- పిల్లల్లో నీళ్ల విరేచనాలు.. చెయ్యాల్సిందే చేద్దాంLoose Motions For Children++++++ పిల్లల్లో నీళ్ల విరేచనాలు..
చెయ్యాల్సిందే చేద్దాం! +++++++మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకు రెండో అతిపెద్ద కారణం నీళ్ల విరేచనాలు! అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ నీళ్లవిరేచనాల సమస్య మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచం మొత్తమ్మీద 90% విరేచనాల కేసులు మన ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే నమోదవుతున్నాయి. వీటిలో 20-25% మన దేశంలోనే కనబడుతున్నాయి, ఈ విరేచనాల కారణంగా మరణాలు సంభవించటమన్నదీ మన దేశంలోనే ఎక్కువ. నిజానికి దీన్ని ఎదుర్కొనటానికి ఖరీదైన మందులూ, పెద్దపెద్ద చికిత్సలేమీ అక్కర్లేదు. కావాల్సిందల్లా కొద్దిపాటి అవగాహన! అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ.
పిల్లల్లో నీళ్ల విరేచనాలన్నది మనం సర్వసాధారణంగా చూస్తుండే సమస్య! ఈ విరేచనాలు బ్యాక్టీరియా కారణంగా లేదా వైరస్ వల్ల రావొచ్చు. దేని కారణంగా మొదలైనా ఇవి వారం రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. కాకపోతే ఈ లోపు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదన్నది తెలుసుకోవటం చాలా ముఖ్యం.
వ్యాధికి ఒక క్రమం ఉంది!
ఈ విరేచనాలు మొదలవటం, తగ్గటమన్నది ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. మొదటి రోజు వాంతులవుతాయి, రెండో రోజుకల్లా అవి తగ్గిపోతాయి. ఇక మొదటి రోజు చివర్లోగానీ, రెండో రోజు మొదట్లో గానీ విరేచనాలు మొదలవుతాయి. మూడో రోజుకు వాంతులుండవుగానీ విరేచనాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. నాలుగో రోజుకల్లా విరేచనాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఐదు, ఆరు రోజుల్లో పూర్తిగా ఆగిపోతాయి. ఇదీ వ్యాధి క్రమం. దీన్ని మనం ఏం చేసినా ఆపలేం, ఆపాల్సిన అవసరం కూడా లేదు. తల్లిదండ్రులంతా ఈ విషయం గుర్తించాలి. ఇలా ఎందుకు జరుగుతుందంటే- జీర్ణాశయం గోడ లోపలి పొర దెబ్బతింటే.. చికిత్స చేసినా, చెయ్యకపోయినా కూడా అది రెండు రోజుల్లో తిరిగి కోలుకుంటుంది. అందుకే వాంతులు రెండు రోజుల్లో ఆగిపోతాయి. ఇక పేగుల లోపలి పైపొర దెబ్బతింటే అది కోలుకోవటానికి ఐదు రోజుల వరకూ పడుతుంది. దీనివల్లే విరేచనాలు కట్టటానికీ అంత సమయం పడుతుంది. ఈ క్రమాన్ని మనం ఆపలేం. మనం చెయ్యాల్సిందల్లా ఈ సమయంలో బిడ్డ డీలా పడిపోకుండా చూసుకోవటం ఒక్కటే. అందుకేం చెయ్యాలో తెలుసుకుందాం.*ఒకవేళ బిడ్డకు రెండు రోజులకు మించి వాతులవుతున్నాయంటే దానికి యాంటీబయాటిక్స్ వంటి ఇతరత్రా అంశాలేమైనా కారణమవుతున్నాయేమో చూడాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ చేదుగా ఉంటాయి. వీటిని పడుతుంటే పిల్లలు కక్కే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో రెండు రోజుల్లో తగ్గాల్సిన వాంతులు ఎక్కువ రోజులు కొనసాగుతాయి. కాబట్టి మందులేమీ వేయకుండా ఒకరోజు ఓపిక పడితే వాంతులు వాటంతటవే తగ్గిపోతాయి. - అసలు రాకుండా..
చేతి శుభ్రత
నీటి శుభ్రత
ఆహార శుభ్రత
పాత్ర శుభ్రత
పరిసరాల శుభ్రత
శుభ్రతకు తోడు.. పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంగా ఉండేలా చూడటం కూడా ముఖ్యం. అందుకు- ఆర్నెల్ల వరకూ తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకూ అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలి. ఇలా పెరిగిన పిల్లల్లో నీళ్లవిరేచనాల సమస్య చాలా తక్కువగా ఉంటోందని స్పష్టంగా తేలింది.
టీకా కూడా ఇవ్వాలి: మన దేశంలో నీళ్ల విరేచనాల సమస్యకు 30-40% వరకూ రోటా వైరస్‌అనేది కారణమవుతోంది. ఈ వైరస్ కారణంగా వచ్చే విరేచనాలు ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువ, ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి, విరేచనాల మరణాల్లో అధిక భాగం దీనివల్ల సంభవిస్తున్నవే. అదృష్టవశాత్తూ దీన్ని అడ్డుకోవటానికి ఇప్పుడు టీకా అందుబాటులో ఉంది. కాబట్టి పిల్లలకు పద్ధతి ప్రకారం ఈ రోటా వైరల్ టీకాలు ఇప్పించటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. ఈ ఏడాది నుంచీ దీన్ని జాతీయ టీకాల కార్యక్రమంలో కూడా చేర్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నారు. త్వరలో తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఇవ్వబోతున్నారు.
ఇది సహజం!
చాలామంది పసిబిడ్డలు ఎక్కువసార్లు దొడ్డికిపోతున్నారని కంగారు పడుతుంటారు. పుట్టిన రెండు మూడు నెలల వరకూ కూడా పిల్లలు రోజుకు 10-15 సార్లు పోతూనే ఉంటారు. అది సహజం. ఎన్నిసార్లు పాలు తాగితే అన్నిసార్లూ దొడ్డికి పోవచ్చు. బరువు పెరుగుతున్నంత వరకూ దాన్ని విరేచనాల కింద భావించకూడదు. కొద్దికొద్దిగా టు కార్చినట్టు అయ్యే వాటన్నింటినీ విరేచనాలుగా లెక్కించకూడదు. ఆర్నెల్ల తర్వాత రోజుకు 2-3 సార్లు సహజం.
పట్టాల్సింది అమృతం- ఓఆర్‌ఎస్!
వాంతులు అవుతుంటాయి కాబట్టి మొదటి రోజు పిల్లలు నీళ్లు తాగలేకపోవచ్చు. రెండో రోజు నుంచీ తాగగలుగుతారు కాబట్టి ‘ఓఆర్‌ఎస్’ ద్రావణం గానీ, చిటికెడు ఉప్పు-చారెడు పంచదార కలిపిన నీరుగానీ ఎక్కువగా తాగించాలి. విరేచనాలు ఎంత ఎక్కువగా అవుతుంటే ఈ ద్రావణం అంత ఎక్కువగా పట్టాలి. ఇలా తాగించకపోతే పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చి, సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. చాలామంది సెలైన్ ఎక్కిస్తే బలం వస్తుంది, త్వరగా కోలుకుంటారనుకుంటారు. ఇది తప్పు. సెలైన్‌లో నీరు, లవణాలు తప్పించి ప్రత్యేకించి పోషకాలేమీ ఉండవు. ఒంట్లో నీరు తగ్గిపోకుండా చూడటానికి మాత్రమే సెలైన్ ఉపయోగపడుతుంది. మన శరీరం శక్తిపోషకాలను దాచుకోగలదుగానీ నీటిని దాచుకోలేదు. అందుకే విరేచనాల కారణంగా ఒంట్లో నీరు తగ్గిపోతే ప్రాణాపాయం కూడా ముంచుకొస్తుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నీటిని భర్తీ చేస్తుండాలి. అందుకే ‘ఓఆర్‌ఎస్’కు అంతటి ప్రాధాన్యం.
*లంఖణాలు పెట్టొద్దు: చాలామంది అసలే విరేచనాలు అవుతున్నాయి, పేగులను శ్రమ పెట్టకూడదని భావిస్తూ పిల్లలను లంఖణాలు ఉంచుతుంటారు. ఇది సరికాదు. పిల్లలు ఎంత తీసుకోగలిగితే అంత ఆహారం పెట్టొచ్చు. ఈ సమయంలో పేగుల్లో 10-20% ప్రాంతం మాత్రమే వాచి ఉంటుంది. మిగతాదంతా సాధారణంగానే పని చేస్తుంటుంది కాబట్టి ఆహారం ఆపకుండా.. రోజువారీ పెట్టేదాన్నే ఇవ్వటానికి ప్రయత్నించాలి. అలాకాకుండా లంఖణాలు పెడితే కోలుకోవటానికి 10-14 రోజుల వరకూ కూడా పట్టొచ్చు.
ఓఆర్‌ఎస్‌తో పాటు....
కొబ్బరి నీళ్లు, సగ్గుజావ, మజ్జిగ ఇవ్వచ్చు. తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, పిల్లలు అడిగితే రోజూ తినే ఆహారం కూడా ఇవ్వచ్చు. అయితే విరేచనాలయ్యేప్పుడు తీపి ఎక్కువగా ఉండే శీతల పానీయాలు మాత్రం ఇవ్వద్దు. దానివల్ల ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటకుపోతుంది. అలాగే పండ్ల రసాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటిరెండు రోజులు అవి కూడా ఇవ్వకపోవటం మంచిది. పసి పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు పాలు ఆపాల్సిన పని లేదు. కాకపోతే విరేచనాలు 7 రోజులకు మించి అవుతున్న వారిలో పాలలో ఉండే ‘లాక్టోజ్’ను జీర్ణించుకునే శక్తి కొంత తగ్గుతుంది కాబట్టి తాత్కాలికంగా పాలు కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది. మొత్తం ఆపాల్సిన పని లేదు. కోలుకున్న తర్వాత మళ్లీ ఎప్పటిలా ఇవ్వచ్చు.
వెంటనే ఆపే మందులొద్దు!
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వాంతులు, విరేచనాలు మొదలవ్వగానే వాంతులు ఆగిపోవటానికి ఒక మందు, విరేచనాలు కట్టెయ్యటానికి మరో మందు.. ఇలా వేసేస్తుంటారు. మనం మందు వేసినా వెయ్యకపోయినా రెండో రోజు వాంతులు తగ్గిపోతాయి. మన శరీరం సహజంగానే కోలుకుంటుంది, దానికా శక్తి ఉంది. మనం దాన్ని పని చెయ్యనివ్వాలి. అలాగే చాలామంది విరేచనాలు వెంటనే ఆగపోవటానికి ‘లోపెరమైడ్’ రకం మందులు వేస్తుంటారు. ఇవి పేగుల కదలికలను ఆపేస్తాయి. దీనివల్ల విరేచనాలు వెంటనే బంద్ అవుతాయిగానీ.. పొట్టలో చేరిన ఇన్ఫెక్షన్ బయటకు పోకుండా లోపలే ఉండిపోయి సమస్య పెద్దదవుతుంది. మన ఇంట్లో ఏదైనా చెత్తాచెదారం చేరితే మనం దాన్ని సత్వరమే ఎలా బయటకు డ్చేస్తామో.. పొట్ట కూడా ఆ పనే చేస్తుంటుంది. లోపల చేరిన క్రిములు, ఇన్ఫెక్షన్‌ను బయటకు తోసేసే ప్రయత్నం చేస్తుంటుంది. దాన్ని మనం మందులతో అడ్డుకుంటే.. అవన్నీ లోపలే ఉండిపోయి, వ్యాధి ఇంకా పెరిగి, కడుపు ఉబ్బరం వంటివి మొదలవుతాయి. పేగులు మరింతగా దెబ్బతింటాయి. కాబట్టి పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు మనం మందులు వేసెయ్యటం మీద కాదు.. ఓఆర్‌ఎస్ ద్రావణం పట్టటం మీదా, సాధ్యమైనంత వరకూ సాధారణ ఆహారం ఇవ్వటం మీదా శ్రద్ధ పెట్టాలి.
ఇవి ఇస్తే చాలు..
*జింక్: మన భారతదేశంలో చాలామంది పిల్లలకు జింకు లోపం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. దెబ్బతిన్న పేగుల మరమ్మతుకు ఈ జింకు బాగా ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకూ ఉపకరిస్తుంది. కాబట్టి విరేచనాలు అవుతున్నప్పుడు- పేగులు త్వరగా కోలుకునేందుకు జింక్ ఇవ్వటం అవసరం. దీనివల్ల వ్యాధి ఒకటి రెండు రోజులు ముందే నయమవుతోందని అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు కూడా. పైగా ఈ జింకు తీసుకున్న పిల్లల్లో నీళ్లవిరేచనాల సమస్య దీర్ఘకాలికంగా మారే అవకాశమూ ఉండదు. కాబట్టి వీరికి 20 మిల్లీగ్రాముల జింకు రోజూ ఒక మోతాదు చొప్పున 14 రోజుల పాటు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అంతా స్పష్టంగా చెబుతున్నారు. విరేచనాలు తగ్గిపోయినా దీన్ని కొనసాగించాలి.
*ప్రోబయాటిక్స్: నీళ్లవిరేచనాలవుతున్న వారికి ‘ప్రోబయాటిక్స్’ ఇస్తే సమస్య ఓ రోజు ముందే తగ్గిపోతోందని తేలింది. ప్రోబయాటిక్స్ అనేది మంచి బ్యాక్టీరియా. దీన్ని ఇస్తే పేగుల్లో చేరిన చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం తగ్గి, త్వరగా కోలుకుంటారు. ఈ ప్రోబయాటిక్స్‌లో కూడా ‘శాక్రోమైసిస్ బొలార్డీ (ఎస్‌బీ)’ అనేది బాగా ఉపకరిస్తోందని గుర్తించారు. ఇది గట్‌ఫ్లోరా, ఎకోనార్మ్ వంటి రకరకాల పేర్లతో మార్కెట్లో లభ్యమవుతుంది.
ఓఆర్‌ఎస్ పట్టటం, దాంతో పాటు జింక్, ప్రోబయాటిక్స్ ఇవ్వటం.. నీళ్లవిరేచనాలకు ఇంతకు మించి మందులేం అవసరం లేదు!
కానీ చాలామంది విరేచనాలు అనగానే తెలిసీతెలియక యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు. ఇది తప్పు. విరేచనాలకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని వైద్యశాస్త్రంలో ఎక్కడా లేదు. పైగా వాటిని ఇవ్వటం వల్ల విరేచనాలు కట్టకపోగా ఇంకా ఎక్కువ కావచ్చు. దాన్నే ‘యాంటీబయాటిక్స్ అసోసియేటెడ్ డయేరియా’ అంటారు. కాబట్టి మనం ఈ పద్ధతి మార్చుకోవటం చాలా అవసరం.
అయితే... విరేచనాల్లో రక్తం పడితే మాత్రం తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అలాగే రక్తం పడకపోయినా, కేవలం నీళ్లవిరేచనాలే అవుతున్నా కూడా- పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికీయాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమంటే- పోషకాహార లోపం బాగా ఎక్కువగా ఉన్న పిల్లలకు, ఉండాల్సిన దానికంటే 60% బరువు తక్కువున్న పిల్లలకు, నవజాత శిశువులకు, అలాగే విరేచనాలతో పాటు చెవిలో చీము వంటి ఇతరత్రా ఇన్ఫెక్షన్లూ ఉన్నప్పుడు, కలరా ప్రబలంగా ఉన్నప్పుడు.. ఇలాంటి సందర్భాల్లో కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవీ లేనప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు.
మన తీరు మారాలి!
పిల్లలకు నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు వైద్యులు రాసిస్తున్న మందుల చీటీలో ‘ఓఆర్‌ఎస్’ అన్నింటికన్నా పైన ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ‘యాంటీబయాటిక్స్’ పైన ఉంటున్నాయి. జింక్ కచ్చితంగా ఉండాలి, కానీ చాలా తక్కువ మందే దీన్ని ఇస్తున్నారు. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-16) ఈ విషయాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది.
పిల్లలకు విరేచనాలు అయినప్పుడు తెలంగాణలో కేవలం 56% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 47% మందే ‘ఓఆర్‌ఎస్’ పడుతున్నారు. అలాగే తెలంగాణలో 31% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 30% మందే జింక్ ఇస్తున్నారు.
దీనర్థం ఏమిటి? ఆ సమయంలో మనం బిడ్డలకు అత్యవసరమైన ఓఆర్‌ఎస్, జింక్ ఇవ్వటం లేదు.. అవసరం లేని యాంటీబయాటిక్స్ మాత్రం విరివిగా ఇస్తున్నాం. ఈ పరిస్థితి, ఈ గణాంకాలు మారటం చాలా అవసరం!
వదలకుండా వేధిస్తుంటే..
సాధారణంగా నీళ్లవిరేచనాల సమస్య ఏడు రోజుల్లో తగ్గిపోతుంది. దీన్ని ‘అక్యూట్ డయేరియా’ అంటారు. కొందరిలో ఇలా తగ్గకుండా ఎక్కువ రోజులు వేధించొచ్చు. 14 కంటే ఎక్కువ రోజులు అవుతుంటే వీడని నీళ్లవిరేచనాలు (పర్‌సిస్టెంట్ డయేరియా) అనీ, 30 రోజుల కంటే ఎక్కువగా కొనసాగుతుంటే దాన్ని దీర్ఘకాలిక డయేరియా (క్రానిక్ డయేరియా) అనీ అంటారు. దీనికి చాలా వరకూ క్రిముల వల్ల (ఇన్ఫెక్షన్లు), లేదా రోగనిరోధక వ్యవస్థ దోషాల వల్ల (ఇమ్యూన్ మాడ్యులేటెడ్) లేదా పేగు పూతల వల్ల (ఇన్‌ఫ్లమేటరీ) కావచ్చు. వీటిని గుర్తించి చికిత్స చెయ్యటం చాలా అవసరం.
*ఇన్ఫెక్షన్లు: ఏకకణ జీవులైన జియార్డియా, అమీబా వంటివి పొట్టలో చేరి, ఇన్ఫెక్షన్ తలెత్తటం వల్ల విరేచనాలు దీర్ఘకాలం కావచ్చు. వీరికి కడుపు నొప్పి ఉంటుంది. తినగానే విరేచనానికి వెళుతుంటారు. మలం కూడా కొవ్వుకొవ్వుగా ఉంటుంది, కడిగినప్పుడు చెయ్యి కూడా జిడ్డుగా తెలుస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే మెట్రోనిడజోల్, నిటజాక్సిసైడ్ వంటి ‘యాంటీ జియార్డియల్’ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇవ్వగానే సమస్య వెంటనే తగ్గిపోతుంది. అరుదుగా రోగనిరోధక వ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న పిల్లల్లో, ముఖ్యంగా ఎయిడ్స్ బాధితుల్లో ‘క్లిప్టోస్పొరీడియం’ అనే ఇన్ఫెక్షన్ వల్ల విరేచనాలు వీడకుండా వేధిస్తుంటాయి. పేగుల్లో క్షయ ఉన్నా ఇలాంటి లక్షణాలే కనబడతాయి. కాబట్టి విరేచనాలు వదలకుండా వేధిస్తుంటే ఇవేమైనా ఉన్నాయేమో చూడటమూ అవసరమే.
*సరిపడని సమస్య: రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో లోపాల వల్ల కూడా విరేచనాలు పట్టుకోవచ్చు. ముఖ్యంగా గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి వాటిలో ఉండే ‘గ్లుటెన్’ అనే ప్రోటీను పడకపోవటం వల్ల కొందరికి కడుపు ఉబ్బరం, నొప్పి, విరేచనాలు విడవకుండా వేధిస్తుంటాయి. దీన్ని ‘గ్లుటెన్ ఎంటరోపతి’ అంటారు. ఒకప్పుడు ఈ సమస్య మన దేశంలో లేదనుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని గుర్తించే వెసులుబాటు రావటంతో మన జనాభాలో కనీసం 1% మంది దీనితో బాధపడుతున్నారని గుర్తించారు. ఈ పిల్లల్లో బరువు, ఎదుగుదల సరిగా లేకపోవటం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలూ ఉండొచ్చు. దీన్ని గుర్తిస్తే చాలు.. వెంటనే గోధుమ ఉత్పత్తులు ఆపేస్తే ఈ సమస్యా తగ్గిపోతుంది.
*పేగుపూత: కొందరికి పేగులు పూచిపోతాయి. వీటిని ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిజార్డర్స్’ అంటారు. ఈ వాపు, పూత చిన్నపేగుల్లో వస్తే ‘క్రాన్స్ డిసీజ్’ అనీ, పెద్దపేగుల్లో వస్తే ‘అల్సరేటివ్ కోలైటిస్’ అనీ అంటారు. ఇవి 5 ఏళ్లలోపు తక్కువ. 5-15 ఏళ్లలోపు ఎక్కువగా కనబడుతుంటాయి. వీరిలో పేగులు వాచటమే కాదు.. లోపల అక్కడక్కడ పుండ్లు పుండ్లుగా తయారై, సొన రక్తం కారుతూ, చీము పట్టటం, చిన్న చిన్న చీము గడ్డలు ఏర్పడటం వంటివన్నీ జరుగుతాయి. రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తం కావటం, పేగుల్లో ఉండే బ్యాక్టీరియా, అక్కడి జీవ వాతావరణం దెబ్బతినటం దీనికి మూలం. కొంత జన్యుపరంగానూ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తం ఎక్కువగా పోతూ రక్తహీనత, కంటి వాపు, కీళ్లవాపు/నొప్పి, చర్మం మీద దద్దు, కిడ్నీల్లో రాళ్లు, నోటిలో పుండ్లు వంటివీ ఉంటాయి. దీన్ని గుర్తించి చికిత్స చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. - కొత్తగా.s
*కొత్తగా కనబడుతున్న సమస్య ఆవు, గేదె పాలు పడకపోవటం. దీన్నే ‘బవైన్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ’ అంటారు. పాలు పడకపోవటం వల్ల పేగులన్నీ వాచిపోయి, తిన్నది ఒంట పట్టక మలంలో రక్తం పడుతుంటుంది. ఈ పిల్లలు సరిగా పెరగరు. ఈ సమస్య తల్లిపాల పిల్లలకు తక్కువ, పోత పాల పిల్లల్లో ఎక్కువ. అందుకని పసిబిడ్డలకు మొదటి ఏడాది కచ్చితంగా తల్లిపాలే తాగించాలి. బర్రెపాలు పట్టాల్సి వచ్చినా వాటిని ఏడాది తర్వాతే మొదలుపెట్టాలని చిన్నపిల్లల వైద్యుల సంఘాలన్నీ ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో ఈ రకం అలర్జీ సమస్యలన్నీ తక్కువ.
నీళ్ల విరేచనాల వల్ల మన దేశంలో ప్రతి ఏటా సగటున 70-80 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు - మీ నవీన్ నడిమింటి
- విశాఖపట్నం
19, ఏప్రిల్ 2020, ఆదివారం
పిల్లలు లో విరోచనాలు నివారణ పరిష్కారం మార్గం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి