జాండిస్...కారణాలు...నివారణ
జాండిస్‌ను ఆయుర్వేదంలో ‘కామలావ్యాధి’ అని వర్ణించారు. ఇది యకృత్ (లివర్) కు సంబంధించిన వ్యాధి. లివర్‌ని కాలేయం అని కూడా అంటారు. శరీరంలో ఇది ఒక పెద్ద గ్రంథి. జీర్ణక్రియ మొదలుకొని ధాతు పరిణామం, వ్యర్థపదార్థాలను శుద్ధి చేయడం వంటి అత్యంత ముఖ్యమైన శరీర క్రియా కార్యకలాపాలను ఎన్నో ఇది నిర్వర్తిస్తుంటుంది. ఆహారంలోని నూనె (కొవ్వు)పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమయ్యే పిత్తాన్ని (బైల్) ఉత్పత్తి చేసి, పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో నిల్వ ఉంచుతుంది. కామలా వ్యాధిలో యకృత్ కార్యకలాపాలన్నీ దెబ్బతింటాయి. జాండిస్ వ్యాధి స్వభావం మూడురకాలుగా ఉంటుంది. 1. వైరల్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ 2. అవరోధజం(అబ్‌స్ట్రక్టివ్) 3. ఎర్తరక్తకణాలు అధిక స్థాయిలో బద్దలవడం (హీమోలైటిక్).కారణాలు:
కలుషితమైన ఆహారపదార్థాల సేవన, కలుషితమైన నీరు, ఇతర పానీయాలు, బయట అమ్మే చెరకు రసం, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు మొదలైనవి. వీటిద్వారా హానికరమైన కొన్ని రకాల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి లివర్‌ని దెబ్బతీస్తాయి. దీనివల్ల లివర్‌కి వాపు కలిగి పరిమాణం పెరుగుతుంది. బైలురూబిన్ స్థాయి రక్తంలో అధికమై క్రమ క్రమంగా కళ్లు, గోళ్లు, మూత్రంలో పసుపు పచ్చని రంగు పెరుగుతుంది. ముందుగా ఆరంభంలో జ్వరం, వాంతి- భ్రాంతి ఉంటాయి. ఆకలి మందగించడమే కాకుండా మనం తినే కొవ్వు పదార్థాల జీర్ణక్రియకు కావలసిన బైల్ పేగులలోకి (అంటే ఆంత్రములు) రాదు. వ్యాధి తీవ్రతను బట్టి పొట్ట ఉబ్బరిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ‘కుంభకామలా’ అంటారు.
చికిత్స:
నిదార పరివర్జనం ప్రాథమిక సూత్రం: అంటే కారణానికి దూరంగా ఉండాలి. ఆహారం, నీరు, ఇతర పానీయాలు అత్యంత పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.ఒక రెండు వారాలపాటు పులుపులేని పెరుగు లేక మజ్జిగలో కలిపిన మెత్తటి అన్నం మాత్రమే తినాలి. పులుపు, కారం, మసాలాలు, నూనె పదార్థాలు పూర్తిగా పక్కన పెట్టాలి. ద్రవపదార్థాలు (గ్లూకోజ్ వాటర్, బార్లీనీళ్లు, స్వచ్ఛమైన చెరకురసం, కొబ్బరినీళ్లు మొదలైనవి)పుష్కలంగా తాగాలి. మూత్రం అధికంగా అవ్వడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
మందులు:
లివ్ 52 మాత్రలు: ఉదయం 1, రాత్రి 1.
ఆరోగ్యవర్థని మాత్రలు: ఉదయం 1, రాత్రి 1
నిరోసిల్ మాత్రలు: ఉదయం 1, రాత్రి 1
ఇది భూమ్యామలకి అంటే నేల ఉసిరిక మొక్క స్వరసం నుండి చేసిన ఔషధం. లభిస్తే, మాత్రలకు బదులు ఈ స్వరసాన్ని రెండు చెంచాలు లేదా పది మి.లీ. తేనెతో కలిపి రెండుపూటలా సేవింవచ్చు.
నివారణ:
ప్రస్తుతం ఆషాఢమాసం మొదలుకొని వర్షాకాలం పూర్తయే వరకు మరిగించి చల్లార్చిన నీళ్లు తాగటం, బయటి తిళ్లు, పానీయాల జోలికి పోకుండా ఉండటం ప్రధానాంశం. డాక్టర్ల సలహా లేకుండా ఏ వ్యాధికీ ఎలాంటి మందులూ వాడవద్దు. మద్యపానం, ధూమపానం చేయవద్దు. గమనిక:పైన చెప్పిన ఇతర రెండు రకాల కామలాల (అబ్‌స్ట్రక్టివ్, హీమోలైటిక్) కారణాలు, చికిత్సలు వేరేవిధంగా ఉంటాయి. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్టివ్ హెపటైటిస్‌కి పైన చెప్పిన సూచనలు పాటించాలి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి