బరువు తగ్గాలి అంటే కీటో డైట్
ఆసక్తి సరే.. అతి విశ్వాసం వద్దు!
ఊబకాయం..
ప్రపంచానికే పెద్ద గుదిబండ! అందుకే ఒంటి బరువు వదిలించుకునేందుకు నోరు కట్టుకోవటం, ఒళ్లు వంచటం నుంచి పొట్ట కుట్టేయటం వరకూ.. రకరకాల విధానాలపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకీ వచ్చాయి. అయితే వీటిలో ఏది సమర్థమైనదన్న దానిపై చర్చ నడుస్తూనే ఉంది.
మధుమేహం..
నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఆధునిక ఉపద్రవం. విస్మరిస్తే ఒళ్లంతా కబళించివేసే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు మందులున్నాయి. వీటిని జీవితాంతం తీసుకోవటం తప్పించి మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే చికిత్సలు మాత్రం ఇప్పటి వరకూ లేవు.
తాజాగా...
ఒక్క బాణంతో ఈ రెండు ఉపద్రవాలనూ ఖాయంగా జయించొచ్చన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కేవలం ఆహార విధానం మార్చుకుని, అంతా కేవలం ‘కొవ్వు ఎక్కువగా తినటం’ ద్వారానే అటు ఊబకాయాన్నీ, ఇటు మధుమేహాన్ని కూడా జయించి తీరతారన్న వాదన బలంగా వినపడుతుండటంతో.. సహజంగానే ప్రజల్లోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది.
అయితే ఈ తరహా ఆహార నియంత్రణ సరైనదేనా? దీంతో బరువు తగ్గే మాట నిజమే కావొచ్చుగానీ.. ఇతరత్రా ఎలాంటి సమస్యలూ తలెత్తవా? అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న!
ఈ తరహా డైట్‌తో కొంత ప్రయోజనాలు కనిపించొచ్చు.. కానీ దీంతో సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదని హెచ్చరిస్తున్నారు వైద్య ప్రముఖులు.
నిజానికి ఈ తరహా ఆహార విధానం కొత్తదేం కాదు గానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవం. అందుకే విఖ్యాత వైద్య పత్రిక ‘జామా’ కూడా దీనిపై తాజా సంచికలో సమగ్రమైన సమీక్షా వ్యాసాన్ని ప్రచురిస్తూ.. ఈ తరహా డైట్ తీసుకోవాలనుకుంటున్న వారికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. అందుకే దీనికి సంబంధించిన వివరాలన్నీ సాధ్యమైనంత సమగ్రంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
బరువు తగ్గిపోయేందుకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆహార నియంత్రణ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయిగానీ.. కొవ్వు పదార్ధాలు అధికంగా, పిండిపదార్ధాలు చాలా తక్కువగా ఉండే ఆహారం (లో కార్బ్, హై ఫ్యాట్ ఆహారం- ఇదే కీటోజెనిక్ డైట్) తీసుకుంటున్న వారిపై విస్తృతస్థాయిలో జరిగిన 13 అధ్యయన ఫలితాలు, వాటి విశ్లేషణలను పరిశీలిస్తే... ఈ ‘కీటో డైట్’ మీద ఉన్న వాళ్లు బరువు ఎక్కువగా తగ్గుతున్నారని వెల్లడవుతోంది. దీంతో ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు చాలామంది పరిశోధకులు పిండిపదార్ధాలు బాగా తగ్గించేసే ‘కీటోజెనిక్’ ఆహార విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది న్యూట్రిషనల్ కీటోసిస్
కీటోజెనిక్ ఆహారంలో పిండిపదార్ధాలను బాగా తగ్గించేయటంతో- శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ప్రధానంగా ఒంట్లోని కొవ్వును కరిగించుకుని, వారంలోపే దాన్నే శక్తిగా వినియోగించుకోవటానికి అలవాటుపడిపోతుంది. ఈ దశనే వైద్యపరంగా ‘న్యూట్రిషనల్ కీటోసిస్’ అంటారు. ఈ స్థితిలో మన కాలేయం ఒంట్లోని కొవ్వును, కొవ్వు ఆమ్లాలను ‘కీటోన్ బోడీస్’ అనే రకం రసాయనాలుగా మార్చటం మొదలుపెడుతుంది. అనివార్యపరిస్థితుల్లో ఈ కీటోన్ బోడీలే మన శరీరానికీ, మెదడుకు అవసరమైన శక్తిని అందించటం మొదలుపెడతాయి. ఇదీ ఈ రకం డైట్ ప్రత్యేకత.
కొవ్వు తిన్నా బరువు తగ్గుతున్నారు!
కొవ్వు ఎక్కువగా తినమని చెప్పినా కూడా ‘కీటో డైట్’ మీద ఉండేవాళ్లు బాగా, వేగంగా బరువు తగ్గిపోతున్నారు. రెండు వారాల్లోనే దాదాపు 10 పౌండ్లు (4.5 కేజీలు) తగ్గిపోతున్న వాళ్లూ ఉంటున్నారని బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ అమీ గాస్ తదితరులు గుర్తించారు. కీటోడైట్ వల్ల ఒంట్లో నీరు బాగా బయటకుపోతుంది, కాబట్టి మొదట్లో వేగంగా తగ్గిన బరువులో నీటిదే అధిక భాగం కావొచ్చు. క్రమేపీ ఇన్సులిన్ స్థాయులు తగ్గిపోతూ, మన శరీరం కొవ్వును కరిగించుకునే దశలోకి వెళుతున్న కొద్దీ.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటం ఆరంభిస్తుంది, దానివల్ల బరువు బాగా తగ్గుతున్నారని గాస్ అంటున్నారు.
ఆకలి ఉండటం లేదు
కారణం స్పష్టంగా తెలియకపోయినా కీటోడైట్ మీద ఉన్నవాళ్లకు పెద్దగా ఆకలిగా అనిపించటం లేదు. కాబట్టి సహజంగానే వాళ్లు తీసుకునే మొత్తం క్యాలరీలు తగ్గిపోతున్నాయి, బరువు తగ్గటానికి ఇది కూడా దోహదం చేస్తుండొచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ బ్రూస్ బిస్ట్రియన్ అభిప్రాయపడుతున్నారు. వీరి అధ్యయనంలో- పూర్తి కీటో డైట్ మీద ఉన్న వారికి శరీరంలో 9.7% కొవ్వు తగ్గిపోగా కేవలం కొద్దిగా కొవ్వు తగ్గించినవారిలో 2.1% మాత్రమే తగ్గింది. అలాగే కీటో డైట్ మీద ఉన్న వారిలో పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా 3 రెట్లు ఎక్కువగా తగ్గిపోయినట్లు గుర్తించారు.
బరువు ఒక్కటే కాదు..
‘‘కీటో డైట్ బరువు తగ్గేందుకే కాదు, మధుమేహుల్లో మందుల అవసరాన్ని తగ్గించేందుకు కూడా దోహదం చేస్తోంది. అలాగే రక్తంలో గ్లూకోజు స్థాయుల మూడు నెలల సగటును చెప్పే హెచ్‌బీఏ1సీ కూడా బాగా మెరుగవుతోంది’’ అంటున్నారు లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన మెటబాలిజం విభాగం ప్రొఫెసర్ స్టీవెన్ హెమ్స్‌ఫీల్డ్. ‘‘కానీ ఇక్కడ సమస్యల్లా ఒక్కటే.. ఈ ఆహారాన్ని దీర్ఘకాలం తిని తట్టుకోగలరా? అన్నదే’’ అంటారాయన. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ స్టీఫెన్ ఫినే 2015 నుంచి కొంతమంది మధుమేహ రోగులకు కీటోడైట్ ఇచ్చి ఫలితాలను అధ్యయనం చేస్తున్నారు. 10 వారాల తర్వాత 56.1% మందిలో హెచ్‌బీఏ1సీ అదుపులో ఉన్నట్టు తేలింది. 56.8% మందిలో మధుమేహం మందుల అవసరం తగ్గిపోయింది. త్వరలో ఏడాది ఫలితాలు రాబోతున్నాయి.
ఏ కొవ్వు మంచిదో ఇంకా తేలలేదు!
కీటో డైట్‌తో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, పొట్టచుట్టుకొలత తగ్గుతున్నాయి, బీపీ కూడా మెరుగవుతోంది. అయితే కొందరిలో చెడ్డ (LDL) కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు గుర్తించారు. కాబట్టి ఏ రకం కొవ్వులు మంచివో నిపుణుల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. దీనిపై దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉన్నాయన్నది కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యవిభాగం ప్రొఫెసర్ రిక్ హెట్. ఆహారపరంగా తేలికగా పాటించటానికి వీలైన ఈ కీటో డైట్ అనేది బేరియాట్రిక్ సర్జరీలకు, బరువు తగ్గించే మందులకు మంచి ప్రత్యామ్నాయం కావొచ్చనీ అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలు పాటిస్తేనే సురక్షితం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటి నుంచో అనివార్యంగా ఈ తరహా ఆహారం తింటూనే ఉన్నారు. ఇదేకాదు, మూర్ఛలు అస్సలు అదుపులోకి రాని చిన్నపిల్లలకు చికిత్సలో భాగంగా ఈ కీటో డైట్‌ను దాదాపు శతాబ్ద కాలంగా సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి ‘‘సాధారణంగా చూసుకుంటే ఈ డైట్ సురక్షితమైనదనే చెప్పుకోవచ్చు’’ అన్నది హెమ్స్‌ఫీల్డ్ భావన. కీటోడైట్‌తో ఎక్కువమందిలో తలెత్తుతున్న సర్వసాధారణ దుష్ప్రభావం- ఆరంభించిన కొత్తలో తల తేలిపోతున్నట్టు, కళ్లు తిరిగినట్లు ఉండటం, బాగా అలసట, శారీరక శ్రమ కష్టంగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, ముఖ్యంగా మలబద్ధకం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటన్నింటినీ కలిపి వైద్యులు ‘కీటో ఫ్లూ’ అంటున్నారు. అయితే ఈ లక్షణాలన్నీ కొద్ది రోజుల్లోనో, వారాల్లోనే సర్దుకుంటున్నాయి. ఇక ఈ డైట్‌లో భాగంగా తీసుకునే కొద్దిపాటి మాంసకృత్తులను కూడా- బాగా శుద్ధి చేసిన వాటి నుంచి కాకుండా.. ముడి పదార్ధాల నుంచి వచ్చేలా చూసుకోవటం వల్ల సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి, దాంతో ఈ రకం దుష్ప్రభావాలు బాగా తగ్గిపోవచ్చు.
ఇది సొంత వైద్యం కాదు!
కొన్ని సుగుణాలున్నట్టు చెప్పుకున్నా కూడా... ఈ డైట్ అందరికీ సమర్థంగా, సురక్షితంగా ఉండాలంటే దీన్ని ‘ఎవరికి వాళ్లు చేసేసుకునే సొంత వైద్యంలా’ భావించకూడదన్నది ఈ వైద్యులందరూ ముక్తకంఠంతో చేస్తున్న హెచ్చరిక. ముఖ్యంగా మధుమేహానికి మందులు, ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్లు ఈ కీటోడైట్ మొదలుపెడితే వాళ్లు గ్లూకోజు స్థాయులు బాగా పడిపోయి తీవ్రమైన ‘హైపోగ్లైసీమియా’లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని బిస్ట్రియన్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందే కచ్చితంగా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి మందుల మోతాదులను సరిచేయించుకుని, వాళ్ల పర్యవేక్షణలో వాడుకోవటం అవసరం.
మధుమేహులు బరువు తగ్గితే మంచిదే! తాజా అధ్యయనాన్ని ప్రచురించిన లాన్సెట్ బరువు తగ్గితే టైప్-2 మధుమేహం కూడా అదుపులోకి వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం స్కాట్లండ్, ఇంగ్లండ్‌లలో తాజాగా ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2014-2017 మధ్య చాలామంది ఊబకాయ మధుమేహులపై జరిగిన ఈ అధ్యయన విశేషాలను విఖ్యాత బ్రిటన్ వైద్య పత్రిక లాన్సెట్ తాజా సంచికలో ప్రచురించింది. బీఎంఐ 27-45 మధ్య ఉన్నవారికి కొన్ని నెలల పాటు ఆహారం చాలా పరిమితంగా (రోజుకు 800 క్యాలరీలు మించకుండా) ఇచ్చి పరిశీలించారు. ఫలితంగా వీళ్లంతా ఏడాదిలో 15 కేజీలకు పైగా బరువు తగ్గిపోయారు. విశేషమేమంటే 46% మందిలో మధుమేహం మందుల అవసరం పూర్తిగా తగ్గిపోయింది కూడా. మొత్తమ్మీద దాదాపు సగం మంది కేవలం బరువు తగ్గిన కారణంగానే మధుమేహం నుంచి పూర్తిగా బయటపడ్డారు. వీరికి మధుమేహం మందుల అవసరం కూడా ఉండటం లేదు. కాబట్టి బరువు తగ్గటం వల్ల మధుమేహం విషయంలో మంచి ప్రయోజనం ఉంటుందన్నది స్పష్టం. అయితే ఈ అధ్యయనాన్ని ఊబకాయుల మీదే చేశారు, రెండోది- బరువు తగ్గేందుకు మొత్తం ఆహార పరిమాణాన్ని తగ్గించారేగానీ కేవలం కొవ్వు పదార్థాల వంటివి ఇచ్చే ప్రయోగాలు మాత్రం చెయ్యలేదు! |
ఆసక్తి ప్రపంచవ్యాప్తం అమెరికా వైద్యుల సంఘానికి చెందిన ప్రముఖ వైద్య పత్రిక ‘జామా’ తాజాగా (జనవరి 16, 2018) ఊబకాయంపై ఒక ప్రత్యేక సంచిక తీసుకువచ్చింది. దీనిలో ఇటీవలి కాలంలో బరువు తగ్గటానికీ, టైప్-2 మధుమేహానికీ ప్రపంచవ్యాప్తంగా ‘కీటోజెనిక్ డైట్’ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతోందంటూ ప్రత్యేక సమీక్షా వ్యాసం ప్రచురించింది. ఈ తరహా డైట్ మీద ప్రముఖ వైద్య పరిశోధన, అధ్యయన కేంద్రాల్లో జరిగిన, జరుగుతున్న అధ్యయనాలను పరిశీలించి.. వాటి ఫలితాలతో పాటు దీంతో ఎదురవుతున్న సమస్యలేమిటి? దీన్ని అనుసరించే వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కూడా కొన్ని హెచ్చరికలు చేసింది. ఆ వివరాలు క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాం. |
అంతా పాటించే డైట్ కాదు! మనదేశంలో చాలామందికి తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే తెలియదు. తరచూ పరీక్షలు చేయించుకునే అలవాటు లేకపోవటం మూలంగా చాలామందికి గుండె జబ్బులకు సంబంధించిన ముప్పులు, కిడ్నీ- లివర్ వంటి సమస్యలున్నా కూడా ఆ విషయమే తెలియటం లేదు. ఇలాంటి వాళ్లు వేగంగా బరువు తగ్గాలనో, మధుమేహాన్ని వదిలించుకోవాలనో తాపత్రపయడుతూ ‘కీటో డైట్’ వంటివి ఆరంభిస్తే తీవ్ర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆహారం మొదలుపెట్టిన తర్వాత- ఒంట్లోని కొవ్వు ఎక్కువగా కరిగిపోతుంటే కీటోన్ బోడీస్ తయారై, వాటి స్థాయులు పెరిగి స్పృహ తప్పటం వంటి ‘కీటోసిస్’ సమస్యలు తలెత్తే ముప్పు ఒకటి. అదొక్కటే కాదు, మరో ముఖ్య విషయం ఏమంటే- ఎవరైనా కొవ్వు చాలా ఎక్కువగా (లేదా కొవ్వు మాత్రమే) తింటుంటే వాళ్ల శరీరం- ఒంట్లో నిల్వ ఉన్న కొవ్వులు, ప్రోటీన్ల నుంచి గ్లూకోజును తయారు చేసుకోవటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో 1. యూరియా 2. క్రియాటినైన్ 3. యూరిక్ యాసిడ్ 4. పొటాషియం వంటివన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఒక మోస్తరు వరకూ మూత్రంలో వెళ్లిపోతుంటాయిగానీ.. ఒకస్థాయి దాటితే వీటితో తీవ్ర దుష్ప్రభావాలు మొదలవుతాయి. ప్రాణహాని కూడా జరగొచ్చు. ముఖ్యంగా గుండె, లివర్, కిడ్నీలు దెబ్బతినిపోవచ్చు. రెండోది- ప్రోటీన్లనేవి మన ఒంట్లో రోగనిరోధక శక్తికి కూడా అత్యంత కీలకమైనవి. ఇవి తగ్గిపోతే రోగనిరోధక శక్తీ తగ్గి, రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కీటోడైట్ వంటివి తీసుకోవాలని అనుకుంటుంటే- ముందు వైద్యులను సంప్రతించి కొన్ని పరీక్షలు చేయించుకుని.. గుండె, లివర్, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయత్నించటం మంచిది. అంతా గుర్తించాల్సిన విషయం ఏమంటే- ఎవరైనా బరువు తగ్గటమన్నది ఆరోగ్యకరంగా తగ్గాలి. దానివల్ల ఇతరత్రా సమస్యలు ముంచుకొచ్చేలా ఉండకూడదు. కానీ ‘కీటో డైట్’ వంటివి నెలల తరబడి తీసుకుంటే ఎలాంటి ప్రభావం లేదా దుష్ప్రభావాలు ఉంటాయన్నది చెప్పేందుకు దీర్ఘకాలిక అధ్యయనాలేవీ లేవు. బరువు తగ్గేందుకు ఆహార నియంత్రణ, వ్యాయామం వంటి తంటాలు పడేకంటే ‘కీటో డైట్’ ఒక్కటి చేసేస్తే పోతుందన్న భావనా సరికాదు. ఎందుకంటే వ్యాయామం వల్ల ఇతరత్రా కూడా ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, అవన్నీ ఇప్పటికే కచ్చితంగా నిరూపణ అయ్యాయి. కాబట్టి మితాహారం, రోజూ చక్కటి శారీరక శ్రమ.. వీటితో బరువు తగ్గేందుకు ప్రయత్నించటమే అన్ని విధాలా శ్రేయస్కరం! |
మధుమేహులూ.. బహుపరాక్! మధుమేహులు ‘కీటో డైట్’ వంటివి ఆరంభించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మధుమేహుల్లో సహజంగానే ‘ఫ్యాట్ మెటబాలిజం’ ఎక్కువగా జరుగుతుంటుంది. వీరిలో పిండిపదార్థాల కంటే కూడా కొవ్వు పదార్థాలను శక్తిగా మార్చుకోవటమన్నది ఎక్కువ. ఇది స్వతహాగానే మధుమేహంలో ఉండే ఒక లక్షణం. దాన్ని సరిచేసేందుకే మనం బయటి నుంచి మందులు, ఇన్సులిన్ తదితరాలు ఇస్తుంటాం. కాబట్టి మధుమేహులు సహజంగానే ‘కీటోజెనిక్’గా ఉంటారన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దీనివల్ల మనం ఏ కొంచెం మార్పులు తీసుకువచ్చినా వీరిలో రక్తంలో ‘కీటోన్ బోడీస్’ అనేవి తయారై, ఆమ్ల అయాన్లు పెరిగిపోయి.. ‘కీటోసిస్’ అనే ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోతారు. సాధారణ ఆరోగ్యవంతులకు రక్తంలో ఈ ‘కీటోన్ బోడీస్’కు సంబంధించిన ‘సీరం ఎసిటోన్’ అనేది 1 ఎంజీ/డీఎల్ లోపే ఉండాలి. మధుమేహుల్లో ఇది 1 నుంచి 3 మధ్య ఉన్నా కూడా దీనివల్ల రకరకాల దుష్ప్రభావాలు బయల్దేరతాయి. ఇక ఇది 5 ఎంజీ/డీఎల్ దాటిపోతే వాళ్లు స్పృహతప్పి కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కీటోడైట్ వంటివి పాటించే మధుమేహులు ఈ దుష్ప్రభావాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజూ మూత్ర పరీక్ష తప్పనిసరి మధుమేహుల్లో సీరం ఎసిటోన్ అనేది పెరగటం వల్ల- 1. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. 2. ఒకవైపు కణాల నుంచి.. మరోవైపు కిడ్నీల నుంచి అధికంగా నీరు బయటకు వెళ్లిపోతుంటుంది. దీంతో రక్తం చిక్కబడటం మొదలవుతుంది. వీటి కారణంగా మనిషి ‘ఇంట్రాసెల్యులార్ డీహైడ్రేషన్’, ‘హైపర్‌ఆస్మలారిటీ’ల్లోకి వెళ్లి.. వీటి ఫలితంగా ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యం, గుండె కండరాల పంపింగ్ సామర్థ్యం తగ్గుతాయి. మెదడుకు కూడా ఆక్సిజన్ తగ్గుతుంది. 3. ఎముకల్లోంచి క్యాల్షియం కరగటం మొదలై, చివరికి మూత్ర అవయవాల్లో గట్టిపడి క్యాల్షియం రాళ్లు ఏర్పడొచ్చు. కాబట్టి మధుమేహులంతా కూడా అసలీ స్థితి తలెత్తకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ‘కీటో డైట్’ వంటివి పాటించేవాళ్లు రోజూ మూత్ర పరీక్ష చేయించుకుంటూ ఉండాల్సిందే. మూత్రంలో ‘కీటోన్ బోడీస్’ అనేవి ఉండకూడదు. అవి కనిపించాయంటే అప్పటికే రక్తంలో ‘సీరం ఎసిటోన్’ పెరిగిందని అర్థం. (అయితే మూత్రంలో కీటోన్ బోడీస్ కనబడకుండా కూడా సీరం అసిటోన్ పెరిగి ఉండొచ్చు). కాబట్టి వీళ్లు రోజూ మూత్రపరీక్ష, తరచూ రక్తంలో సీరం అసిటోన్ స్థాయులు పరీక్ష చేసి చూసుకుంటూ ఉండాల్సిందే. మూత్రంలో కీటోన్ బోడీస్‌ను గుర్తించటమన్నది చాలా తేలికైన, చవకైన పరీక్ష కూడా. ప్రతి దీన్ని చేసుకోవటం ఉత్తమం. ఇక ఒంట్లో లవణాలు, సూక్ష్మపోషకాలు తగ్గకుండా రోజూ విటమిన్ మాత్రలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయులనూ చూసుకుంటూ ఉండాలి. ఎంత బరువు తగ్గొచ్చు? వైద్యపరంగా నెలకు 2 కేజీలకు మించి ఎక్కువ బరువు తగ్గటం ప్రమాదకరం. కాబట్టి పాటిద్దామని అనుకునేవాళ్లు వారానికి 4 రోజులు మాత్రమే కీటోడైట్ వంటివి తీసుకుని, మిగతా రెండుమూడు రోజులైనా సమతుల ఆహారం తీసుకోవటం మంచిది. అలా చేస్తే నెలకి ఒక్కసారే 5-10 కేజీలు తగ్గిపోకుండా.. నెలకు 2 కిలోల వరకు తగ్గుతారు. ఎక్కువ సమయం పట్టినా కూడా నెమ్మదిగా తగ్గటం మంచిది. బరువు ఎక్కువ ఉన్నవాళ్లు (అంటే బీఎంఐ 23 కంటే ఎక్కువున్నవాళ్లు) బరువు తగ్గేందుకు మాత్రమే కీటోడైట్ వంటి ప్రయోగాలు చేసుకోవచ్చేమోగానీ.. కేవలం మధుమేహం తగ్గించుకోవటం కోసమే ఇలాంటి ప్రయోగాలు చెయ్యటం అస్సలు శ్రేయస్కరం కాదు! ముఖ్యమైన విషయం ఏమంటే- బరువు తగ్గేందుకు చేసే ఇలాంటి ఆహార ప్రయోగాలతో మధుమేహం తగ్గినట్లు కనబడినా అది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలాంటి పరిశోధనలు/ప్రయోగాలేవీ కూడా 3-4 నెలలకు మించి చేసిన దాఖలాల్లేవు. 3-4 నెలలు ఈ డైట్‌ను పాటిస్తే ఆ ప్రభావంతో తర్వాత కూడా కొద్ది వారాలు, నెలల పాటు మధుమేహం అదుపులో ఉన్నట్టే ఉండొచ్చు (లెగసీ ఎఫెక్ట్). కానీ ఈ ప్రయోజనాలు శాశ్వతంగా ఉంటాయనుకోకూడదు. కాబట్టి అందరూ బరువు తక్కువగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకు పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు.. ఈ మూడూ తగుపాళ్లలో ఉండే సమతులాహారం తీసుకుంటూ, వాటి మొత్తం పరిమాణాన్ని తగ్గించుకుని, మితంగా తింటూ నిదానంగా బరువు తగ్గించుకోవటమే ఉత్తమం. |
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
పాతపట్నం
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
సెల్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి