కరోనావైరస్ సైలెంట్ స్ప్రెడర్స్: ఎటువంటి వ్యాధి లక్షణాలూ లేకుండా మన మధ్యే ఉంటూ... వైరస్‌ను వ్యాపింపచేస్తోంది వీరేనా? అవగాహనా కోసం నవీన్ సలహాలు
కోవిడ్-19 మహమ్మారి ఎలా మెల్లమెల్లగా ప్రపంచమంతా వ్యాపించిందో, అలాగే శాస్త్రవేత్తలకు కొత్త కరోనా వైరస్ గురించి విచిత్రమైన, ఆందోళనకరమైన ఆధారాలు లభిస్తూవచ్చాయి. ఈ వైరస్‌కు గురైన చాలామందిలో దగ్గు, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించేవి.
కానీ, వైరస్ వచ్చినా, అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించని వారు కూడా చాలామంది ఉన్నారు. దాంతో, తాము కోవిడ్-19 వ్యాధితో అంతా తిరిగేస్తున్నామనే విషయం వారికి ఎప్పటికీ తెలీకుండానే ఉండిపోయింది. ఇదంతా ఒక వ్యక్తి తనకు తెలీకుండానే జేబులో బాంబు పెట్టుకుని తిరిగినట్టు అనిపిస్తుంది.
“ప్రపంచవ్యాప్తంగా ఇలా లక్షణాలు కనిపించని వైరస్ వ్యాపించిన వారు ఎంతమంది ఉన్నారో, వారందరి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని కరోనావైరస్‌పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎందుకంటే, ఈ ‘సైలెంట్ స్ప్రెడర్’ లేదా చడీచప్పుడు కాకుండా వైరస్ వ్యాప్తి చేస్తున్న వారే ఈ మహమ్మారి పరిధిని పెంచుతున్నారా అనే విషయం మనకు తెలిసేది అప్పుడే.
కొత్త కరోనావైరస్ ‘సైలెంట్ స్ప్రెడర్’ గురించి మొట్టమొదట సింగపూర్ డాక్టర్లు అంచనా వేశారు. జనవరి 19న సింగపూర్‌లోని ఒక చర్చిలో సర్వీస్ కోసం జనం గుమిగూడినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై ఆ ప్రార్థన సభ ప్రభావం ఉండబోతోందనే విషయం వారికి ఏమాత్రం తెలీదు.
ఆరోజు ఆదివారం. చర్చిల్లో జరిగే ఒక మామూలు ప్రార్థన సభ లాగే ఆ చర్చిలో మాండరిన్ లేదా చైనా భాషలో సర్వీస్ జరుగుతోంది. ‘ద లైఫ్ చర్చ్ అండ్ మిషన్స్’ అనే ఆ ప్రార్థన సభ ఒక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో జరుగుతోంది. అందులో ఒక భార్యాభర్తల జంట ఉంది. వాళ్లు ఆ రోజు ఉదయమే చైనా నుంచి సింగపూర్ వచ్చారు. ఇద్దరి వయసూ 56 ఏళ్లకు దగ్గరగా ఉంటుంది.
రహస్యంగా కరోనావైరస్ వ్యాప్తి
వారు ఆ చర్చి సమావేశంలో పాల్గొన్నప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా కనిపించారు. దాంతో వారికి కరోనా ఉందని ఎవరికీ ఎలాంటి సందేహం రాలేదు.
ఈ ఏడాది జనవరి వరకూ కోవిడ్-19 అంటే అంటే తీవ్రమైన దగ్గు ఉంటుందని, దాని ద్వారానే ఆ వ్యాధి వ్యాపిస్తుందని అనుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్టు అసలు ఎలాంటి లక్షణాలే కనిపించనప్పుడు, వ్యాధి వ్యాప్తికి అతడే కారణం అని ఎలా నమ్మగలం.
చైనా నుంచి వచ్చిన దంపతులు ప్రార్థన సభలో పాల్గొన్న తర్వాత వెంటనే వెళ్లిపోయారు. కానీ, కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు ఘోరంగా, ఎవరికీ అంతుపట్టని విధంగా మారిపోయాయి.
ఆ సభలో పాల్గొన్న 3 రోజుల తర్వాత అంటే జనవరి 22న మొదట భార్యకు జబ్బు చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకు భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఎందుకంటే వారిద్దరూ వైరస్‌కు కేంద్రం అయిన వుహాన్ నుంచి వచ్చారు. అయితే వారు అనారోగ్యానికి గురైనందుకు ఎవరూ కంగారు పడలేదు.
కానీ, తర్వాత వారం రోజులకు మరో ముగ్గురు స్థానికులకు అంతుపట్టని విధంగా కరోనా వైరస్ సోకడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. సింగపూర్‌లో కరోనా వైరస్ మొదటి కేసులు అవే. అది వారికి ఎలా వచ్చిందో తెలుసున్నప్పుడు అత్యంత భయంకమైన వాస్తవం ఒకటి బయటపడింది.
కొత్త కరోనావైరస్ కొత్త వారిని ఎంత సులభంగా వేటాడుతుంది అనే విషయం అందరికీ తెలిసింది అప్పుడే
'డిటెక్టివ్స్ ఫర్ డిసీజెస్' ప్రచారం
సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సంక్రమిత వ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ వర్నాన్ లీ దాని గురించి చెప్పారు.
“మేం వారికి వైరస్ వచ్చేసరికి చాలా కంగారు పడ్డాం. ఏమాత్రం సంబంధం లేనివారికి కూడా అది సోకింది. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏదంటే, వారిలో వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. అప్పటికి కోవిడ్-19 గురించి ప్రపంచానికి తెలిసినదాన్ని బట్టి, వారికి కరోనా రావడానికి బయట ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు” అన్నారు.
డాక్టర్ వర్నాన్ లీ, ఆయన సహచరులు, పోలీసులు, వ్యాధి గురించి తెలిసిన మిగతా నిపుణులతో కలిసి ఈ కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వైరస్ వ్యాపించిన వాళ్లు ఎప్పుడెప్పుడు. ఎక్కడికెళ్లారు అనేదానిపై ఈ టీములన్నీ కలిసి వివరంగా ఒక లే-అవుట్ తయారుచేశాయి.
అందులో ‘కంటాక్ట్ ట్రేసింగ్’ అనే అద్భుతమైన టెక్నిక్ ఉపయోగించారు. ఈరోజు బ్రిటన్ కూడా వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకోడానికి ఇదే టెక్నిక్ ఉపయోగిస్తోంది. మహమ్మారి వ్యాపించిన సమయంలో వైరస్ వచ్చిన వారి జాడలు గుర్తించడానికి ఇది చాలా ముఖ్యం అని భావిస్తున్నారు.
ఎందుకంటే, దీని సాయంతో కరోనా వచ్చిన వ్యక్తులు వేరే వారికి అది సోకేలా చేయకముందే, మిగతా వారి నుంచి వారిని వేరు చేయచ్చు. సింగపూర్ ఏ పనైనా చాలా సమర్థంగా, వేగంగా చేస్తుందని చెబుతారు. ఈ పనిని కూడా అది చేసి చూపించింది.
వైరస్ గుట్టు విప్పారు
ఆశ్చర్యం కలిగించేలా తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నవారు 191 మందిని కలిసి, వారితో మాట్లాడారు. వారిలో 142 మంది ఆదివారం వుహాన్ దంపతులు హాజరైన చర్చి ప్రార్థన సభలో పాల్గొన్నట్టు తెలిసింది.
“సింగపూర్‌లో పాజిటివ్ వచ్చిన ఈ ఇద్దరు కూడా ఆ చైనా దంపతులతో మాట్లాడారేమో, చర్చి సర్వీస్ సమయంలో పరస్పరం పలకరించుకున్నారేమో” అని డాక్టర్ వర్నాన్ లీ అన్నారు.
కరోనావైరస్ గుట్టు విప్పే దిశగా ఇది చాలా ఉపయోగపడే ప్రారంభం. ఇప్పుడు కరోనావైరస్ ఇతరులకు ఎలా వ్యాపించింది అనే విషయం తెలిసింది.
అయితే సింగపూర్ డాక్టర్లకు ఈ టెక్నిక్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకూ లభించలేదు.
చైనా దంపతులకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేనపుడు, వారి నుంచి అది వేరేవారికి ఎలా వచ్చింది. దీనిని మించిన చిక్కుప్రశ్న ఇంకొకటి ఉంది.
అదే చర్చికి వెళ్లినా, చైనా దంపతులు పాల్గొన్న ఆ సభకే వెళ్లని ఒక సింగపూర్ మహిళకు కూడా కరోనా వచ్చింది.
ఆ మహిళ వయసు 52 ఏళ్లు. ఆమె అదే రోజు వుహాన్ దంపతులు పాల్గొన్న సభ జరిగిన కొన్ని గంటల తర్వాత జరిగిన మరో సర్వీస్‌లో పాల్గొన్నారు. అయితే, కరోనావైరస్ ఆ మహిళకు ఎందుకు వచ్చింది.
నమ్మలేని ఆధారాలు
ఈ చిక్కుప్రశ్నకు సమాధానం కోసం అధికారులు ఆ రోజు చర్చిలో సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ పరిశీలించారు. వాటిలో ఎవరూ ఊహించని ఒక ఆధారం లభించింది.
చైనా దంపతులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత జరిగిన సర్వీస్‌లో సింగపూర్ మహిళ పాల్గొన్నారు. అప్పుడు ఆమె వుహాన్ నుంచి వచ్చిన చైనా జంట కొన్ని గంటల ముందు కూర్చున్న అదే సీట్‌లో కూర్చున్నారు. దాంతో ఆ దంపతులకు ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకపోయినా, వేరేవారికి వైరస్ వ్యాపించేలా చేశారనే విషయం స్పష్టమైంది.
“బహుశా వైరస్ వారి చేతుల్లో ఉంది. వారు చర్చి సీటును తాకినప్పుడు ఆ వైరస్ అక్కడ వ్యాపించింది. లేదంటే, వారి శ్వాస ద్వారా ఆ వైరస్ నేలపై పడింది. అయితే ఇది అంచనా మాత్రమే. దీనిని పక్కాగా చెప్పలేం” అని లీ చెప్పారు.
కానీ, కారణం ఏదైనా చైనా దంపతుల్లో వైరస్ లక్షణాలు లేవు. తెలిసో తెలీకో వారు మిగతా వారికి అది వచ్చేలా చేశారు. ఆ తర్వాత డాక్టర్ వర్నాన్ లీ ఆ లింకులన్నీ జోడించి ఒక నమూనాను సిద్ధం చేశారు. దాన్నుంచి ఒక విషయం స్పష్టమైంది. చాలా మంది తమకు తెలీకుండానే ఆ వైరస్ మిగతావారికి వచ్చేలా చేస్తున్నారు.
ఇది ఎలాంటి రహస్యం అంటే, ఈ డాక్టర్లు గుర్తించిన ఈ విషయం మొత్తం ప్రపంచమంతా ప్రభావం చూపించబోతోంది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని సూచనల్లో “మీకుగానీ, మీ చుట్టుపక్కల వారికి గానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండండి” అని మాత్రమే చెప్పారు.
కానీ, అసలు లక్షణాలే కనిపించని వ్యక్తులు ఈ వైరస్ వ్యాపించేలా చేస్తున్నారు. వారు నిశ్శబ్దంగా తమకు తెలీకుండానే ఈ వైరస్‌ను మిగతావారికి చేరుస్తున్నారు. అలాంటప్పుడు ఈ వ్యాధిని ఎలా అడ్డుకోగలం అనే ప్రశ్న వస్తుంది.
ఈ విషయం డాక్టర్ వర్నాన్ లీకి తెలిసినప్పుడు ఆయన తన ఆఫీసులో ఉన్నారు. “మనం ఎప్పుడైనా ఒక శాస్త్రీయ ఆవిష్కరణ చేసినప్పుడు, ముఖ్యంగా మనం కనిపెట్టింది చాలా ముఖ్యమైన విషయం అయినప్పుడు, ప్రపంచమే మనకు దాసోహం అయినట్లు ఉంటుంది. దానిని మేం చాలా కష్టపడి, టీమ్ వర్క్ ద్వారా సాధించాం” అని చెప్పారు
లక్షణాలు కనిపించవు, వైరస్ ఉంటుంది
సింగపూర్‌లో డాక్టర్ లీ, ఆయన టీమ్ కొత్త కరోనా వైరస్‌కు సంబంధించిన గుర్తించిన లక్షణాలను ‘ప్రీ సింప్టమాటిక్ ట్రాన్స్ మిషన్’ లేదా ‘లక్షణాలు కనిపించకుండానే వైరస్ వ్యాపించడం’ అంటారు. అందులో వైరస్ వ్యాపించిన వారికి తమలో ఆ వైరస్ ఉందనే విషయమే తెలీదు.
ఎందుకంటే వారికి జ్వరం, దగ్గు, లాంటి వైరస్ వల్ల కనిపించే ఏ లక్షణాలూ ఉండవు. దీనితోపాటూ “ఎవరిలో అయినా కోవిడ్-19 లక్షణాలు కనిపించే ముందు 24 గంటల నుంచి 48 గంటల సమయం చాలా కీలకం” అని సింగపూర్ డాక్టర్ల పరిశోధనలో తెలిసింది.
ఆ సమయంలో పాజిటివ్ వ్యక్తి మిగతా వారికి ఆ వైరస్ వ్యాపించేలా చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బహుశా ఆ సమయంలో వారు చాలా ఎక్కువగా వైరస్ వ్యాపించేలా చేస్తుంటారు. దాని గురించి హెచ్చరించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉండచ్చు.
ఎందుకంటే మీరు వ్యాదికి గురయ్యారని మీకు తెలీగానే, మీరు ఎంత మందికి దగ్గరగా వెళ్లారో వారందరికీ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించవచ్చు. అంటే దానివల్ల వైరస్ వ్యాపించే ప్రమాదకరమైన సమయంలో, వైరల్ లక్షణాలు బయటపడేవరకూ వారంతా తమ తమ ఇళ్లలోనే ఒంటరిగా ఉంటారు..
కానీ, దగ్గు తుంపరలు లేకపోయినా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా వ్యాపిస్తుంది? ఈ చిక్కుముడిని విప్పడం ఇంకా మిగిలే ఉంది. ఈ ప్రశ్నకు ఒక సమాధానం చెప్పుకోవచ్చు.
“శ్వాస తీసుకున్నా, లేదా ఒక వ్యక్తితో మాట్లాడినా కూడా వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు”.
ఒకవేళ, వైరస్ ఇంకా ఒక వ్యక్తి శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలోనే ఉంటే, అతడు ఊపిరి వదులుతున్నప్పుడు కొంత వైరస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎవరైనా వారికి దగ్గరగా ఉంటే, వారు ముఖ్యంగా మూసిన ఒక గదిలో ఉంటే, చాలా సులభంగా వైరస్ వచ్చే అవకాశం ఉంది.
తాకడం అనేది కూడా కోరనావైరస్ వ్యాప్తికి ఒక భయంకరమైన మార్గం కావచ్చు. వైరస్ ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు, అతడు వేరే వ్యక్తిని లేదా తలుపు హాండిల్, లేదా చర్చి సీటును తాకితే, ఆ వైరస్ అక్కడికి చేరుతుంది.
వైరస్ వ్యాపించే దారి ఏదైనా, ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. “ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపించకపోతే, అతడు తను ఉండాల్సినంత జాగ్రత్తగా ఉండడు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది”.
కొందరికి అసలు లక్షణాలు కనిపించలేదు
ఇది మరింత అంతుపట్టని రహస్యంలా అనిపిస్తోంది. శాస్త్రవేత్తల దగ్గర ఇప్పటివరకూ దీని గురించి బలమైన సమాధానం ఏదీ లేదు.
లక్షణాలు కనిపించని ఒక వ్యక్తి వేరేవారికి కరోనా వైరస్ వచ్చేలా ఎలా చేయగలడు? అనేది ఒక వాదన.
కానీ, ఒక వ్యక్తికి కరోనా ఉన్నా, అతడిలో లక్షణాలు కనిపించకపోతే అది మరింత ఆందోళన కలిగించే విషయం.
దాన్నే శాస్త్రవేత్తలు ‘ఎసింప్టమాటిక్’ లేదా ‘ఎలాంటి లక్షణాలూ లేని కేస్’ అంటున్నారు. ఎందుకంటే వారు వ్యాధికి వాహకం అవుతున్నారు. మిగతా వారికి ఆ వైరస్‌ను చేరుస్తున్నారు. కానీ, దానివల్ల వారికి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు.
దీనికి ఐర్లాండ్‌లో నివసించిన ఒక మహిళ మంచి ఉదాహరణ. ఇది గత శతాబ్దం ప్రారంభంలో న్యూయార్కులో బయటపడింది.
ఆ మహిళ పేరు మేరీ మెలన్. ఆమె ఎక్కడ పనిచేసినా, అక్కడున్న వారికి టైఫాయిడ్ వచ్చేది. మేరీ ఒక్కొక్కటిగా చాలా ఇళ్లలో పనిచేసేది. ప్రతి ఇంట్లో టైఫాయిడ్ వ్యాపించేలా చేసింది. దాంతో ముగ్గురు చనిపోయారు. కానీ మేరీకి మాత్రం ఆ వ్యాధి దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదు.
చివరికి మేరీ, వ్యాధికి గురైన వారి మధ్య లింకు బయటపడింది. ఆమె తనకు తెలీకుండానే మిగతావారికి టైఫాయిడ్ వచ్చేలా చేసిందనే విషయం ధ్రువీకరించారు. కానీ ఆమెకు మాత్రం ఎలాంటి తేడా తెలిసేది కాదు.
అప్పట్లో వార్తా పత్రికలు ఆమెకు ‘టైఫాయిడ్ మేరీ’ అనే పేరు పెట్టాయి. దాంతో మేరీకి చాలా కోపం వచ్చింది. కానీ మేరీకి, ఆ వ్యాధికి ఉన్న లింకు తెలీగానే అధికారులు ఆమెను, 1938లో చనిపోయేవరకూ, అంటే దాదాపు 23 ఏళ్ల పాటు ఒంటరిగా ఒక గదిలో ఉంచేశారు.
మన నమ్మకం ముక్కలైతే
బ్రిటన్ నర్స్ ఎమిలియా పావెల్ కూడా కరోనాకు సంబంధించిన ఏ లక్షణాలూ లేకపోయినా, పాజిటివ్ రావడంతో కంగారు పడ్డారు. ఆమె కేంబ్రిడ్జిలోని ఎడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో పనిచేసేవారు. ఏప్రిల్ నెలలో ఆమెకు ఫోన్ చేసిన ఒక డాక్టర్ మీకు కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పారు.
అప్పట్లో ఎమిలియా పూర్తిగా మామూలుగా ఉండేవారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) వేసుకుని తను పూర్తి సురక్షితంగా ఉన్నానని అనుకునేవారు. ఆస్పత్రిలో ఆమె కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేవారు. కానీ, హఠాత్తుగా ఆమె నమ్మకం ముక్కలైంది. తనకు కరోనా రావడంతో ఎమిలియా చాలా భయపడ్డారు.
“డాక్టర్ ఫోన్ చేయగానే నాకు చావుకబురు చెప్పినట్లు అనిపించింది. దానిని అసలు ఊహించుకోలేకపోయాను, నేను బాగానే ఉన్నాను. నాకు కరోనా వచ్చే అవకాశమే లేదు అనుకున్నాను” అని 23 ఏళ్ల ఎమిలియా చెప్పారు.
కరోనా ఉందని తెలీగానే ఆమె తన ఇంట్లో ఐసొలేట్ అయ్యారు. “ఆస్పత్రుల్లో నేను ఆరోగ్య పరిస్థితి ఘోరంగా ఉన్న చాలామంది రోగులను చూశాను.. నాక్కూడా అలాగే అవుతుందేమో అని భయపడ్డా. కానీ నాకు ఆ వైరస్ ఉన్నట్టే అనిపించేది కాదు. రోజూలాగే మామూలుగానే తిని, బాగా నిద్రపోయేదాన్ని” అని ఆమె చెప్పారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పైకి లక్షణాలు కనిపించని ఎంత మందికి ఈ వైరస్ వ్యాపించిందో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఎమిలియాకు కూడా ఈ వైరస్ వచ్చిందని ఆస్పత్రి సిబ్బంది మీద జరిగిన ఒక అధ్యయనంలో తెలిసింది. దానివల్ల షాక్ ఇచ్చే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ అధ్యయనంలో పాల్గొన్న వెయ్యి మందిలో మూడు శాతం మందికి వైరస్ వ్యాపించింది. కానీ వారిలో అప్పటివరకూ వైరస్ లక్షణాలు ఒక్కటి కూడా కనిపించ లేదు.
ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ తీరంలోనే ఆపేసిన క్రూయిజ్ షిప్ ‘డైమెండ్ ప్రిన్సెస్’లో కూడా చాలామంది అలాంటివారు కనిపించారు. వైరస్ వ్యాపించినా, వారిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. తర్వాత ఆ నౌకకు ‘పరివర్తన కప్’ అనే పేరు పెట్టారు.
ఎందుకంటే డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న మొత్తం 700 మందీ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలారు.
అటు వాషింగ్టన్‌లోని ఒక కేర్ హోంలో కూడా సగానికి పైగా వైరస్‌కు గురయ్యారు. అయితే వీరిలో ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదు.
ఏ అధ్యయనాలూ నమ్మలేం
రకరకాల అధ్యయనాల ప్రకారం ఎలాంటి లక్షణాలూ లేని కేసులు ఐదు నుంచి 80 శాతం వరకూ ఉండచ్చు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ హెనెఘన్ ఆ నిర్ణయానికి వచ్చారు. ఆయన 21 రీసెర్చిలను అధ్యయనం చేసి ఈ ఫలితాలు రాబట్టారు.
“ఎలాంటి లక్షణాలూ లేని వారు వైరస్ వ్యాపించేలా చేయడం గురించి జరిగిన అధ్యయనాల్లో ఒక్కటి కూడా నమ్మేలా లేదు. వారు లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. అంటే చాలా కేసులు పరీక్షల పరిధికి బయటే ఉండిపోతున్నాయి. వాటి సంఖ్య బహుశా చాలా ఎక్కువే ఉంటుంది” ” అని ప్రొఫెసర్ హెనెఘన్ టీమ్ చెప్పింది.
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కరోనా లక్షణాలు కనిపించేవారికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు.
సైలెంట్ స్ప్రెడర్ ఎంత iప్రమాదం?
తెలీకుండానే ఎంతమందికి వైరస్ వచ్చేలా చేశానో అని బ్రిటన్ నర్స్ ఎమిలియా ఆందోళనకు కూడా గురయ్యారు. వారిలో ఎమిలియాతో పనిచేసినవారు కూడ ఉండచ్చు. లేదా చికిత్సకు అక్కడకు వచ్చిన రోగులకు కూడా అయ్యుండచ్చు.
కరోనా లక్షణాలు కనిపించని వారు, ఆ వైరస్ వ్యాపించేలా చేయగలరా, లేదా అనేది మనకు ఇప్పటికీ తెలీడం లేదు. అది చాలా విచిత్రమైన విషయం. ప్రస్తుతం దాని గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది.
చైనాలో జరిగిన ఒక అధ్యయనంలో కరోనా లక్షణాలు కనిపించే వారితో పోలిస్తే, వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించని వారి సంఖ్యే ఎక్కువ ఉంటుందని తెలిసింది.
ఈ స్టడీ చేసిన శాస్త్రవేత్తలు “సైలెంట్ స్ప్రెడర్ అనే ఏ లక్షణాలూ లేని ఈ కరోనా వైరస్ వాహకులపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మనం ఈ మహమ్మారిని అడ్డుకోగలం” అన్నారు.
“ముఖ్యంగా లక్షణాలు స్పష్టంగా కనిపించేవారితో పోలిస్తే, ఎలాంటి లక్షణాలూ కనిపించని వారిలో వైరస్‌ను ఇతరులకు వచ్చేలా చేసే సామర్థ్యం తక్కువ ఉందని” డైమండ్ ప్రిన్సెస్ క్రూజ్ నౌకలో ప్రయాణికులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల టీమ్ గుర్తించింది.
అయినా, కరోనా వ్యాపించడంలో కరోనా లక్షణాలేవీ కనిపించనివారు చాలా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లు ‘డార్క్ మేటర్’
‘ఎసింప్టమాటిక్ సైలెంట్ స్ప్రెడర్’ చిక్కుముడిని విప్పడానికి ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని నార్విచ్ నగరంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నగరంలో ఉన్న అందరికీ టెస్టులు చేయాలని వారు ఇప్పుడు పట్టుబడుతున్నారు. అర్ల్ హామ్ ఇన్‌స్టిట్యూట్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ చీఫ్ ప్రొఫెసర్ నీల్ హాల్ “లక్షణాలు లేని కేసులు, ఈ మహమ్మారికి డార్క్ మేటర్” అన్నారు.
‘డార్క్ మేటర్’ అంటే అదృశ్య మూలకం. మొత్తం విశ్వం అంతా దీని నుంచే ఏర్పడిందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ అది ఏదో గుర్తించలేకపోయారు.
“ఏ లక్షణాలు కనిపించని వారు కోవిడ్-19 మహమ్మారి వ్యాపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినా, ఇలాంటి వారి వల్ల కరోనాను అడ్డుకునే విధానాలు విఫలం అవుతున్నాయి” అని ప్రొఫెసర్ హాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
“మీ చుట్టుపక్కల అలాంటి వారు ఉంటారు. తమకు వైరస్ ఉన్నట్లు వారికి అనిపించదు. దాంతో వారు ప్రజా రవాణాను ఉపయోగిస్తారు. ఆస్పత్రులకు, బహిరంగ ప్రాంతాలకు వెళ్తారు. అలాంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్లు మరింత వ్యాపిస్తాయి” అని హాల్ చెప్పారు.
“వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాతే జనం డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే, వారికి చికిత్స చేసినంత మాత్రాన ఈ మహమ్మారిని తరిమికొట్టలేం. అది ఈ సమస్యకు అరకొర పరిష్కారం అవుతుంది” అన్నారు.
ఎవరికి వైరస్ లక్షణాలు కనిపించడం లేదో, ఎవరు కరోనాతో తిరుగుతున్నారో మనం తెలుసుకోలేనప్పుడు అది ఒక పెద్ద కుట్రలా అవుతుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోడానికి అది ఒక పెద్ద సవాలు కూడా” అని కాలిఫోర్నియాలోని ఒక శాస్త్రవేత్తలక టీమ్ చెప్పింది.
ఈ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మహమ్మారిని అడ్డుకోడానికి ఒకే ఒక పద్ధతి ఉంది.
లక్షణాలు కనిపించకపోయినా, ఈ వైరస్ ఎవరెవరికి వచ్చిందో తెలుసుకోవడం. దానికోసం భారీస్థాయిలో కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
బ్రిటన్ ఎంపీల కామన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ కూడా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఇదే సిఫారసు చేసింది.
ఈ మహమ్మారి వ్యాపించడంలో ఏ లక్షణాలు కనిపించని వారు చాలా కీలక పాత్ర పోషించారు. కరోనావైరస్ వ్యాపించిన వారిని చూసుకునే వారికి కూడా క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు చేస్తూ ఉండాలని కూడా వీరు తమ ప్రధానికి సూచించారు.
కరోనా మహమ్మారికి కేంద్రమైన చైనాలోని వుహాన్‌లో కూడా దీనిని విస్తృతంగా పాటిస్తున్నారు. కోవిడ్ కేసులను గుర్తించడానికి నగరంలో 9 రోజుల్లో 65 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించని వారు కూడా ఉన్నారు.
లాక్‌డౌన్‌లో సడలింపులు ప్రారంభం
ఇప్పుడు భారత్ సహా మిగతా దేశాల్లో లాక్‌డౌన్ సడలిస్తున్నారు. దీంతో జనం మెట్రో, బస్సులు, రైళ్లు లాంటి ప్రజా రవాణా ఉపయోగించడం ప్రారంభించారు. కొనుగోళ్ల కోసం మార్కెట్లకు, మాల్స్ వెళ్తున్నారు. అలాంటప్పుడు ఈ కనిపించని ముప్పుపై పట్టు బిగించడం చాలా అవసరం.
ప్రస్తుతం ప్రజల్లో కరోనావైరస్ ఎవరికుందో తెలుసుకోడానికి ఎలాంటి దారీ లేదు. ముఖ్యంగా పరీక్షలు చేయకుండా అది తెలుసుకోవడం అసాధ్యం. అందుకే వైరస్ వచ్చిన వారు కాంటాక్ట్ అయిన వారి వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా సహకరించాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కోరుతున్నాయి.
స్వయంగా మీరు కరోనా వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్ అయితే సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. కరోనాను ఎదుర్కునే అత్యంత బలమైన ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్ మాత్రమే అని ఇప్పటికీ చెబుతున్నారు. మీరు జనాలకు ఎక్కడ దూరంగా ఉండడానికి వీలున్నా, ఆ దూరాన్ని పాటించండి.
ఒకవేళ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సాధ్యం కాకుంటే, మీ ముఖాన్ని కప్పి ఉంచండి. కనీసం ఇంట్లో తయారుచేసిన మాస్క్ అయినా ఉపయోగించండి.
అమెరికా ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రకటించినపుడు సింగపూర్ చర్చిలో జనవరిలో జరిగిన రీసెర్చ్ గురించి ప్రస్తావించింది.
“అలా చేయడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, మీ నుంచి వైరస్ సోకకుండా ఇతరులను రక్షించవచ్చు. ఎందుకంటే, మీరు వైరస్‌కు గురైనా, ఆ విషయం మీకు తెలీదు” అనేది అమెరికా వాదన.
మాస్క్ ధరించాలని పట్టుబట్టడం కంటే, జనం చేతులు శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం లాంటి వాటిని నిర్ళక్ష్యం చేయకుండా చూడాలని చాలామంది నిపుణులు చెబుతున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే, కరోనా వ్యాపించే భయం అలాగే ఉంటుందని అంటున్నారు.
కానీ ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలూ మాస్క్ ధరించడం వల్ల ఈ వైరస్‌ను ఎక్కువ అడ్డుకోగలమని నమ్ముతున్నాయి. అయితే, మాస్కుతో ముఖం కప్పుకున్నంత మాత్రాన ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందనేం లేదు.
కానీ, లక్షణాలు కనిపించని వారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. అందుకే చెప్పిన జాగ్రత్తల్లో ఏదైనా పాటించడం వల్ల మనకు వచ్చే నష్టమేం ఉండదు. అలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగితే, మరీ మంచిది.
కరోనా వైరస్‌కు గురై తీవ్రంగా జబ్బుపడిన రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల విషయానికి వస్తే వరసగా వారాల తరబడి విధుల్లో ఉండడం వల్ల డాక్టర్లు పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నారు. వారిలో చాలా మంది నోట ఒకే మాట వస్తోంది. “మేం ఇలాంటి చికిత్స ఇంతకు ముందు ఎప్పుడూ చూళ్లేదు”.
ఒక కొత్త వ్యాధి వ్యాపించబోతోందనే విషయం డాక్టర్లకు తెలుసు. శ్వాసకు సంబంధించిన ఈ కొత్త వ్యాధితో రోగులు భారీగా తరలివస్తే, ఆస్పత్రుల వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని కూడా వారికి తెలుసు.
కరోనా పాజిటివ్ ఉన్న వారికీ మందులు డాక్టర్ సలహాలు మేరకు వాడాలిఈ ఏజ్ మరియు ఆరోగ్యం సమస్య బట్టి మెడిసిన్ డోస్ ఇవ్వబడును
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమని
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి