17, మార్చి 2020, మంగళవారం

స్మార్ట్ ఫోన్ అతిగా వాడుక వల్ల వచ్చే ప్రమాదం ఏమిటి


స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించుకోకుంటే ఎన్నో సమస్యలు!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 





అన్నింటికీ స్మార్ట్ ఫోనే ఆధారంగా మారింది. నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. కానీ, అదొక తీవ్రమైన అలవాటుగా మారి, రోజులో ఓ రెండు గంటలకు మించి స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టయితే జాగ్రత్త. లేకుంటే తర్వాత వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం లక్షలాది రూపాయలు వైద్యం రూపంలో ఖర్చు చేయక తప్పదంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులు, వైద్యులు. కనుక స్మార్ట్ ఫోన్ వినియోగం వెనుక ఉన్న దుష్ప్రభవాల గురించి స్మార్ట్ యూజర్లుగా తెలుసుకుందాం.

వెన్నెముక సమస్యలు
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్న సమయంలో ఫొటో తీయమని మీ స్నేహితుడికి చెప్పండి. ఫొటో తీసే సమయంలో మీరు ఎప్పుడు మాదిరిగానే స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండండి. ఆ తర్వాత ఆ ఫొటోను పరిశీలించండి. మీ మెడ ముందుకు బెండ్ అయి ఉంటుంది. ఒకే కోణంలో తలను కిందకు వంచి ఉంచడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతుంది.అమెరికన్ వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ కెన్నెత్ హన్స్ రాజ్ నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం.... మన తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. తలను ముందుకు వంచి స్మార్ట్ ఫోన్ ను చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడ వంచినప్పుడు  వెన్ను ఎముకపై 18 కిలోలంత భారం పడుతుంది. ఈ స్థాయిలో భారం దీర్ఘకాలం పాటు కొనసాగితే వెన్నుపాములో డిస్క్ ల అరుగుదల (కణజాల క్షీణత) ముందుగానే మొదలువుతంది. వృద్ధాప్యం రాకముందే, నడి వయసులోనే వెన్నెముక సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్ హన్స్ రాజ్ పరిశోధన తెలియజేస్తోంది. దీనికి ఆయన సూచిస్తున్న సూచన ఏమిటంటే... మెడ భాగం ముందుకు వంగకుండా, వెన్నెముకను ఎప్పటిలానే తటస్థంగా ఉంచుతూ స్మార్ట్ ఫోన్ వాడుకోవాలి. మరో సూచన ఏమిటంటే సాధ్యమైనంత వరకు వినియోగం తగ్గించడం. కాల్స్, మెస్సేజ్ లు, అత్యవసర మెయిల్స్ వీటికోసమే వాడుకోవడం. వినోద కార్యక్రమాలకు ఫోన్ కు బదులు టీవీ, ఇతరత్రా సాధనాలను ఎంచుకోవడం.

representative imageయవతీ, యువకుల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్ను సంబంధిత సమస్యలు గత కొన్ని సంవత్సరాల్లో బాగా పెరిగిపోయాయని బ్రిటిష్ చిరో ప్రాక్టిక్ అసోసియేషన్ చెబుతోంది. 2015 గణాంకాల ప్రకారం 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 45 శాతం మంది నడుం నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. వెన్నెముక డిస్క్ లపై భారం మోపడమే దీనికి కారణం.

నరాలు దెబ్బతినిపోవడం
స్మార్ట్ ఫోన్ వినియోగంతో దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒసిప్టల్ న్యూరాల్జియా. ఇదో నరాల సంబంధిత సమస్య. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు ఒత్తిడికి గురై వాచిపోవడం ఈ స్థితిలో జరుగుతుంది. దీంతో తలనొప్పి లేదా తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్ ఎదురవుతుంది. ఇది వస్తే మాత్రం నయం కాదు. నొప్పిని అదుపు చేసేందుకు మందులు వాడుకోవడం, విశ్రాంతి తీసుకోవడమే. యోగా చేయడం, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేయడం ద్వారా రిలీఫ్ ఉంటుంది.

ప్రమాదాలు
స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటడం, స్మార్ట్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం... ఈ పరధ్యానంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్న వారు, గాయలపాలవుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటున్నారు. అంగవైకల్యం బారిన పడి బాధపడుతున్న వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. అందుకే రోడ్డుపైన, రద్దీ ప్రదేశాల్లో ఫోన్ వాడడం ఎంత మాత్రం సురక్షితం కాదు. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఏటా 1,500 మందికి పైగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తేలింది. 100 కోట్ల మొబైల్ కనెక్షన్లున్న మన దేశంలో ఎంత మంది ఇలా ప్రమాదం బారిన పడుతున్నారో ఆలోచించండి.

కళ్లతో చూడలేరు
స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడకంతో వచ్చే పెద్ద ముప్పు కంటిచూపు దెబ్బతినిపోవడం. కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే నీలి కాంతి (బ్లూ లైట్) దెబ్బతీస్తుంది. దీంతో మయోపియా (దగ్గర దృష్టి) పెరిగిపోతుంని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు గంటల పాటు స్మార్ట్ ఫోన్ వినియోగించే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందట. స్మార్ట్ ఫోన్లు విడుదల చేసే బ్లూ వయలెట్ కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై హాని కారక ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో రెటీనా కేంద్రక భాగంలోని మాక్యులా క్షీణత మొదలవుతుంది. దీంతో కంటిచూపు క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. దీంతో శాశ్వతంగా సెంట్రల్ విజన్ కోల్పోవాల్సి వస్తుందని అమెరికన్ మాక్యులర్ డీజనరేషన్ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది. అంటే ఎదురుగా ఎవరున్నారో చూడలేరు. కేవలం పక్కనున్నవి మాత్రమే కనిపిస్తాయి.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్న వారు తరచూ తలనొప్పి, కళ్లు మంటలకు గురవుతుంటే అదో ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఇక కంటి చూపులో తేడా వచ్చిందంటే ఫోన్ ను కాల్స్ కు తప్ప దేనికీ ఉపయోగించకుండా పక్కన పెట్టేసి వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే 20-20-20 విధానాన్ని అనుసరించాలి. ప్రతీ 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోని వాటిని చూడాలి.ఇటీవల బెంగళూరులో పలు ఆస్పత్రులకు వచ్చిన కేసులను పరిశీలిస్తే... 17 ఏళ్ల యువతి రోజులో ఎక్కువ సమయం తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలోనే గడిపేది. అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉండేది. కొంత కాలానికే ఆమె కంటి చూపులో మార్పు వచ్చేసింది. మైనస్ 1.5 నుంచి మైనస్ 3కి పడిపోయింది. కళ్లు ఎర్రబారడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.  45 ఏళ్లు పై బడిన వారిలో కనిపించే పొడిబారిన కళ్లు (డ్రై ఐస్) సమస్య ఆమెలో ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. దాంతో ఆమెను స్మార్ట్ ఫోన్ ఉపయోగించొద్దని సూచించారు. తీసుకునే ఆహారంలో మార్పులు సూచించడంతోపాటు బయటకు వెళ్లి చేసే పనుల్లో పాల్గొనాలని కూడా చెప్పారు.

మరో ఘటనలో 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తీవ్రమైన తలనొప్పితో వైద్యులను ఆశ్రయించాడు. తీవ్రమైన తలనొప్పి, కళ్ల అలసటతో ఆయన ఆరు నెలలుగా బాధపడుతున్నాడు. అదే పనిగా స్మార్ట్ ఫోన్ వినియోగం, కంప్యూటర్ ముందు పని కారణంగా కంటిలోని కండరాల నొప్పి, కళ్లు పొడిబారడంగా వైద్యులు గుర్తించారు. నెల రోజుల చికిత్స అనంతరం ఫోన్ వినియోగం కాల్స్ కు మినహా ఇంక దేనికీ వాడకుండా అదుపు చేయడం వల్ల అతడు కోలుకున్నాడు.

‘‘కళ్లు రెప్పార్పుతూ ఉండడం అన్నది ఎంతో అవసరం. దీనివల్ల కంట్లో నీరు స్రవిస్తుంటుంది. కానీ, కళ్లను ఆర్పకపోవడంతో కళ్లు పొడిబారతాయి.దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి’’ అని సక్రా వరల్డ్ హాస్పిటల్ కంటి వైద్యులు శిరీష్ నెలివిగి తెలిపారు. ప్రతీ నెలా 300మంది యువతీ యువకులు డ్రై ఐస్ సమస్యతో వస్తున్నట్టు నారాయణ నేత్రాలయ వైస్ చైర్మన్ రోహిత్ శెట్టి అంటున్నారు. ‘‘టియర్ గ్లాండ్స్ (కంట్లో నీటిని విడుదల చేసే గ్రంధులు) అనేవి స్పష్టమైన కంటిచూపునకు ఎంతో అవసరం. ఒకవేళ కళ్లు తేమ లేక పొడిబారితే అప్పుడు టియర్ గ్లాండ్స్ తేమతో కూడిన అక్వెస్ లేయర్ అనే పొరను ఉత్పత్తి చేయలేవు. దీంతో చూపు తగ్గిపోతుంది’’ అని రోహిత్ శెట్టి తెలిపారు.

వినికిడి శక్తికీ నష్టమే
స్మార్ట్ ఫోన్ లో పాటలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ తో చక్కగా వినేస్తున్నారా...? అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ డెఫ్ నెస్ సమాచారం మేరకు... ఆ దేశంలో 2.6 కోట్ల మంది శబ్ద ఆధారిత వినికిడి శక్తి లోపంతో బాధపడుతున్నారు. అలా వచ్చే శబ్దాలలో సెల్ ఫోన్ హెడ్ సెట్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ సౌండ్ తో వింటే  ఈ సమస్య రాదు. 85 డెసిబుల్స్ దాటిన శబ్దాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అధిక సౌండ్ కు గురైనప్పుడు చెవి అంతర్భాగంలోని సూక్ష్మ కేశాలు దెబ్బతింటాయి.

రేడియేషన్
సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హాని కలుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువంటి హాని లేదని మరికొందరి వాదన. కానీ, సెల్ ఫోన్ రేడియేషన్ తో కచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని 200 మంది వైద్య పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్లు మనుషులకు హానిచేసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రకటించింది. బ్రెయిన్ కేన్సర్,  పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే, పూర్తి స్థాయి, కచ్చితమైన నిర్ధరణల కోసం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే సెల్ ఫోన్ ను పూర్తి సిగ్నల్ ఉన్న సమయంలోనే కాల్స్ చేసుకోవడం, నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా స్పీకర్ వాడడం, పని లేనప్పుడు సెల్ ఫోన్ ను చేతిలో ఉంచుకోకుండా దూరంగా ఉంచడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఆందోళన
ఆఫీసులో అప్పటి వరకు పని ఒత్తిడి ముగించుకుని ఇంటికి రాగా, ఆ తర్వాత కూడా ఫోన్ తో కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఆందోళనకు, ఒత్తిడికి కారణమవుతుందని, రక్తపోటు తదితర సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ లో మెస్సేజ్ వచ్చిందా అని తరచూ చూసుకోవడం లేదంటే ఫేస్ బుక్ లో కొత్త పోస్ట్ ఇలా తరచూ ఫోన్ వైపు చూసుకునే వ్యసనం కారణంగా మానసిక గందరోగళ పరిస్థితి ఎదురవుతుందట.

నిద్రాభంగం
స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రపై చెడ్డ ప్రభావం చూపిస్తుంది. రాత్రి పడకగదిలో మంచంపైకి ఎక్కిన తర్వాత స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ వంటి వాటిలో ఏదైనా పట్టుకున్నారంటే నిద్ర సరిగా పట్టదు. 63 శాతం మంది నిద్రాభంగాన్ని ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కారణం స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే బ్లూలైట్. నిద్రించే ముందు కాఫీలు తాగొద్దని చెబుతుంటారు. ఇందులోని కెఫైన్ నిద్రరానీయదు. అయితే, కాఫీ కంటే స్మార్ట్ డివైజ్ ల స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూలైట్ చాలా హానికరమట.

హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపైనే ఓ అధ్యయనం నిర్వహించారు. ఆరున్నర గంటల పాటు బ్లూలైట్, గ్రీన్ లైట్ ప్రభావాన్ని కళ్లపై పడేేలా చూశారు. ఆ తర్వాత ఫలితాలను చూడగా బ్లూ లైట్ గ్రీన్ లైట్ కంటే రెండు రెట్లు అధికంగా మెలటోనిన్ అనే హర్మోన్ ను అణిచేసింది. నిద్ర పట్టడాన్ని బ్లూలైట్ మూడు గంటల పాటు ఆలస్యం చేయగా, గ్రీన్ లైట్ గంటన్నర పాటు ఆలస్యం చేసినట్టు గుర్తించారు. నిద్ర కోసం మెలటోనిన్ అనేది చాలా అవసరం. అది సరిగ్గా విడుదల అయితేనే విశ్రాంతి కావాలన్న సంకేతం మెదడుకు వెళుతుంది.

బ్యాక్టీరియా
టాయిలెట్ సీటుపై ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ పై 10 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా పరిశోధకులు గుర్తించారు. టాయిలెట్ బేసిన్ ను పవర్ ఫుల్ లిక్విడ్లతో శుభ్రం చేసుకుంటాం. కానీ, స్మార్ట్ ఫోన్ ను శుభ్రం చేసేవారు ఎంత మంది ఉంటారు...? ఆల్కహాల్ లేని క్రిమిసంహారక వైప్స్ మందుల షాపుల్లో లభిస్తాయి. వాటితో ఫోన్ ను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా లేకుండా చూసుకోవచ్చు.

మొద్దుగా మార్చేస్తుంది?
స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైతే మెదడుకు సహజ సిద్ధంగా ఉండే సామర్థ్యం తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఫలితంగా మెమరీ పవర్ దెబ్బతింటుంది. మెదడు పాత విషయాలను తిరిగి స్మరణకు చేసుకునే శక్తి బలహీనపడుతుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ పరిశోధకులు 600 మందిపై ఓ పరిశోధన నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ పై తక్కువ సమయం వెచ్చించేవారికి అధిక సమయం వెచ్చించేవారి కంటే ఎక్కువ మేధోశక్తి, విశ్లేషనా శక్తి ఉంటోందని తెలిసింది. ఇక స్మార్ట్ ఫోన్ల కారణంగా శారీరక వ్యాయామాలు, ఇతర పనులు చేసుకునేందుకు కూడా ఆసక్తి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల సమయం దొరికితే దానిపైనే గడిపేయాలనుకోవడమే దీనికి కారణం.

ఏకాగ్రత లోపం
స్మార్ట్ ఫోన్ అతిగా వాడే వారిలో ఏకాగ్రత్త శక్తి బలహీనపడుతుంది. సాధారణంగా మన ఏకాగ్రత సమయం 12 సెకండ్ల కంటే ఎక్కువే ఉంటున్నట్టు 2000లో నిర్వహించిన పరిశోధన ఫలితాలు చెబుతుండగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ఇది 8 సెకండ్లకు తగ్గిందని తేలింది.

చేతివేళ్లలో సమస్యలు
స్మార్ట్ ఫోన్ ను దీర్ఘకాలంపాటు రోజులో అధిక సమయం చొప్పున వాడే వారిలో అరచేయి, వేళ్లలోని ఏముకలు, మణికట్టులో నొప్పులు వంటివి కనిపిస్తాయంటున్నారు.

వ్యక్తిగత సమాచారానికి ముప్పు
స్మార్ట్ ఫోన్లో నేడు దాదాపుగా అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. పొరపాటుగా సెల్ ఫోన్ పోయినా, ఎవరైనా తస్కరించినా అందులో ఉన్న మీ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాల సమాచారం, కాంటాక్టులు, పర్సనల్ ఫైల్స్, మీడియా ఇలా అన్నీ ఇతరుల చేతుల్లో పడితే వచ్చే అనర్థం ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించుకోండి.

ఒంటరితనం.. అందరూ దూరం
స్మార్ట్ ఫోన్ తో వచ్చిన మరో పెద్ద చిక్కు దాన్నే లోకంగా భావిస్తూ అందులోనే గంటల తరబడి సమయం గడుపుతూ మిగిలిన వారిని, మిగిలిన లోకాన్ని విస్మరించడం. భౌతిక ప్రపంచం కంటే ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడడానికి ఇష్టపడతారు. నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నా, బంధువుల ఇంటికి వెళ్లినా, మన ఇంటికి బంధువులు వచ్చినా వారితో వెచ్చించే సమయం స్వల్పమే. ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్ పై చేతి వేళ్లు కదులుతూనే ఉంటాయి. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు సైతం దెబ్బతింటాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ పరిశోధకుల అధ్యయనంలో తేలిందేమంటే... స్మార్ట్ ఫోన్ మనుషుల్ని మరింత స్వార్థపరులుగా మారుస్తుందని. సామాజికంగా, స్నేహంగా జీవించడం తగ్గుతుందట. అంటే ఇతరులకు సాయం చేసే గుణం తగ్గిపోతుంది.

శృంగార జీవితంపైనా...
స్మార్ట్ ఫోన్ పడకగదిలోకి ఎప్పుడో ప్రవేశించింది. దీంతో జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం తగ్గిపోతోంది. నిద్ర కూడా కరువవుతోంది. పడకమంచంపై విశ్రాంతిగా పడుకున్నా చేసే పని స్మార్ట్ ఫోన్ లో విహరించడమే. దీనివల్ల శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. శృంగారం మధ్యలోనూ మెస్సేజ్ లు చూసుకునే వారు ఎంతో మంది ఉంటున్నారు.

కామెంట్‌లు లేవు: