంగా TSH కాస్త పెరుగుతుంది. చాలామంది ఊబకాయులు TSH 6.5-7 ఉంటే.. తమకు థైరాయిడ్‌ సమస్య వచ్చిందనీ, దాని మూలంగానే బరువు పెరిగామనీ భావిస్తుంటారు. ఇది నిజం కాదు. సాధారణంగా వీరికి థైరాయిడ్‌ చికిత్స అవసరముండదు. కానీ బరువు తగ్గుతామని భావిస్తూ చాలామంది థైరాయిడ్‌ చికిత్స తీసుకుంటుంటారు. వీరు మందులు వేసుకుంటే TSH కొంత తగ్గొచ్చు, అయినా దాంతో ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. అయితే యాంటీబోడీ పాజిటివ్‌గా ఉంటే మాత్రం చికిత్స తీసుకోవాలి. యాంటీబోడీలు లేకపోతే- తమకు వచ్చిన బార్డర్‌ లైన్‌ హైపో థైరాయిడిజమ్‌కు ఊబకాయమే కారణమనీ, బరువు తగ్గితే ఆ పెరిగిన TSH స్థాయి కూడా తగ్గుతుందనీ గుర్తించటం అవసరం!

కామెంట్‌లు లేవు: